అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విచ్చలవిడిగా అక్రమ డబ్బు రవాణా
పలు ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి తరలింపు
అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై 2,637 కేసులు
రహస్య పార్టీలపై నిఘాకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం
ప్రభుత్వ వాహనాలనూ వదిలిపెట్టొద్దని ఎన్నికల సంఘం ఆదేశం
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ డబ్బు రవాణాపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. అందులో భాగంగా అక్టోబరు 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముంబై, ఉప నగరాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సంయుక్తంగా తనిఖీలు, నాకా బందీలు నిర్వహించారు. ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, విదేశీ డాలర్లు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుకున్నారు. అయితే ఈ సొత్తు ఎవరిది..? ఎవరికి అందజేయడానికి వెళుతున్నారనే సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.
రూ.187 కోట్ల విలువైన నగదు స్వాధీనం
ఎన్నికలు సమీపించడంతో వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా కావడం పరిపాటిగా మారింది. నాకాబందీలు, తనిఖీలు నిర్వహించినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా అవుతూనే ఉంది. అయినప్పటికీ పోలీసులు, వివిధ శాఖల అధికారులు డేగ కళ్లతో కాపుకాస్తూ కోట్లలో అక్రమ డబ్బు, డ్రగ్స్, మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చన తరువాత వివిధ శాఖల పోలీసులు, అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.187.88 కోట్లు విలువచేసే సొత్తు హస్తగతం చేసుకున్నారు. ఇందులో రాష్ట్ర పోలీసు శాఖ ద్వారా రూ.75 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.60 కోట్లు, ఆదాయ పన్ను శాఖ ద్వారా రూ.11 కోట్లు, మిగతా ఎన్నికల అధికారుల ద్వారా పట్టుకున్న సొత్తు ఉంది. అలాగే అక్రమంగా మద్యం తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై 2,637 కేసులు నమోదు చేశారు. అందుకు బాధ్యులైన 2,460 నిందితులపై చర్యలు తీసుకున్నారు.అలాగే రూ.9.61 కోట్లు విలువచేసే మద్యం నిల్వలను జప్తు చేశారు. జప్తు చేసిన మద్యంలో విదేశీ, దేశీ, నాటుసారా, తెల్లకల్లు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు తాము ప్రయతిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్పర్ కమిషనర్ ప్రసాద్ సుర్వే అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం వినియోగించే అవకాశాలుంటాయి. దీంతో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు దాడులు, తనఖీలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రహస్య పార్టీలపై నిఘా..
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పరితపిస్తున్నారు. అందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. కార్యకర్తలు సహా ఓటర్లను సంతోష పెట్టేందుకు రహస్యంగా మద్యం పారీ్టలు ఇస్తున్నారు. అంతేగాకుండా ఇంటింటికి వెళ్లి మద్యం బాటిళ్లు, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతుంటారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి రహస్య పారీ్టలపై నిఘా వేస్తున్నారు. అందుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 164 మంది కార్యకర్తలను అదపపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాకు చెక్ పేట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో 25 పరి్మనెంట్ చెక్ పోస్టులు, 26 తాత్కాలిక చెక్ పోçస్టులను ఏర్పాటు చేశారు. టోల్ నాకాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహిల్యనగర్–పుణే జాతీయ రహదారిపై పార్నెర్ తాలూకా హద్దులో ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఓ వాహనంలో సుమారు రూ.25 కోట్లు విలువచేసే బంగారం పట్టుకున్నారు.
అయితే కార్టన్ బాక్స్‌లో ప్యాకింగ్ చేసిన ఈ బంగారం ఎవరిచ్చారు..? ఎవరికిచ్చేందుకు తీసుకెళుతున్నారనే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వాహనంలో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులున్నారు. అనుమానం వచ్చి వాహనాన్ని మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 45 కేజీల వెండి కడ్డీలు లభించాయి. దర్యాప్తు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు బయటపడవని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 160 చెరుకు క్రషింగ్ ఫ్యాక్టరీలు, 36 దేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, 45 బీరు తయారుచేసే ఫ్యాక్టరీలు, 65 వైనరీ, 48 విదేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు అలాగే 216 నాటుసారా విక్రయించే షాపులు, 262 విదేశీ మద్యం విక్రయించే షాపులు, 1,734 వైన్ షాపులు, 4,155 దేశీ మద్యం విక్రయించే షాపులున్నాయి. దీంతో ఓటింగ్, కౌంటింగ్ తంతు పూర్తయ్యేంత వరకు హోల్‌సెల్, రిటైల్ మద్యం షాపులపై సీసీ టీవీ కెమరాల ద్వారా నిఘా వేయనున్నారు.
ప్రభుత్వ వాహనాలనూ వదిలిపెట్టొద్దు..
ఎన్నికలకు ముందు విచ్చల విడిగా అక్రమంగా డబ్బు రవాణా జరుగుతుంది. అందుకు సొంత, అద్దె వాహనాలతోపాటు పోలీసు వ్యాన్లను కూడా వినియోగించే ప్రమాదం లేకపోలేదు. అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ కొందరు నేతలు పోలీసు జీపులు, వ్యాన్లలో డబ్బు రవాణా చేసే ఆస్కారముంది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో, నగరాలు, పట్టణాల్లో నాకాబందీలు, తనిఖీలు చేసే సమయంలో పోలీసు వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయకుండా వదిలిపెట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment