శివమొగ్గలో శ్రీ అన్నలక్ష్మి రెస్టారెంట్
కర్నాటక/శివమొగ్గ : హైదరాబాద్‌లో ఐకియా ఎంట్రీ గుర్తుందా..? దాదాపు 1000 రకాల వస్తువులను 200 రూపాయల కంటే తక్కువకే అందిస్తాం అని ప్రకటించగానే జనాలు ఎగబడ్డారు. ఇప్పుడు అదే మూమెంట్ మరో దగ్గర నెలకొంది. అయితే అది ఐకియా లాంటి పెద్ద స్టోర్ కాదట. కర్నాటకలోని శివమొగ్గ తీర్థహలిలో ఉన్న ఓ సాదాసీదా హోటల్ మాత్రమే. పట్టణంలో మెయిన్ బస్‌స్టాపుకు ఎదురుగా ఉన్న శ్రీ అన్నలక్ష్మి రెస్టారెంట్.. ప్రజలు ఎంత కావాలంటే అంత తినొచ్చని, తిన్న దానికి మీకు ఇష్టమైనంత నగదు చెల్లించుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఈ కేవలం కేవలం ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చింది కాదు. ఆ తర్వాత కూడా అందిస్తోంది. ఈ రెస్టారెంట్‌లో మరో స్పెషాలిటీ, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు ఎలాంటి బిల్లు చెల్లించకుండానే అపరిమిత భోజనం చేయొచ్చు. ఆ సమయంలో భోజనానికి ఫుల్-రైస్, దాంతో పాటు రుచికరమైన కూరలు, పెరుగు ఆఫర్ చేస్తోంది. బిల్లు లేకుండా భోజనం అనే సరికి మనవాళ్లు ఊరుకుంటారా? ఆ హోటల్‌కు భారీ సంఖ్యలోనే క్యూ కడుతున్నారు.
కస్టమర్ల నుంచి వస్తున్న ఈ అనూహ్య స్పందనపైఆ హోటల్ ఓనర్ గోవర్థన్ ఎస్‌ఆర్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అన్‌లిమిటెడ్ ఫుడ్ అనగానే భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పాడు. చాలా మంది ఉచిత భోజనం అనుకుంటూ తరలివచ్చారని, కానీ తమ కాన్సెప్ట్ అది కాదని... అపరిమిత భోజనం చేసి, మీకు నచ్చినంత బిల్లు చెల్లించడం అని చెప్పాడు. గుళ్లలో మాదిరి అన్నదానం చేసి, డొనేషన్లు ఇచ్చినట్టు.. ఇదే సిస్టమ్‌ను ఇక్కడ కూడా అవలంభించినట్టు గోవర్థన్ పేర్కొన్నాడు. అయితే ఈ హోటల్‌కు వచ్చి తిన్న వాళ్లలో చాలామంది అసలు బిల్లే చెల్లించలేదట. కొంతమంది మాత్రమే చెల్లించారని, వారిలో కొంతమంది దానహృదయులు అదనపు మొత్తాలు చెల్లించినట్టు తెలిపాడు.
‘చాలా ఏళ్లుగా.. సామాజిక కార్యక్రమాల్లో నేను పాలుపంచుకుంటున్నా. ప్రతి సోమవారం రామేశ్వ ఆలయంలో అన్నదానం చేస్తున్నా. నేను, నా స్నేహితుడు టీడీ రాఘవేంద్ర కలిసి ఎప్పుడూ ప్రజలకు శుభ్రమైన ఆహారాన్ని తక్కువ ధరలో ఎలా అందించాలి అని చర్చిస్తుంటూ ఉంటాం’ అని హోటల్ యజమాని చెప్పాడు. వందమంది ప్రజలు కూర్చుని భోజనం చేసే సామర్థ్యాన్ని ఈ హోటల్ కలిగి ఉంది. హోటల్ పరిశ్రమ బిజినెస్‌కు సంబంధించింది అయినప్పటికీ.. తాము తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు కృషిచేస్తున్నామని గోవర్థన్ చెప్పాడు. స్కూల్ ట్రిప్‌ల్లో భాగంగా ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఒక్క ప్లేట్ భోజనానికి 60 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని, కానీ ఇది చాలా ఖరీదైనదని అన్నాడు. కావాల్సినంత తిని, మీకు నచ్చినంత చెల్లించండి అనే కాన్సెప్ట్‌ను ఇప్పటికే ఇక్కడ పలు గ్రూప్‌లు ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. మాజీ మంత్రి కిమానే రత్నాకర్ కూడా ఈ హోటల్‌ను సందర్శించి, అక్కడి స్టాఫ్‌ను భేష్ అంటూ కొనియాడాడు. మధ్యాహ్నం భోజనాన్ని పట్టణ మున్సిపాలిటీ అధ్యక్షుడు సందేష్ జావలి ప్రారంభించాడు.
Comments
Please login to add a commentAdd a comment