SMB
-
వెబ్‌సైట్‌తోనే కంపెనీలకు గుర్తింపు
♦ అతి తక్కువ చార్జీలతో సేవలు ♦ గో డాడీ ఇంటర్నేషనల్ ఈవీపీ ఆండ్రూ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్యతరహా కంపెనీలకు (ఎస్ఎంబీ) వెబ్‌సైట్‌తోనే గుర్తింపు లభిస్తుందని డొమైన్ రిజిస్ట్రీ, వెబ్ హోస్టింగ్ దిగ్గజం ‘గో డాడీ’ తెలిపింది. వెబ్సైట్లను కలిగి ఉన్న కంపెనీల వ్యాపారం పెరిగిందన్న విషయం తమ అధ్యయనంలో తేలిందని గో డాడీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ లోకీ బుధవారమిక్కడ తెలిపారు. ఎస్ఎంబీలకు అతి తక్కువ ఖర్చుతో నెలకు రూ.99 మొదలుకుని ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఔత్సాహికులు ఎవరైనా అర గంటలోనే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసుకునేలా టెక్నాలజీని సులభరీతిన డిజైన్ చేశామన్నారు. ఫేస్బుక్ పేజీ ఉన్నప్పటికీ, కంపెనీలు సొంత వెబ్సైట్లను కలిగి ఉంటున్నాయని వివరించారు. భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించి అయిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 7.5 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అపార అవకాశాలు..: దేశవ్యాప్తంగా 5.1 కోట్ల ఎస్ఎంబీలు ఉన్నాయి. వీటిలో 1.2 కోట్ల కంపెనీలు మాత్రమే ఇంటర్నెట్తో అనుసంధానం అయ్యాయని గో డాడీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ నిఖిల్ అరోరా తెలిపారు. దేశంలో డొమెయిన్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. వెబ్సైట్ల కోసం ఎస్ఎంబీల నుంచి రిజిస్ట్రేషన్లు రెండంకెల వృద్ధి నమోదు చేస్తున్నాయని పేర్కొన్నారు. వెబ్సైట్ ప్రయోజనాలపై చిన్న కంపెనీలకు అవగాహన లేదని.. పోర్టల్‌కు ఎక్కువ ఖర్చు అవుతుందన్న అపోహ ఉందని చెప్పారు. కాగా, 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 31 వరకు రెన్యువల్స్ పై 40% దాకా డిస్కౌంట్‌ను గో డాడీ ప్రకటించింది. -
చిన్న కంపెనీలకు గూగుల్ తోడ్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 5.1 కోట్ల చిన్న, మధ్యతరహా కంపెనీలు (ఎస్ఎంబీ) వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇందులో 68 శాతం కంపెనీలు ఇంటర్నెట్కు దూరంగా ఉన్నాయని గూగుల్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. డిజిటల్ అన్లాక్డ్ పేరుతో ఎస్ఎంబీల వ్యాపారాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కార్యకలాపాలు సాగిస్తున్న నగరానికి వెలుపల ఆఫ్‌లైన్ కంపెనీలు 29 శాతం మాత్రమే కస్టమర్లను సొంతం చేసుకుంటే, ఆన్లైన్ ఆసరాగా చేసుకున్న కంపెనీలు 52 శాతం వినియోగదార్లను దక్కించుకున్నాయని వివరించారు. డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను వివరించే గూగుల్ ప్రైమర్ యాప్‌ను రెండు నెలల్లో 5.50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపారు. తెలుగు సహా 9 భాషల్లో ప్రైమర్ యాప్ అందుబాటులో ఉంది. విరివిగా శిబిరాలు.. డిజిటల్ విప్లవంతో భారత జీడీపీలో ఎస్ఎంబీల వాటా 10 శాతం పెరిగి 2020 నాటికి 48 శాతానికి చేరుతుందని గూగుల్ ఆసియా పసిఫిక్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ఎండీ కెవిన్ ఓకేన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లలో 40 నగరాల్లో 5,000 శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అయిదు నగరాల్లో 2017 జనవరి నుంచి 4 వేల పైచిలుకు చిన్న, మధ్యతరహా కంపెనీలకు గూగుల్ శిక్షణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 80 లక్షల కంపెనీలకు గూగుల్ తోడ్పాటు అందించింది. కాగా, డిజిటల్ సహకారంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్న ఎస్ఎంబీలకు కంపెనీ అవార్డులను ఇవ్వనుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 24. మరిన్ని వివరాలకు జ. ఛిౌ/ టఝbజ్ఛిట్ఛౌటవెబ్సైట్ చూడొచ్చు. -
ఫేస్బుక్లో 15 లక్షల ఎస్ఎంబీలు
న్యూఢిల్లీ : భారత్‌లో సుమారు 15 లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు వినియోగదారులతో అనుసంధానం కావడానికి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు వంద కోట్ల మంది యూజర్లున్నారని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఫేస్బుక్ ప్లాట్‌ఫారమ్‌పై 4 కోట్ల యాక్టివ్ చిన్న వ్యాపార సంస్థల పేజీలున్నాయి. వీటిల్లో భారత వాటా 15 లక్షలని, ఈ సంఖ్య ప్రతీ ఏడాది 70 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. యువజనుల్లో ఎక్కువమంది, వినియోగదారుల్లో కొంతమంది తాము కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సైట్ల ద్వారా సేకరిస్తున్నారని వివరించారు. దీంతో పలు కంపెనీలు ఈ డిజిటల్ మాధ్యమానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ఫేస్‌బుక్‌కు అమెరికా తర్వాత ఇండియానే అతి పెద్ద మార్కెట్. చిన్న, మథ్య తరగతి వ్యాపార సంస్థల కోసం ఫేస్బుక్ ఈ ఏడాది యాడ్స్ మేనేజర్ యాప్‌ను, బిల్టి క్రియేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఫర్ స్మాల్ బిజినెస్ మార్కెటీర్స్ ను ప్రారంభించామని తెలిపారు.