Hotel‌ Industry: అతిథులు లేక వెలవెల | Coronavirus: Hotel Industry Losses Due To Coronavirus Second Wave | Sakshi
Sakshi News home page

Hotel‌ Industry: అతిథులు లేక వెలవెల

Published Thu, May 6 2021 9:22 AM | Last Updated on Thu, May 6 2021 11:54 AM

Coronavirus: Hotel‌ Industry Losses Due To Coronavirus Second Wave - Sakshi

కరోనా పహారా కాస్తుండగా హోటల్‌కొచ్చి ఆహారం ఎవరైనా తినగలరా..? వినియోగదారులకు బదులు కరోనా ఎంట్రీ ఇస్తే ఎవరైనా రెస్టారెంట్లను తెరిచి ఉంచగలరా..? కష్టమే కదా! అవును.. ఇప్పుడు ఆతిథ్యరంగం ఆగమాగమైంది. కరోనా తిథిలో అతిథికి కష్టమే! కోవిడ్‌ పడగ నీడన హోటల్‌ ఇండస్ట్రీ ఏవిధంగా కుదేలైందో ఓసారి ఈ కథనం చదవండి.. మీకే తెలుస్తుంది! 

సాక్షి, హైదరాబాద్‌: అది లక్డీకాపూల్‌ చౌరస్తాలో పేరొందిన హోటల్‌.. ఎప్పుడూ భోజనప్రియులతో కిక్కిరిసి ఉం టుంది.. ఆ హోటల్‌ కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లి తిరిగి రాలేదు.. గిరాకీ కూడా తక్కువగా ఉండటంతో యాజమాన్యం ఆ హోటల్‌ను మూసేసింది.  అది అల్పాహార ప్రియులకు రుచికరమైన ‘చట్నీ’లు అందించడంలో పేరెన్నికగన్న హోటల్‌ గ్రూపు.. తమ కొత్తశాఖను అబిడ్స్‌లో గతేడాది ఆరం భంలో ప్రారంభించింది.. అంతలోనే కార్యకలాపాల ను నిలిపివేసి నాలుగైదు నెలల క్రితం తిరిగి కొనసాగించింది.. ఇప్పుడు ఉన్నట్టుండి బంద్‌ చేసింది.జాతీయస్థాయిలో పేరొందిన మరో హోటల్‌ హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని తమ బ్రాంచ్‌ను శాశ్వతంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకిలా..? తెరిచిన హోటళ్లు ఎందుకు మూతపడుతున్నాయి.. మూతబడిన హోటళ్లు ఎం దుకు తెరుచుకోవడంలేదు.. ఏమైందీ హోటళ్లకు?.. అన్నింటికీ సమాధానం.. ‘కరోనా’! 

ఆతిథ్యరంగంపై కరోనా కర్కశ దాడికి ఇవి సాక్ష్యాలు మాత్రమే. కేవలం ఈ హోటళ్లే కాదు. చిన్నా, చితకా ఆహారపుబండ్లు కూడా చితికిపోయాయి. లాక్‌డౌన్, వైరస్‌ ప్రభావంతో పడిలేచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హోటల్‌ ఇండస్ట్రీపై సెకండ్‌వేవ్‌ మళ్లీ పంజా విసిరింది. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలతో హోటల్‌ బిజినెస్‌ 25%, ఫుడ్‌ ఆన్‌లైన్‌ బిజినెస్‌ 20 శాతానికి మించిలేదు. ఇప్పటికే పెట్టుబడులు భారం మారాయి. విద్యుత్‌ బిల్లులు, నిర్వహణ ఖర్చులు తలకుమిం చిన భారంగా తయారయ్యాయి. ఐదు నక్షత్రాలు, మూడు నక్షత్రాల హోటళ్లు, రెస్టారెంట్లు ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయి సంక్షోభంలో కూరుకుపోయాయి. ఏడాది కాలంగా హోటళ్ల రంగాన్ని కరోనా కకావికలం చేస్తోందని పలువురు హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

నిర్వహణ భారం 
సాధారణ సదుపాయాలతో రెస్టారెంట్‌ నిర్వహించాలంటే కనీసం రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల పెట్టుబడి అవసరం. బిజినెస్‌ నడవకపోయినా అద్దె, విద్యుత్‌ చార్జీలు, వర్కర్ల జీతభత్యాలు చెల్లించాల్సిందే. నెలకు కనీసం రూ.లక్ష నుంచి రెండు లక్షల అద్దె ఉంటుంది. ఒక్కో రెస్టారెంట్‌లో వంట మాస్టర్లు మొదలు క్లీనర్లు, బేరర్ల వరకు సగటున 20 నుంచి 30 మంది పనిచేస్తారు. వారందరికీ జీతాలతోపాటు అదే హోటల్‌లో 3 పూటలా తిండి పెట్టా ల్సి ఉంటుంది. వంటశాలలో గ్రైండర్లు, హీటర్లు, గ్రీజర్లు, రెస్టారెంట్‌లో ఏసీలు, ఫ్యాన్ల వినియోగానికి విద్యుత్‌ చార్జీలు కమర్షియల్‌ టారిఫ్‌ కింద చెల్లించాలి. ఇవి పెద్ద మొత్తంలోనే ఉంటాయి.  

ఆదాయం 73 నుంచి 20 శాతానికి తగ్గుదల 
కరోనాకు ముందు ప్రతినిత్యం రూమ్‌ ఆక్యుపెన్సీ సగటు 60 నుంచి 80% వరకు ఉండేది. లాక్‌డౌన్‌ అనంతరం కొన్ని కార్పొరేట్‌ రెస్టారెంట్‌ల పరిస్థితి కొంత మెరుగ్గా కనిపించినా... మిగిలిన రెస్టారెంట్ల బిజినెస్‌ అంతంత మాత్రంగా తయారైంది. దీంతో నగరంలోని పేరొందిన హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. హోటళ్లలో ఫుడ్, బేవరేజెస్‌ అమ్మకాలు, ఈవెంట్స్‌ నిర్వహణ దెబ్బతినడంతో ఆదాయం 73% నుంచి 20 శాతానికి పడిపోయింది. మధ్య తరగతి హోటళ్లలో సైతం నగరానికి వచ్చి నవారు బస చేసేందుకు సుముఖత చూపకపోవడంతో ఆక్యుపెన్సీ 20 శాతానికి మించలేదు. ప్రతిరోజూ రూ.50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు వ్యాపారం సాగేది. గతేడాది లాక్‌డౌన్‌తో జీరోకు చేరి, తిరిగి అన్‌లాక్‌ అనంతరం బిజినెస్‌ నెమ్మదిగా రూ.5 కోట్ల నుంచి 40 కోట్లకు చేరింది. ఇప్పుడు సగానికిపైగా పడిపోతున్నట్లు తెలుస్తోంది. 

‘అడ్వాన్స్‌’ఇక్కట్లు 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్టార్, మధ్య తరహా హోట ళ్లు 1500లకుపైగా, చిన్న హోటల్స్, లాడ్జీలు 3,500 వరకు ఉంటాయన్నది అంచనా. నగరంలోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు బల్క్‌ బుకింగ్స్‌ ద్వారానే ఆదాయం సమకూరుతోంది. అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు, వేడుకలు, పార్టీలు, ఫంక్షన్లు, సినిమా షూటింగ్స్‌ వీటికి ప్రధాన ఆదాయవనరులు. ఆయా హోటళ్ల్ల గదులు, ఆహార పదార్థాలకు బల్క్‌ బుకింగ్‌ పద్ధతిలో ఆర్డర్లు ఉండేవి. ఐటీ రంగ నిపుణుల విడిదితోపాటు కొత్తగా పెట్టుబడులు, కంపెనీలను విస్తరించాలనుకునేవారు, సమావేశాల కోసం ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి వచ్చేవారితో హోటళ్లకు భారీగా ఆదాయం సమకూరేది. ఒకప్పుడు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కోసం పోటీపడే పరిíస్థితి కోవిడ్‌ అనంతరం కరువైంది. ఇప్పుడు 40% నుంచి 5%కి పడిపోయింది. 

ఫుడ్‌ కోర్టులు–ఆన్‌లైన్‌ ఆర్డర్లు.. 
మామూలుగానైతే రాత్రి పూటనే ఫుడ్‌కోర్టుల వ్యాపారం కొనసాగుతుంది. కర్ఫ్యూతో ఫుడ్‌కోర్టు లు త్వరగా మూసివేయక తప్పడంలేదు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు తగ్గుముఖం పట్టాయి. దినసరి ఫుడ్‌ డెలివరీ ఆర్డర్లు 50 శాతానికి పడిపోగా, ఉపాధి సరిగా లేక డెలివరీ బాయ్స్‌కు ఆదాయం క్షిణిస్తోంది. 

ప్రభుత్వం ఆదుకోవాలి
లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే నెమ్మదిగా రికవరీ దిశగా అడుగులేస్తున్న హోటల్‌ ఇండస్ట్రీపై సెకండ్‌ వేవ్‌ మళ్లీ కోలుకోని దెబ్బతీసింది. తాజాగా విధించిన రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలతో బిజినెస్‌లేక నిర్వహణ భారంగా తయారైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. మళ్లీ గాడిలో పడాలంటే కష్టమే. సర్కారు ఖజానాకు ఆదాయ వనరులుగా ఉన్న హోటల్‌ పరిశ్రమ నష్టాలపాలైనప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంది. కరోనా కష్టకాలంలో జీఎస్టీ రద్దు చేయాలి. విద్యుత్‌ చార్జీల్లో రాయితీ కల్పించాలి.హోటల్‌ ఇండస్ట్రీని రక్షించాలి.
– సద్ది వెంకట్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌

ప్రభుత్వ ఖజానాకు తగ్గిన రాబడి 
హోటల్‌ రంగం ద్వారా ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ పడిపోయింది. సాధారణ రోజుల్లో ఒక్కో రెస్టారెంట్‌ ద్వారా నెలకు రూ.లక్ష నుంచి రూ.4 లక్షలు వరకు ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. రాష్ట్రం మొత్తం మీద జీఎస్టీ రూపంలో వచ్చే రాబడిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాటా 70 శాతానికిపైగా ఉంటుంది. 2020–21 సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో రాబడి శూన్యం. రెండో, మూడో త్రైమాసికంలో అది 20 నుంచి 40 శాతం మించలేదు. చివరి త్రైమాసికం భారీగానే రాబడి వచ్చింది. తాజాగా సెకండ్‌వేవ్‌తో తిరిగి బిజినెస్‌ తగ్గి రాబడి పడిపోయే పరిస్ధితి కనిపిస్తోంది.

90 వేల కార్మికుల ఉపాధికి దెబ్బ 
నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, స్టార్‌ హోటళ్ల చెఫ్‌లు, కుక్‌లు, హెల్ప ర్లు, సప్లయర్లుగా 90 వేలపైనే పనిచేస్తున్నట్లు కార్మిక శాఖ అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 80% అస్సాం, మణిపూర్, ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాలకు చెందినవారే. లాక్‌డౌన్‌ వల్ల 90%పైగా కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయి అన్‌లాక్‌ అనంతరం 45% మంది తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌తో హోటల్‌ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డునపడే పరిస్థితి కనిపిస్తోంది.

‘గాలి’ప్రచారంతో.. 
‘గాలి నుంచి కరోనా సోకుతోందంటూ జరుగుతున్న ప్రచారంతో రెస్టారెంట్లు, హోటళ్లకు కస్టమర్లు రావడం లేదు. దీనికితోడు గతంలో సమూహాలుగా వచ్చే వినియోగదారులు ఇప్పుడు ఒకరిద్దరుగానే వస్తున్నారు. దీనికితోడు గతంలో 20 నిమిషాలకుపైగా గడిపే సమయం కాస్త 10 నిమిషాలకు తగ్గించేశారు. దీంతో ఒక్క ఆర్డర్‌ను మాత్రమే ఇస్తున్నారు. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్, ఇతర ఆహారపు ఆర్డర్లు పూర్తిగా తగ్గించారు’అని గచ్చిబౌలికి చెందిన మరో హోటల్‌ యజమాని వెల్లడించారు. 

చదవండి: ప్రైవేటు దోపిడీని అడ్డుకోండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement