2024–25పై ఇక్రా అంచనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగంలోని టాప్–25 సంస్థల ఆదాయ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇక్రా ప్రకారం.. భారతీయ మొత్తం ఔషధ పరిశ్రమలో 60 శాతం వాటా కలిగిన ఈ కంపెనీల ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం పెరిగింది.
2023–24 నాటి అధిక అమ్మకాలను అనుసరించి 2024–25లో యుఎస్ 8–10 శాతం, యూరప్ మార్కెట్ల నుండి 7–9 శాతం ఆదాయ వృద్ధి నమోదుకు ఆస్కారం ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది యూఎస్ 18–20, యూరప్ 16–18 శాతం ఉండవచ్చు. దేశీయ మార్కెట్ 6–8 శాతం స్థిర వృద్ధిని చూడగలదు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు 2024–25లో 8–10 శాతం, 2023–24లో 16–18 శాతం పెరుగుదలను నమోదు చేయవచ్చు.
పెరిగిన కొత్త ఉత్పత్తులు..
2023–24లో పెరిగిన కొత్త ఉత్పత్తుల విడుదల, ఎంపిక చేసిన చికిత్స విభాగాల్లో ఉత్పత్తి కొరత, సంక్లిష్ట జనరిక్స్ ఆరోగ్యకర పనితీరు యూఎస్ విపణిలో టాప్–25 భారతీయ కంపెనీల ఆదాయ వృద్ధికి కారణం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అధిక వృద్ధి ఉన్నప్పటికీ 2024–25లో వృద్ధి తగ్గుతుందని అంచనా. యుఎస్ మార్కెట్‌లో స్వల్ప ధరల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, భారతీయ ఫార్మా సంస్థలు యుఎస్ మార్కెట్‌లోని కాంప్లెక్స్ జెనరిక్స్ నుండి తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాయి.
గత సంవత్సరంలో భారతీయ ఔషధ సంస్థలకు యూఎస్‌ఎఫ్‌డీఏ జారీ చేసిన హెచ్చరిక లేఖలు, దిగుమతి హెచ్చరికల సంఖ్య పెరిగింది. దీంతో నూతన ఉత్పత్తుల విడుదలలో జాప్యానికి దారితీసింది. కన్సల్టెంట్‌లను నియమించుకోవడం, అదనపు వనరులను వినియోగించడం వంటి పరిష్కార చర్యలకు గణనీయంగా వ్యయ భారం పడుతోంది. తద్వారా లాభాల మార్జిన్‌లపై ప్రభావం చూపుతోంది.
పొంచి ఉన్న ముప్పు..
కొనసాగుతున్న ఎర్ర సముద్ర సంక్షోభం ప్రస్తుతానికి భారతీయ ఔషధ కంపెనీలపై ప్రభావం చూపనప్పటికీ.. సరఫరా అంతరాయాలు, రవాణా వ్యయాల పెరుగుదల రూపంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైతే అవి కీలకంగా మారతాయి. ధరల పెరుగుదల కీలక ఆదాయ మార్గంగా ఉన్నందున జెనరిక్స్‌కు అనుకూలమైన ఏవైనా పరిణామాలు లేదా ముఖ్యమైన మందుల జాబితా (ఎన్‌ఎల్‌ఈఎం) కింద మరిన్ని ఉత్పత్తులను చేర్చినట్టయితే తయారీ సంస్థలకు నష్టాలు వాటిల్లే ముప్పు పొంచి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment