
కోల్‌కతా: దేశ హోటల్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మంచి వృద్ధిని చూడనుంది. 2024–25లో హోటల్ పరిశ్రమ ఆదాయం మొత్తం మీద 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ విహార పర్యటనలు కొనసాగుతుండడం, సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలనుకు (ఎంఐసీఈ) డిమాండ్ ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తెలిపింది. సాధారణ ఎన్నికల ప్రభావం స్వల్పకాలమేనని పేర్కొంది.
హోటల్ పరిశ్రమ డిమాండ్‌లో ఆధాత్మిక పర్యాటకం, టైర్–2 సిటీలు కీలక చోదకంగా నిలుస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోటళ్లలో గదుల భర్తీ రేటు (ఆక్యుపెన్సీ) దశాబ్ద గరిష్టమైన 70–72 శాతానికి చేరుకుందని, 2022–23లో ఇది 68–70 శాతమే ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా హోటల్ గదుల రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.7,200–7,400 మధ్య ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,800–8,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశ ఆతిథ్య రంగంపై సానుకూల అవుట్‌లుక్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment