‘గ్రేటర్’ ఆదాయం ఢమాల్ | 'Greater' income bibliography | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’ ఆదాయం ఢమాల్

Published Tue, Apr 15 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

‘గ్రేటర్’ ఆదాయం ఢమాల్

‘గ్రేటర్’ ఆదాయం ఢమాల్

  •      రాజకీయ అనిశ్చితే కారణం
  •      స్థిరాస్తి రంగానికి గడ్డుకాలం
  •      వాణిజ్య రంగం కుదేలు
  •      తగ్గిన పన్నుల చెల్లింపులు
  •      సర్కారు ఖజానాపై ప్రభావం
  •  సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ఖజానాకు కీలకమైన హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల ఆదాయం ఈసారి పడిపోయింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో ఆర్థిక వనరుల శాఖలన్నీ చతికిలబడ్డాయి. మహానగరంలో స్థిరాస్తి క్రయవిక్రయాలు నిలిచిపోగా.. యావత్తు వ్యాపార, వాణిజ్యరంగం కుదేలైంది. వెరసి ప్రభుత్వ రాబడి భారీగా పడిపోయింది. సర్కార్ ఖజానాకు కల్పతరువైన వాణిజ్య పన్నుల శాఖ రాబడి వెనకబడిపోగా.. రిజిస్ట్రేషన్, రవాణా తదితర శాఖల ఆదాయాలకు సైతం దెబ్బ తగిలింది.

    2012-13 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 56,474 కోట్లు ఆదాయం సమకూరగా 2013-14 సంవత్సరానికి ఇది 60 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాణిజ్యపన్నుల శాఖ, రిజిస్ట్రేషన్, రవాణా సంస్థలు 2013-14 ఆర్థిక సంవత్సరం రూ.19,071 కోట్ల లక్ష్యానికి కేవలం రూ.13,280 కోట్ల సాధనకే పరిమితయ్యాయి.

    మిగతా శాఖల ఆదాయం లక్ష్యసాధన కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో సుమారు 12 శాతం మంది జంట జిల్లాల్లోనే ఉన్నందున ఏటా వివిధ పద్దుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుంది. మరోవైపు అధికశాతం పన్నుల చెల్లింపులు సైతం ఇక్కడి నుంచే జరుగుతుండటంతో రాబడీ అధికంగా ఉంటుంది. కానీ ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విభజన ప్రభావంతో రాజకీయ అనిశ్చితి నెలకొని జంట జిల్లాల రాబడి మందగించింది.
     
    మందగించిన వాణిజ్య రాబడి..

     
    మహానగరంలోని వ్యాపార, వాణిజ్య రంగాల టర్నోవర్ 2013-14 ఆర్థిక సం వత్సరంలో భారీగానే కుదేలైంది. ఫలితంగా సర్కార్‌కు అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ పన్నుల చెల్లింపులు తగ్గాయి. రాష్ట్రం మొత్తం మీద వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల రాబడి అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74 శాతం వరకు ఇక్కడ నుంచే జమవుతోంది.

    వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆథారిత పన్ను), అమ్మకం పన్నులు ప్రధానమైనవి. ఇవే కాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంత రాబడి లభిస్తుంది. మొత్తం వసూళ్లలో వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతం, మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది. జంట జిల్లాల్లో వాణిజ్య పన్నుల శాఖకు గల ఏడు డివిజన్లలో పన్నుల వసూళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా క్షీణించాయి.

    రాజకీయ అనిశ్చితి, ఆందోళనలు, ఉద్యమాలు తదితర అడ్డంకులతో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల రాకపోకలు తగ్గి వ్యాపార, వాణిజ్య రంగ లావాదేవీలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా వాహనాల రాకపోకలు తగ్గడంతో పెట్రోల్ ఉత్పత్తుల వినియోగం మందగించింది. పంజగుట్ట, అబిడ్స్, సికింద్రాబాద్, బేగంపేట డివిజన్లకు పెట్రోల్, డీజిల్, లిక్కర్, సిమెంట్, ఐరన్, గోల్డ్, హోటల్ ఇండస్ట్రీ, షాపింగ్ మాల్స్ తదితర సంస్థల నుంచి భారీగా పన్నులు వసూలవుతా యి. ఆయా సంస్థల లావాదేవీలు తగ్గడంతో పన్నుల చెల్లింపులు తగ్గిపోయాయి.
     
    తగ్గిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
     
    ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్, స్టాంప్‌ల శాఖకు 2013-14 ఆర్థిక సంవత్సరం అచ్చిరాలేదు. మహానగరంలో భూముల క్రయ, విక్రయాలు తగ్గి ఆదాయం పడిపోయింది. రాష్ట్ర విభజన స్థిరాస్తి రంగాన్ని అచేతనంగా మార్చినట్లయింది. భూములు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడంతో పాటు ధర కూడా పడిపోయింది. గతంలో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సైతం క్రయవిక్రయాలు పడిపోగా.. తిరిగి ఊపందుకుని లక్ష్యానికి మించి గత ఆర్థిక సంవత్సరం ఆదాయం సమకూరింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సెగతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఈ ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి కొట్టినట్లయింది. ఫలితంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో స్థిరాస్తి లావాదేవీలు తగ్గి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పడిపోయింది.
     
     ఆశావహంగా లేని ‘రవాణా’ ఆదాయం

     ఇటీవల కాలంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి తదితర పరిణామాల నేపథ్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరం   రవాణా శాఖ ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని సంపాదించలేకపోయింది. వాహనాల అమ్మకాలు తగ్గడం వల్ల జీవిత కాల పన్ను  తగ్గిపోయిం ది. అలాగే రవాణా వాహనాలకు ప్రతి 3 నెలలకు ఒకసారి వసూలు చేసే క్వార్టర్లీ ట్యాక్స్ కూడా టార్గెట్ చేరుకోలేకపోయింది. హైదరాబాద్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.669.64 కోట్ల రెవెన్యూ టార్గెట్‌ను పెట్టుకోగా, రూ.478.45 కోట్లు మాత్రమే సాధించింది. అలాగే రంగారెడ్డి జిల్లాలో రూ.783 కోట్లు లక్ష్యం. కాగా రూ.రూ.599.06 కోట్లు మాత్రమే  లభించింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement