
ముంబై: పర్యాటక రంగంలో నెలకొన్న డిమాండ్‌తో దేశీ హోటల్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు చూపిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే ఆదాయంలో 23 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సమసిపోవడంతో పర్యటనలకు పెరిగిన డిమాండ్, ముఖ్యంగా బిజినెస్ పర్యటనలు, తీరిక ప్రయాణాల్లో రికవరీ బలంగా ఉండడం వృద్ధికి కలిసొస్తుందని పేర్కొంది.
హోటల్ పరిశ్రమపై ఓ నివేదికను క్రిసిల్ విడుదల చేసింది. కరోనా ముందు (2019–20) హోటల్ పరిశ్రమ లాభదాయకత 24 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 34 శాతానికి చేరుతుందని తెలిపింది. ‘‘గతేడాది కరోనా డెల్టా వేరియంట్ తర్వాత లీజర్ ప్రయాణాలు పెరిగాయి. 2022 జనవరిలో స్వల్పస్థాయి ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత నుంచి బిజినెస్ ప్రయాణాలు కూడా క్రమంగా ఊపందుకున్నాయి. ఇది సమావేశాలు, సదస్సులు, వేడుకలకు డిమాండ్‌ను పెంచింది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో అంతర్జాతీయంగా వ్యాపార పర్యటనల్లో ఊపు హోటల్ పరిశ్రమ పనితీరుకు మద్దతునిస్తుందని క్రిసిల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment