Hotel industry
-
హోటల్ పరిశ్రమలో కొనసాగనున్న జోరు
కోల్‌కతా: దేశ హోటల్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మంచి వృద్ధిని చూడనుంది. 2024–25లో హోటల్ పరిశ్రమ ఆదాయం మొత్తం మీద 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ విహార పర్యటనలు కొనసాగుతుండడం, సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలనుకు (ఎంఐసీఈ) డిమాండ్ ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తెలిపింది. సాధారణ ఎన్నికల ప్రభావం స్వల్పకాలమేనని పేర్కొంది. హోటల్ పరిశ్రమ డిమాండ్‌లో ఆధాత్మిక పర్యాటకం, టైర్–2 సిటీలు కీలక చోదకంగా నిలుస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోటళ్లలో గదుల భర్తీ రేటు (ఆక్యుపెన్సీ) దశాబ్ద గరిష్టమైన 70–72 శాతానికి చేరుకుందని, 2022–23లో ఇది 68–70 శాతమే ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా హోటల్ గదుల రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.7,200–7,400 మధ్య ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,800–8,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశ ఆతిథ్య రంగంపై సానుకూల అవుట్‌లుక్‌ను ప్రకటించింది. -
హోటళ్లలో బుల్లిష్ ధోరణి.. పెరిగిన అంతర్జాతీయ ప్రయాణాలు
ముంబై: దేశ ఆర్థిక పురోగతి, భవిష్యత్ అవకాశాల పట్ల దేశీ హోటల్ యజమాన్యాల్లో ఎంతో ఆశావాదం నెలకొన్నట్టు బుకింగ్ డాట్ కామ్ సంస్థ వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో హోటళ్లలో బుకింగ్ రేటు పెరిగినట్టు తెలిపింది. రూమ్ ధరలు పెరిగినట్టు 49 శాతం మంది చెప్పగా.. గత ఆరు నెలల కాలంలో తమ హోటళ్లో గదుల భర్తీ రేటు పెరిగినట్టు 55 శాతం మంది హౌసింగ్ డాట్ కామ్ సర్వేలో తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికుల్లో పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు బుకింగ్ డాట్ కామ్ తన సర్వే నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జూలై 17 నుంచి ఆగస్ట్ 25 మధ్య టెలిఫోన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ సర్వే జరిగింది. దేశ ఆతిథ్య పరిశ్రమకు చెందిన 250 మంది ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు వృద్ధికి ఊతమిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించడం 2024లో వ్యాపార వృద్ధి అవకాశాలకు కీలకమని 88శాతం మంది భావిస్తున్నారు. తమ వ్యాపార వృద్ధికి కుటుంబాలను ఆకర్షించడం (78 శాతం మంది), మరింత మంది దేశీ ప్రయాణికులను రాబట్టడం (72 శాతం మంది), ఆధ్యాత్మిక పర్యాటకం ఇతర అవకాశాలుగా 64 శాతం మంది చెప్పారు. లాభాల వృద్ధికి ఆహారం పానీయాలు కీలకమని 39 శాతం మంది పేర్కొన్నారు. తమ హోటల్ మెనూలో వెగాన్, వెజిటేరియన్ ఆహారాన్ని చేర్చడం ముఖ్యమని 41 శాతం మంది పేర్కొన్నారు. సవాళ్లు.. నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడం దేశ హోటల్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రధానంగా ఉంది. ఇంధన వ్యయాలు, పన్నులు రెండు ప్రధాన సవాళ్లు అని 74 శాతం మంది, 73 శాతం మంది చొప్పున చెప్పారు. ఆ తర్వాత సిబ్బంది వేతనాలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడుల వ్యయాలను ఇతర సవాళ్లుగా పేర్కొన్నారు. ఇంధనాన్ని ఆదా చేయడం ప్రాముఖ్యమని 46 శాతం మంది తెలిపారు. వ్యర్థాలను తగ్గించుకోవాలని 45 శాతం మంది, నీటిని ఆదా చేసుకోవాలని 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
హోటల్ పరిశ్రమకు పర్యాటక బలం: క్రిసిల్
ముంబై: పర్యాటక రంగంలో నెలకొన్న డిమాండ్‌తో దేశీ హోటల్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు చూపిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే ఆదాయంలో 23 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సమసిపోవడంతో పర్యటనలకు పెరిగిన డిమాండ్, ముఖ్యంగా బిజినెస్ పర్యటనలు, తీరిక ప్రయాణాల్లో రికవరీ బలంగా ఉండడం వృద్ధికి కలిసొస్తుందని పేర్కొంది. హోటల్ పరిశ్రమపై ఓ నివేదికను క్రిసిల్ విడుదల చేసింది. కరోనా ముందు (2019–20) హోటల్ పరిశ్రమ లాభదాయకత 24 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 34 శాతానికి చేరుతుందని తెలిపింది. ‘‘గతేడాది కరోనా డెల్టా వేరియంట్ తర్వాత లీజర్ ప్రయాణాలు పెరిగాయి. 2022 జనవరిలో స్వల్పస్థాయి ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత నుంచి బిజినెస్ ప్రయాణాలు కూడా క్రమంగా ఊపందుకున్నాయి. ఇది సమావేశాలు, సదస్సులు, వేడుకలకు డిమాండ్‌ను పెంచింది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో అంతర్జాతీయంగా వ్యాపార పర్యటనల్లో ఊపు హోటల్ పరిశ్రమ పనితీరుకు మద్దతునిస్తుందని క్రిసిల్ తెలిపింది. -
ఊపందుకున్న హోటల్ పరిశ్రమ
న్యూఢిల్లీ: హోటల్ పరిశ్రమ కరోనా ముందు నాటి స్థాయి ఆదాయం, మార్జిన్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కరోనా వైరస్ కేసులు భవిష్యత్తులో పెరిగినా డిమాండ్ బలంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దేశీయ విహార యాత్రలు, తాత్కాలిక ప్రయాణాలు డిమాండ్‌ను నడిపించేవిగా పేర్కొంది. వ్యాపార ప్రయాణాలు, విదేశీ పర్యాటకుల రాకలో క్రమంగా పురోగతి కనిపిస్తున్నట్టు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇక్రా వివరించింది. దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో గదుల భర్తీ రేటు 2022–23లో 68–70 శాతం మేర ఉండొచ్చని వెల్లడించింది. సగటు రూమ్ రేటు రూ.5,600–5,800 స్థాయిలో ఉంటుందని తెలిపింది. వ్యయాలను పరిమితం చేసే చర్యలు, నిర్వహణ పనితీరు మెరుగుపడడం వంటివి మార్జిన్లకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ‘‘2022–23 సంవత్సరం ఆరంభం హోటల్ పరిశ్రమకు సానుకూలంగా ఉంది. ప్రీమియం హోటళ్లలో భర్తీ రేటు 56–58 శాతం మేర మొదటి మూడు నెలల్లో (జూన్ క్వార్టర్)లో నమోదైంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 40–42 శాతం కంటే ఇది ఎక్కువ. కరోనాకు ముందు 20219–20 మొదటి మూడు నెలల్లో ఉన్న 60–62 శాతం సమీపానికి చేరుకుంది. 2022–23 మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా సగటు రూమ్ రేటు 4,600–4,800గా నమోదైంది. 2021–22లో ఇది రూ.4,200–4,400గా ఉంది. కరోనా ముందు నాటితో పోలిస్తే ఇంకా 16–18 శాతం తక్కువలో ఉంది’’అని ఇక్రా హోటల్ సెక్టార్ హెడ్ వినుతా తెలిపారు. -
వెల్కమ్ చెబుతున్న హోటల్ ఇండస్ట్రీ
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దేశీ హోటల్ పరిశ్రమ .. కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకోగలదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. వ్యాపారపరమైన ప్రయాణాలు మొదలైనవి పుంజుకుంటున్నప్పటికీ .. దేశీయంగా విహార యాత్రలకు సమీప భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడగలదని సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. స్థిరంగా ఇక్రా నివేదిక ప్రకారం దాదాపు నాలుగు నెలల పాటు కోవిడ్ రెండు, మూడు వేవ్‌ల ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ హోటల్ రంగం 2022 ఆర్థిక సంవత్సరంలో .. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే దాదాపు 60 శాతం మేర ఆదాయాలు ఆర్జించే అవకాశం ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న వ్యయ నియంత్రణ చర్యల తోడ్పాటుతో నిర్వహణ లాభాలు నమోదు చేయవచ్చని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీ హోటల్ పరిశ్రమ అవుట్‌లుక్‌ను నెగటివ్ (ప్రతికూల) నుంచి స్టేబుల్ (స్థిర) స్థాయికి మారుస్తున్నట్లు వినుత వివరించారు. విహార యాత్రలకు సంబంధించిన లీజర్ మార్కెట్లలో 2022 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆక్యుపెన్సీ అత్యంత మెరుగ్గా ఉన్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. గోవాలో ఆక్యుపెన్సీ కోవిడ్ పూర్వ స్థాయి కన్నా కోలుకుందని, ముంబై, ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో కూడా పుంజుకుంటోందని వివరించింది. అక్కడ మాత్రం వ్యాపారపరమైన ప్రయాణాలు ఇంకా అంతగా లేనందున బెంగళూరు, పుణె నగరాల్లో ఆక్యుపెన్సీ ఇంకా మెరుగుపడాల్సి ఉందని నివేదిక పేర్కొంది. అయితే, సీక్వెన్షియల్‌గా చూస్తే వచ్చే కొద్ది నెలల్లో ఈ మార్కెట్లు పుంజుకోగలవని వివరించింది. ‘ఆంక్షల సడలింపు, టీకాల ప్రక్రియ వేగవంతం కావడం, పేరుకుపోయిన డిమాండ్ అంతా కలిసి 2022 ఆర్థిక సంవత్సరం రెండు, మూడో త్రైమాసికంలో విహార యాత్రల రికవరీకి దోహదపడ్డాయి. దేశీయంగా వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. నిర్దిష్ట రంగాల్లో ప్రాజెక్టు సైట్లు, తయారీ ప్లాంట్లకు పర్యటనలు పెరుగుతున్నాయి‘ అని ఇక్రా నివేదిక తెలిపింది. ఒమిక్రాన్ ప్రభావం ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆదాయాలు, మార్జిన్లు మెరుగ్గానే ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. మూడో త్రైమాసికంలో 11 భారీ లిస్టెడ్ సంస్థలు నమోదు చేసిన ఆదాయాల ప్రాతిపదికన ఈ అంచనాలు రూపొందించినట్లు పేర్కొంది. -
Hotel Industry: అతిథులు లేక వెలవెల
కరోనా పహారా కాస్తుండగా హోటల్‌కొచ్చి ఆహారం ఎవరైనా తినగలరా..? వినియోగదారులకు బదులు కరోనా ఎంట్రీ ఇస్తే ఎవరైనా రెస్టారెంట్లను తెరిచి ఉంచగలరా..? కష్టమే కదా! అవును.. ఇప్పుడు ఆతిథ్యరంగం ఆగమాగమైంది. కరోనా తిథిలో అతిథికి కష్టమే! కోవిడ్ పడగ నీడన హోటల్ ఇండస్ట్రీ ఏవిధంగా కుదేలైందో ఓసారి ఈ కథనం చదవండి.. మీకే తెలుస్తుంది! సాక్షి, హైదరాబాద్: అది లక్డీకాపూల్ చౌరస్తాలో పేరొందిన హోటల్.. ఎప్పుడూ భోజనప్రియులతో కిక్కిరిసి ఉం టుంది.. ఆ హోటల్ కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లి తిరిగి రాలేదు.. గిరాకీ కూడా తక్కువగా ఉండటంతో యాజమాన్యం ఆ హోటల్‌ను మూసేసింది. అది అల్పాహార ప్రియులకు రుచికరమైన ‘చట్నీ’లు అందించడంలో పేరెన్నికగన్న హోటల్ గ్రూపు.. తమ కొత్తశాఖను అబిడ్స్‌లో గతేడాది ఆరం భంలో ప్రారంభించింది.. అంతలోనే కార్యకలాపాల ను నిలిపివేసి నాలుగైదు నెలల క్రితం తిరిగి కొనసాగించింది.. ఇప్పుడు ఉన్నట్టుండి బంద్ చేసింది.జాతీయస్థాయిలో పేరొందిన మరో హోటల్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని తమ బ్రాంచ్‌ను శాశ్వతంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకిలా..? తెరిచిన హోటళ్లు ఎందుకు మూతపడుతున్నాయి.. మూతబడిన హోటళ్లు ఎం దుకు తెరుచుకోవడంలేదు.. ఏమైందీ హోటళ్లకు?.. అన్నింటికీ సమాధానం.. ‘కరోనా’! ఆతిథ్యరంగంపై కరోనా కర్కశ దాడికి ఇవి సాక్ష్యాలు మాత్రమే. కేవలం ఈ హోటళ్లే కాదు. చిన్నా, చితకా ఆహారపుబండ్లు కూడా చితికిపోయాయి. లాక్డౌన్, వైరస్ ప్రభావంతో పడిలేచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హోటల్ ఇండస్ట్రీపై సెకండ్‌వేవ్ మళ్లీ పంజా విసిరింది. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలతో హోటల్ బిజినెస్ 25%, ఫుడ్ ఆన్లైన్ బిజినెస్ 20 శాతానికి మించిలేదు. ఇప్పటికే పెట్టుబడులు భారం మారాయి. విద్యుత్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు తలకుమిం చిన భారంగా తయారయ్యాయి. ఐదు నక్షత్రాలు, మూడు నక్షత్రాల హోటళ్లు, రెస్టారెంట్లు ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయి సంక్షోభంలో కూరుకుపోయాయి. ఏడాది కాలంగా హోటళ్ల రంగాన్ని కరోనా కకావికలం చేస్తోందని పలువురు హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిర్వహణ భారం సాధారణ సదుపాయాలతో రెస్టారెంట్ నిర్వహించాలంటే కనీసం రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల పెట్టుబడి అవసరం. బిజినెస్ నడవకపోయినా అద్దె, విద్యుత్ చార్జీలు, వర్కర్ల జీతభత్యాలు చెల్లించాల్సిందే. నెలకు కనీసం రూ.లక్ష నుంచి రెండు లక్షల అద్దె ఉంటుంది. ఒక్కో రెస్టారెంట్లో వంట మాస్టర్లు మొదలు క్లీనర్లు, బేరర్ల వరకు సగటున 20 నుంచి 30 మంది పనిచేస్తారు. వారందరికీ జీతాలతోపాటు అదే హోటల్లో 3 పూటలా తిండి పెట్టా ల్సి ఉంటుంది. వంటశాలలో గ్రైండర్లు, హీటర్లు, గ్రీజర్లు, రెస్టారెంట్లో ఏసీలు, ఫ్యాన్ల వినియోగానికి విద్యుత్ చార్జీలు కమర్షియల్ టారిఫ్ కింద చెల్లించాలి. ఇవి పెద్ద మొత్తంలోనే ఉంటాయి. ఆదాయం 73 నుంచి 20 శాతానికి తగ్గుదల కరోనాకు ముందు ప్రతినిత్యం రూమ్ ఆక్యుపెన్సీ సగటు 60 నుంచి 80% వరకు ఉండేది. లాక్డౌన్ అనంతరం కొన్ని కార్పొరేట్ రెస్టారెంట్ల పరిస్థితి కొంత మెరుగ్గా కనిపించినా... మిగిలిన రెస్టారెంట్ల బిజినెస్ అంతంత మాత్రంగా తయారైంది. దీంతో నగరంలోని పేరొందిన హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. హోటళ్లలో ఫుడ్, బేవరేజెస్ అమ్మకాలు, ఈవెంట్స్ నిర్వహణ దెబ్బతినడంతో ఆదాయం 73% నుంచి 20 శాతానికి పడిపోయింది. మధ్య తరగతి హోటళ్లలో సైతం నగరానికి వచ్చి నవారు బస చేసేందుకు సుముఖత చూపకపోవడంతో ఆక్యుపెన్సీ 20 శాతానికి మించలేదు. ప్రతిరోజూ రూ.50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు వ్యాపారం సాగేది. గతేడాది లాక్‌డౌన్‌తో జీరోకు చేరి, తిరిగి అన్‌లాక్ అనంతరం బిజినెస్ నెమ్మదిగా రూ.5 కోట్ల నుంచి 40 కోట్లకు చేరింది. ఇప్పుడు సగానికిపైగా పడిపోతున్నట్లు తెలుస్తోంది. ‘అడ్వాన్స్’ఇక్కట్లు గ్రేటర్ హైదరాబాద్‌లో స్టార్, మధ్య తరహా హోట ళ్లు 1500లకుపైగా, చిన్న హోటల్స్, లాడ్జీలు 3,500 వరకు ఉంటాయన్నది అంచనా. నగరంలోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు బల్క్ బుకింగ్స్ ద్వారానే ఆదాయం సమకూరుతోంది. అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు, వేడుకలు, పార్టీలు, ఫంక్షన్లు, సినిమా షూటింగ్స్ వీటికి ప్రధాన ఆదాయవనరులు. ఆయా హోటళ్ల్ల గదులు, ఆహార పదార్థాలకు బల్క్ బుకింగ్ పద్ధతిలో ఆర్డర్లు ఉండేవి. ఐటీ రంగ నిపుణుల విడిదితోపాటు కొత్తగా పెట్టుబడులు, కంపెనీలను విస్తరించాలనుకునేవారు, సమావేశాల కోసం ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి వచ్చేవారితో హోటళ్లకు భారీగా ఆదాయం సమకూరేది. ఒకప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ కోసం పోటీపడే పరిíస్థితి కోవిడ్ అనంతరం కరువైంది. ఇప్పుడు 40% నుంచి 5%కి పడిపోయింది. ఫుడ్ కోర్టులు–ఆన్లైన్ ఆర్డర్లు.. మామూలుగానైతే రాత్రి పూటనే ఫుడ్‌కోర్టుల వ్యాపారం కొనసాగుతుంది. కర్ఫ్యూతో ఫుడ్‌కోర్టు లు త్వరగా మూసివేయక తప్పడంలేదు. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు తగ్గుముఖం పట్టాయి. దినసరి ఫుడ్ డెలివరీ ఆర్డర్లు 50 శాతానికి పడిపోగా, ఉపాధి సరిగా లేక డెలివరీ బాయ్స్‌కు ఆదాయం క్షిణిస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలి లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే నెమ్మదిగా రికవరీ దిశగా అడుగులేస్తున్న హోటల్ ఇండస్ట్రీపై సెకండ్ వేవ్ మళ్లీ కోలుకోని దెబ్బతీసింది. తాజాగా విధించిన రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలతో బిజినెస్‌లేక నిర్వహణ భారంగా తయారైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. మళ్లీ గాడిలో పడాలంటే కష్టమే. సర్కారు ఖజానాకు ఆదాయ వనరులుగా ఉన్న హోటల్ పరిశ్రమ నష్టాలపాలైనప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంది. కరోనా కష్టకాలంలో జీఎస్టీ రద్దు చేయాలి. విద్యుత్ చార్జీల్లో రాయితీ కల్పించాలి.హోటల్ ఇండస్ట్రీని రక్షించాలి. – సద్ది వెంకట్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వ ఖజానాకు తగ్గిన రాబడి హోటల్ రంగం ద్వారా ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ పడిపోయింది. సాధారణ రోజుల్లో ఒక్కో రెస్టారెంట్ ద్వారా నెలకు రూ.లక్ష నుంచి రూ.4 లక్షలు వరకు ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. రాష్ట్రం మొత్తం మీద జీఎస్టీ రూపంలో వచ్చే రాబడిలో గ్రేటర్ హైదరాబాద్ వాటా 70 శాతానికిపైగా ఉంటుంది. 2020–21 సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో రాబడి శూన్యం. రెండో, మూడో త్రైమాసికంలో అది 20 నుంచి 40 శాతం మించలేదు. చివరి త్రైమాసికం భారీగానే రాబడి వచ్చింది. తాజాగా సెకండ్‌వేవ్‌తో తిరిగి బిజినెస్ తగ్గి రాబడి పడిపోయే పరిస్ధితి కనిపిస్తోంది. 90 వేల కార్మికుల ఉపాధికి దెబ్బ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, స్టార్ హోటళ్ల చెఫ్‌లు, కుక్‌లు, హెల్ప ర్లు, సప్లయర్లుగా 90 వేలపైనే పనిచేస్తున్నట్లు కార్మిక శాఖ అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 80% అస్సాం, మణిపూర్, ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాలకు చెందినవారే. లాక్డౌన్ వల్ల 90%పైగా కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయి అన్‌లాక్ అనంతరం 45% మంది తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌తో హోటల్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డునపడే పరిస్థితి కనిపిస్తోంది. ‘గాలి’ప్రచారంతో.. ‘గాలి నుంచి కరోనా సోకుతోందంటూ జరుగుతున్న ప్రచారంతో రెస్టారెంట్లు, హోటళ్లకు కస్టమర్లు రావడం లేదు. దీనికితోడు గతంలో సమూహాలుగా వచ్చే వినియోగదారులు ఇప్పుడు ఒకరిద్దరుగానే వస్తున్నారు. దీనికితోడు గతంలో 20 నిమిషాలకుపైగా గడిపే సమయం కాస్త 10 నిమిషాలకు తగ్గించేశారు. దీంతో ఒక్క ఆర్డర్‌ను మాత్రమే ఇస్తున్నారు. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్, ఇతర ఆహారపు ఆర్డర్లు పూర్తిగా తగ్గించారు’అని గచ్చిబౌలికి చెందిన మరో హోటల్ యజమాని వెల్లడించారు. చదవండి: ప్రైవేటు దోపిడీని అడ్డుకోండి -
ప్రభుత్వ నిర్ణయంతో ఆవేదన చెందా: ఒబెరాయ్
ముంబై: లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం హోటల్ పరిశ్రమకు అనుమతి ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందానని ఒబెరాయ్ హోటల్ గ్రూప్ ఎండీ, సీఈవో విక్రమ్ ఒబెరాయ్ తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని పరిశ్రమలకు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఒబెరాయ్ ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడు లేని విధంగా హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా హోటల్ పరిశ్రమను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. హోటల్ పరిశ్రమ బతకాలంటే తెరవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. హోటల్ అసోసియేషన్లు నిరంతరం ప్రభుత్వంతో చర్చిస్తున్న హోటల్ నిర్వహణకు అనుమతి లభించలేదని వాపోయారు. ఇటీవల వివిధ రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల హోటల్ పరిశ్రమకు ఎలాంటి లాభం లేదని తెలిపారు. కరోనాను నివారించేందుకు ప్రభుత్వ నియమాలను ఆచరించేందుకు అన్ని హోటల్ యాజమాన్యాలు సిద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో 33 అత్యాధునిక ఫైవ్ స్టార్ హోటల్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఒమెరాయ్ హోటల్ తమ సేవలను అప్రతిహాతంగా అందిస్తున్నాయి. చదవండి: ఫార్మాను ఊరిస్తున్న గల్ఫ్.. -
అయ్యో.. ఆతిథ్యం!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సంబంధించి లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హోటల్ పరిశ్రమ పెనుసవాళ్లు ఎదుర్కొంటోంది. ఆక్యుపెన్సీ పడిపోయి, ఆదాయాలు తగ్గిపోయి ఆందోళన చెందుతోంది. రీసెర్చ్ సంస్థ ఎస్టీఆర్ నివేదిక ప్రకారం మార్చి 7 నాటికి ఆక్యుపెన్సీ 12 శాతం తగ్గగా.. మార్చి 21 నాటికి (లాక్డౌన్ ప్రకటించడానికి మూడు రోజుల ముందు) ఏకంగా 67 శాతం పడిపోయింది. ఆదాయాలు అంతకన్నా ఎక్కువగా పడిపోయాయి. ఫుడ్, బేవరేజెస్ అమ్మకాలు, ఈవెంట్స్ నిర్వహణ దెబ్బతినడంతో మార్చి 7 నాటికి ఆదాయంలో 20 శాతమే తగ్గుదల ఉండగా.. ఆ తర్వాత మార్చి 21 నాటికి ఏకంగా 73 శాతం పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే గతేడాది ఆదాయాల్లో కనీసం 20 శాతం కూడా రాబట్టుకోవడం కూడా కష్టం కాగలదని హాస్పిటాలిటీ కన్సల్టింగ్ సంస్థ హోటెలివేట్ పేర్కొంది. గతేడాది రూ. 37,000 కోట్లుగా ఆదాయం ఉండగా.. 2020లో ఇందులో 15–20% మాత్రమే హోటల్ పరిశ్రమ ఆర్జించవచ్చని ఓ నివేదికలో తెలిపింది. సత్వరం ఒడ్డున పడేసే చర్యలు తీసుకోకపోతే దేశీయంగా బ్రాండెడ్.. సంఘటిత హోటల్ మార్కెట్ నెలల తరబడి మందగమనంలో పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. వర్కింగ్ క్యాపిటల్, స్వల్పకాలిక రుణ లభ్యత లేక చిన్న స్థాయి హోటళ్లు దివాలా తీసే రిస్కులు ఉన్నాయని హోటెలివేట్ హెచ్చరించింది. దేశీయంగా సంఘటిత రంగంలో 1,000 బ్రాండ్లు.. 1,25,000 గదులు ఉన్నాయని అంచనా. ఇవి కాక అసంఘటిత రంగంలో 1,2,3 స్టార్ కేటగిరీకి చెందిన అన్‌బ్రాండెడ్ హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. లక్షల్లో ఉద్యోగాలకు ఎసరు.. వ్యాపారం పూర్తిగా నిల్చిపోయిందని పేరొందిన ఓ హోటల్ చెయిన్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. పరిస్థితి చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే, లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. బ్రాండెడ్ హోటళ్ల రంగంలోనే ఏకంగా 2,00,000 మంది పైగా సిబ్బంది ఉండగా అన్‌బ్రాండెడ్, అసంఘటిత హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు మొదలైన వాటి ద్వారా ఎన్నో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు, సాధారణంగా చాలామటుకు హోటళ్ల వ్యయాల్లో జీతభత్యాలు మొదలైన వాటి వాటా 17–22% దాకా ఉంటుందని హోటెలివేట్ తెలిపింది. వ్యాపారం సజావుగా సాగినా సాగకు న్నా ఈ వ్యయాలు తప్పవని పేర్కొంది. సిబ్బంది జీతభత్యాల కోసం హోటళ్లకు వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఎంతగానో ఉందని వివరించింది. భారీ రుణభారం... వ్యాపార విస్తరణ కోసం, హోటళ్ల ఆధునికీకరణ కోసం సంఘటిత రంగ హోటళ్లు భారీగా రుణాలు తీసుకున్నాయి. 2020 జనవరి నాటికి వీటి మొత్తం రుణభారం దాదాపు రూ. 45,000 కోట్ల పైగా ఉంది. రాబోయే రోజుల్లో హోటళ్లు నెలవారీగా కట్టాల్సిన అసలు, వడ్డీలే వేల కోట్ల రూపాయల్లో ఉంటుందని హోటెలివేట్ మేనేజింగ్ పార్ట్నర్ అచిన్ ఖన్నా చెప్పారు. వీటి చెల్లింపులకు సంబంధించి కనీసం 6–9 నెలల పాటైనా ఉపశమనం దొరికేలా ప్రభుత్వం, రుణాలిచ్చిన సంస్థలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ కొనసాగించే యోచనేదీ లేదని ప్రభుత్వం చెబుతున్నా... వ్యాపారం మళ్లీ పట్టాలెక్కేందుకు చాలా నెలలు పట్టేస్తుందని హోటల్ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. ప్రయాణాలపరమైన ఆంక్షలు సడలించినా హోటల్ వ్యాపా రాలు అప్పుడే పుంజుకోవడం కష్టమని భావిస్తోంది. పర్యాటకం ద్వారా (హోటళ్లు, టూరిజం సంస్థలు, మధ్యవర్తులు) దాదాపు 5.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో 70% మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందనేది పరిశ్రమ వర్గాల మాట. ఇప్పటికే ఉద్యోగాల్లో కోత మొదలైందని, ఇది మరింత తీవ్ర రూపు దాల్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. -
బంపర్ ఆఫర్ : ఎంత కావాలంటే అంత తినొచ్చు
కర్నాటక/శివమొగ్గ : హైదరాబాద్‌లో ఐకియా ఎంట్రీ గుర్తుందా..? దాదాపు 1000 రకాల వస్తువులను 200 రూపాయల కంటే తక్కువకే అందిస్తాం అని ప్రకటించగానే జనాలు ఎగబడ్డారు. ఇప్పుడు అదే మూమెంట్ మరో దగ్గర నెలకొంది. అయితే అది ఐకియా లాంటి పెద్ద స్టోర్ కాదట. కర్నాటకలోని శివమొగ్గ తీర్థహలిలో ఉన్న ఓ సాదాసీదా హోటల్ మాత్రమే. పట్టణంలో మెయిన్ బస్‌స్టాపుకు ఎదురుగా ఉన్న శ్రీ అన్నలక్ష్మి రెస్టారెంట్.. ప్రజలు ఎంత కావాలంటే అంత తినొచ్చని, తిన్న దానికి మీకు ఇష్టమైనంత నగదు చెల్లించుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ కేవలం కేవలం ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చింది కాదు. ఆ తర్వాత కూడా అందిస్తోంది. ఈ రెస్టారెంట్లో మరో స్పెషాలిటీ, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు ఎలాంటి బిల్లు చెల్లించకుండానే అపరిమిత భోజనం చేయొచ్చు. ఆ సమయంలో భోజనానికి ఫుల్-రైస్, దాంతో పాటు రుచికరమైన కూరలు, పెరుగు ఆఫర్ చేస్తోంది. బిల్లు లేకుండా భోజనం అనే సరికి మనవాళ్లు ఊరుకుంటారా? ఆ హోటల్‌కు భారీ సంఖ్యలోనే క్యూ కడుతున్నారు. కస్టమర్ల నుంచి వస్తున్న ఈ అనూహ్య స్పందనపైఆ హోటల్ ఓనర్ గోవర్థన్ ఎస్ఆర్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అన్లిమిటెడ్ ఫుడ్ అనగానే భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పాడు. చాలా మంది ఉచిత భోజనం అనుకుంటూ తరలివచ్చారని, కానీ తమ కాన్సెప్ట్ అది కాదని... అపరిమిత భోజనం చేసి, మీకు నచ్చినంత బిల్లు చెల్లించడం అని చెప్పాడు. గుళ్లలో మాదిరి అన్నదానం చేసి, డొనేషన్లు ఇచ్చినట్టు.. ఇదే సిస్టమ్‌ను ఇక్కడ కూడా అవలంభించినట్టు గోవర్థన్ పేర్కొన్నాడు. అయితే ఈ హోటల్‌కు వచ్చి తిన్న వాళ్లలో చాలామంది అసలు బిల్లే చెల్లించలేదట. కొంతమంది మాత్రమే చెల్లించారని, వారిలో కొంతమంది దానహృదయులు అదనపు మొత్తాలు చెల్లించినట్టు తెలిపాడు. ‘చాలా ఏళ్లుగా.. సామాజిక కార్యక్రమాల్లో నేను పాలుపంచుకుంటున్నా. ప్రతి సోమవారం రామేశ్వ ఆలయంలో అన్నదానం చేస్తున్నా. నేను, నా స్నేహితుడు టీడీ రాఘవేంద్ర కలిసి ఎప్పుడూ ప్రజలకు శుభ్రమైన ఆహారాన్ని తక్కువ ధరలో ఎలా అందించాలి అని చర్చిస్తుంటూ ఉంటాం’ అని హోటల్ యజమాని చెప్పాడు. వందమంది ప్రజలు కూర్చుని భోజనం చేసే సామర్థ్యాన్ని ఈ హోటల్ కలిగి ఉంది. హోటల్ పరిశ్రమ బిజినెస్‌కు సంబంధించింది అయినప్పటికీ.. తాము తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు కృషిచేస్తున్నామని గోవర్థన్ చెప్పాడు. స్కూల్ ట్రిప్‌ల్లో భాగంగా ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఒక్క ప్లేట్ భోజనానికి 60 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని, కానీ ఇది చాలా ఖరీదైనదని అన్నాడు. కావాల్సినంత తిని, మీకు నచ్చినంత చెల్లించండి అనే కాన్సెప్ట్‌ను ఇప్పటికే ఇక్కడ పలు గ్రూప్‌లు ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. మాజీ మంత్రి కిమానే రత్నాకర్ కూడా ఈ హోటల్‌ను సందర్శించి, అక్కడి స్టాఫ్‌ను భేష్ అంటూ కొనియాడాడు. మధ్యాహ్నం భోజనాన్ని పట్టణ మున్సిపాలిటీ అధ్యక్షుడు సందేష్ జావలి ప్రారంభించాడు. -
ఆతిథ్య పరిశ్రమకు రారాజు
భారతదేశ ఆతిథ్య రంగానికి కురువృద్ధుడాయన. ఆతిథ్య పరిశ్రమలో ఎన్నో మెట్లు అధిరోహించిన చాలామందికి గురుతుల్యుడయ్యారు. దేశంలో పరాయి పాలన కొనసాగుతున్న కాలంలోనే స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి హోటల్ పరిశ్రమలో ప్రపంచ స్థాయి దిగ్గజాలకే దిగ్భ్రమ కలిగించిన ధీశాలి ఆయన. అట్టడుగు స్థాయి నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి ఆకాశమే హద్దుగా చరిత్ర సృష్టించిన వ్యాపారవేత్త మోహన్‌సింగ్ ఒబెరాయ్. ఆతిథ్య పరిశ్రమకు పెద్దదిక్కు, ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు రాయ్‌బహదూర్ మోహన్‌సింగ్ ఒబెరాయ్ 1898 ఆగస్టు 15న అవిభక్త భారతదేశంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని భవున్ గ్రామంలో జన్మించారు. మోహన్‌సింగ్ ఆరునెలల పసికందుగా ఉన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నారు. అష్టకష్టాలు అనుభవిస్తూనే రావల్పిండిలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. లాహోర్ కాలేజీ నుంచి ఇంటర్మీడియేట్ పూర్తి చేశారు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో కాలేజీ చదువును కొనసాగించలేక చిన్నా చితకా పనులు చేసుకుంటూ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ నేర్చుకున్నారు. అప్పట్లో పంజాబ్ ప్రాంతంలో ప్లేగు మహమ్మారి విజృంభించడంతో 1922లో ప్రాణాలు అరచేత పట్టుకుని సిమ్లా చేరుకున్నారు. సిమ్లాలోని సెసిల్ హోటల్లో చిరుద్యోగంలో చేరారు. ఆతిథ్యరంగంతో అలా మొదలైన ఆయన అనుబంధం కడ వరకు కొనసాగింది. తొలి అడుగులు... సిమ్లాలోని ద సెసిల్ హోటల్లో బెల్ బాయ్‌గా అట్టడుగు స్థానం నుంచి ఒబెరాయ్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ హోటల్లో బస చేసిన అపరిచిత వ్యక్తి ఒకరు అర్ధరాత్రి ఒబెరాయ్‌ను పిలిచి వంద పేజీల రాతప్రతిని ఇచ్చి ఉదయం ఐదు గంటలకల్లా టైపు చేసి ఇవ్వమని చెప్పారు. అక్షరదోషాలు లేకుండా చెప్పిన సమయానికంటే ముందే శ్రద్ధతో పని పూర్తి చేసినందుకు మెచ్చి వంద రూపాయలు బహుమతిగా ఇచ్చాడా అతిథి. అది అప్పట్లో ఒబెరాయ్ రెండు నెలల జీతానికి సమానం. అంత పెద్ద మొత్తాన్ని టిప్‌గా ఇచ్చిన ఆ లక్ష్మీపుత్రుడు.. పండిట్ మోతీలాల్ నెహ్రూ అనే విషయం అప్పుడు ఒబెరాయ్‌కు తెలియదు. తనకు సంబంధం లేని విధులను కూడా శ్రద్ధతో చక్క»ñ డుతున్న ఒబెరాయ్ సమర్థతను హోటల్ మేనేజర్ గ్రోవ్ గమనించారు. తాను కొనుగోలు చేసిన క్లార్క్స్ హోటల్లో మేనేజర్‌గా నియమించారు. దీంతో ఒబెరాయ్ జీవితం మలుపు తిరిగింది. హోటల్ నిర్వహణకు అవసరమైన అన్ని మెలకువలనూ ఒబెరాయ్ ఇక్కడి నుంచే ఒంటబట్టించుకున్నారు. తొలి ఐదు నక్షత్రాల హోటల్... గ్రోవ్ మరణంతో 1934లో అమ్మకానికొచ్చిన క్లార్క్స్ హోటల్‌ను భార్య నగలు, ఆస్తులు తెగనమ్మి కొనుగోలు చేశారు. 1938లో కలకత్తాలో 500 గదుల హోటల్‌ను అద్దెకు తీసుకోని అనతికాలంలోనే లాభాల బాట పట్టించారు. 1943లో అసోసియేటెడ్ హోటల్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌ను కొనుగోలు చే సి ఆతిథ్య పరిశ్రమలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 1965లో న్యూఢిల్లీలో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే తొలి ఐదు నక్షత్రాల హోటల్‌ను ప్రారంభించి తన జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. అదే ఊపులో 1973లో ముంబైలో 35 అంతస్థుల ఒబెరాయ్ షెరటాన్ హోటల్ స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. విమానాల్లో భోజన సేవలను అందించే కార్యకలాపాలను 1959లో తొలిసారి ఒబెరాయ్ సంస్థే ప్రారంభించింది. ప్రపంచ టాప్ టెన్ జాబితాలో... ఇవీన్నీ ఒకెత్తయితే దేశవిదేశాల్లోని రాజప్రాసాదాలు, పురాతన కట్టడాలను పునరుద్ధరించి అద్భుతమైన హోటళ్లుగా తీర్చిదిద్దారు. సిమ్లాలోని సెసిల్, కలకత్తాలోని ఒబెరాయ్ గ్రాండ్, కైరోలోని చారిత్రక మెనాహౌస్ వంటివి మచ్చుకు కొన్ని. ప్రజా వ్యతిరేకతను సైతం ఖాతరు చేయకుండా మెల్బోర్న్లోని చారిత్రక కట్టడం విండ్సర్ను కొనుగోలు చేశారు. భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, దుబాయ్, ఇంగ్లాండ్, ఈజిప్ట్, మారిషస్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, హంగేరీ దేశాల్లో ముప్పయికి పైగా లగ్జరీ హోటళ్లను నెలకొల్పారు. సేవారంగంలోనూ కృషి వ్యాపార విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా సేవారంగంలోనూ ఇతోధికంగా కృషి చేశారు ఒబెరాయ్. శారీరక, మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. 1962, 1972లలో రాజ్యసభకు, 1968లో లోక్‌సభకు ఎన్నికై, చట్టసభల్లోనూ తన వంతు సేవలందించారు. ఆతిథ్య రంగంలో దేశంలోనే తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తన దార్శనికతతో దేశంలోని ఆతిథ్య పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన ఒబెరాయ్ నూటమూడేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించి, 2002 మే 3న కన్నుమూశారు. పారిశ్రామికవేత్తగా ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2001లో ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. -
‘గ్రేటర్’ ఆదాయం ఢమాల్
రాజకీయ అనిశ్చితే కారణం స్థిరాస్తి రంగానికి గడ్డుకాలం వాణిజ్య రంగం కుదేలు తగ్గిన పన్నుల చెల్లింపులు సర్కారు ఖజానాపై ప్రభావం సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ఖజానాకు కీలకమైన హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల ఆదాయం ఈసారి పడిపోయింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో ఆర్థిక వనరుల శాఖలన్నీ చతికిలబడ్డాయి. మహానగరంలో స్థిరాస్తి క్రయవిక్రయాలు నిలిచిపోగా.. యావత్తు వ్యాపార, వాణిజ్యరంగం కుదేలైంది. వెరసి ప్రభుత్వ రాబడి భారీగా పడిపోయింది. సర్కార్ ఖజానాకు కల్పతరువైన వాణిజ్య పన్నుల శాఖ రాబడి వెనకబడిపోగా.. రిజిస్ట్రేషన్, రవాణా తదితర శాఖల ఆదాయాలకు సైతం దెబ్బ తగిలింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 56,474 కోట్లు ఆదాయం సమకూరగా 2013-14 సంవత్సరానికి ఇది 60 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాణిజ్యపన్నుల శాఖ, రిజిస్ట్రేషన్, రవాణా సంస్థలు 2013-14 ఆర్థిక సంవత్సరం రూ.19,071 కోట్ల లక్ష్యానికి కేవలం రూ.13,280 కోట్ల సాధనకే పరిమితయ్యాయి. మిగతా శాఖల ఆదాయం లక్ష్యసాధన కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో సుమారు 12 శాతం మంది జంట జిల్లాల్లోనే ఉన్నందున ఏటా వివిధ పద్దుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుంది. మరోవైపు అధికశాతం పన్నుల చెల్లింపులు సైతం ఇక్కడి నుంచే జరుగుతుండటంతో రాబడీ అధికంగా ఉంటుంది. కానీ ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విభజన ప్రభావంతో రాజకీయ అనిశ్చితి నెలకొని జంట జిల్లాల రాబడి మందగించింది. మందగించిన వాణిజ్య రాబడి.. మహానగరంలోని వ్యాపార, వాణిజ్య రంగాల టర్నోవర్ 2013-14 ఆర్థిక సం వత్సరంలో భారీగానే కుదేలైంది. ఫలితంగా సర్కార్‌కు అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ పన్నుల చెల్లింపులు తగ్గాయి. రాష్ట్రం మొత్తం మీద వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల రాబడి అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74 శాతం వరకు ఇక్కడ నుంచే జమవుతోంది. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆథారిత పన్ను), అమ్మకం పన్నులు ప్రధానమైనవి. ఇవే కాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంత రాబడి లభిస్తుంది. మొత్తం వసూళ్లలో వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతం, మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది. జంట జిల్లాల్లో వాణిజ్య పన్నుల శాఖకు గల ఏడు డివిజన్లలో పన్నుల వసూళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా క్షీణించాయి. రాజకీయ అనిశ్చితి, ఆందోళనలు, ఉద్యమాలు తదితర అడ్డంకులతో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల రాకపోకలు తగ్గి వ్యాపార, వాణిజ్య రంగ లావాదేవీలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా వాహనాల రాకపోకలు తగ్గడంతో పెట్రోల్ ఉత్పత్తుల వినియోగం మందగించింది. పంజగుట్ట, అబిడ్స్, సికింద్రాబాద్, బేగంపేట డివిజన్లకు పెట్రోల్, డీజిల్, లిక్కర్, సిమెంట్, ఐరన్, గోల్డ్, హోటల్ ఇండస్ట్రీ, షాపింగ్ మాల్స్ తదితర సంస్థల నుంచి భారీగా పన్నులు వసూలవుతా యి. ఆయా సంస్థల లావాదేవీలు తగ్గడంతో పన్నుల చెల్లింపులు తగ్గిపోయాయి. తగ్గిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్, స్టాంప్‌ల శాఖకు 2013-14 ఆర్థిక సంవత్సరం అచ్చిరాలేదు. మహానగరంలో భూముల క్రయ, విక్రయాలు తగ్గి ఆదాయం పడిపోయింది. రాష్ట్ర విభజన స్థిరాస్తి రంగాన్ని అచేతనంగా మార్చినట్లయింది. భూములు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడంతో పాటు ధర కూడా పడిపోయింది. గతంలో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సైతం క్రయవిక్రయాలు పడిపోగా.. తిరిగి ఊపందుకుని లక్ష్యానికి మించి గత ఆర్థిక సంవత్సరం ఆదాయం సమకూరింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సెగతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఈ ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి కొట్టినట్లయింది. ఫలితంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో స్థిరాస్తి లావాదేవీలు తగ్గి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పడిపోయింది. ఆశావహంగా లేని ‘రవాణా’ ఆదాయం ఇటీవల కాలంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి తదితర పరిణామాల నేపథ్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరం రవాణా శాఖ ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని సంపాదించలేకపోయింది. వాహనాల అమ్మకాలు తగ్గడం వల్ల జీవిత కాల పన్ను తగ్గిపోయిం ది. అలాగే రవాణా వాహనాలకు ప్రతి 3 నెలలకు ఒకసారి వసూలు చేసే క్వార్టర్లీ ట్యాక్స్ కూడా టార్గెట్ చేరుకోలేకపోయింది. హైదరాబాద్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.669.64 కోట్ల రెవెన్యూ టార్గెట్‌ను పెట్టుకోగా, రూ.478.45 కోట్లు మాత్రమే సాధించింది. అలాగే రంగారెడ్డి జిల్లాలో రూ.783 కోట్లు లక్ష్యం. కాగా రూ.రూ.599.06 కోట్లు మాత్రమే లభించింది.