న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దేశీ హోటల్ పరిశ్రమ .. కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకోగలదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. వ్యాపారపరమైన ప్రయాణాలు మొదలైనవి పుంజుకుంటున్నప్పటికీ .. దేశీయంగా విహార యాత్రలకు సమీప భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడగలదని సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు.
స్థిరంగా
ఇక్రా నివేదిక ప్రకారం దాదాపు నాలుగు నెలల పాటు కోవిడ్ రెండు, మూడు వేవ్‌ల ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ హోటల్ రంగం 2022 ఆర్థిక సంవత్సరంలో .. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే దాదాపు 60 శాతం మేర ఆదాయాలు ఆర్జించే అవకాశం ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న వ్యయ నియంత్రణ చర్యల తోడ్పాటుతో నిర్వహణ లాభాలు నమోదు చేయవచ్చని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీ హోటల్ పరిశ్రమ అవుట్‌లుక్‌ను నెగటివ్ (ప్రతికూల) నుంచి స్టేబుల్ (స్థిర) స్థాయికి మారుస్తున్నట్లు వినుత వివరించారు. విహార యాత్రలకు సంబంధించిన లీజర్ మార్కెట్లలో 2022 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆక్యుపెన్సీ అత్యంత మెరుగ్గా ఉన్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. గోవాలో ఆక్యుపెన్సీ కోవిడ్ పూర్వ స్థాయి కన్నా కోలుకుందని, ముంబై, ఎన్‌సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో కూడా పుంజుకుంటోందని వివరించింది.
అక్కడ మాత్రం
వ్యాపారపరమైన ప్రయాణాలు ఇంకా అంతగా లేనందున బెంగళూరు, పుణె నగరాల్లో ఆక్యుపెన్సీ ఇంకా మెరుగుపడాల్సి ఉందని నివేదిక పేర్కొంది. అయితే, సీక్వెన్షియల్‌గా చూస్తే వచ్చే కొద్ది నెలల్లో ఈ మార్కెట్లు పుంజుకోగలవని వివరించింది. ‘ఆంక్షల సడలింపు, టీకాల ప్రక్రియ వేగవంతం కావడం, పేరుకుపోయిన డిమాండ్ అంతా కలిసి 2022 ఆర్థిక సంవత్సరం రెండు, మూడో త్రైమాసికంలో విహార యాత్రల రికవరీకి దోహదపడ్డాయి. దేశీయంగా వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. నిర్దిష్ట రంగాల్లో ప్రాజెక్టు సైట్‌లు, తయారీ ప్లాంట్లకు పర్యటనలు పెరుగుతున్నాయి‘ అని ఇక్రా నివేదిక తెలిపింది. ఒమిక్రాన్ ప్రభావం ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆదాయాలు, మార్జిన్లు మెరుగ్గానే ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. మూడో త్రైమాసికంలో 11 భారీ లిస్టెడ్ సంస్థలు నమోదు చేసిన ఆదాయాల ప్రాతిపదికన ఈ అంచనాలు రూపొందించినట్లు పేర్కొంది.
వెల్కమ్ చెబుతున్న హోటల్ ఇండస్ట్రీ
Published Thu, Apr 14 2022 1:08 PM | Last Updated on Thu, Apr 14 2022 1:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment