ముంబై: డిమాండ్ స్థిరంగా ఉండటం, సరఫరా వ్యవస్థపరమైన అడ్డంకులు తొలగిపోతుండటం తదితర అంశాలు ఆటో విడిభాగాల సంస్థలకు ఊరటనివ్వనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక ప్రకటనలో ఈ అంచనాలు వెల్లడించింది. దీని ప్రకారం 31 ఆటో విడిభాగాల కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ. 1,75,000 కోట్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి.
దేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థలు (ఓఈఎం), రిప్లేస్‌మెంట్, ఎగుమతులు, కమోడిటీల ధరల పెరుగుదలను బదలాయించగలగడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడ్డాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లో బేస్‌తో పోలిస్తే వృద్ధి అధిక స్థాయిలో నమోదైందని, అయినప్పటికీ పరిశ్రమ ఆదాయాలు తమ అంచనాలు మించాయని ఇక్రా పేర్కొంది. ఊహించిన దాని కన్నా ఎగుమతులు మెరుగ్గా ఉండటం, కమోడిటీల ధరలు.. రవాణా వ్యయాల పెరుగుదల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కంపెనీలకు కలిసొచ్చిందని వివరించింది.
తగ్గిన మార్జిన్లు..
గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు పెరిగినప్పటికీ ముడి వస్తువుల ఖర్చులు, రవాణా వ్యయాల భారాన్ని ద్వితీయార్థంలో (అక్టోబర్–మార్చ్) కంపెనీలు పూర్తి స్థాయిలో, సకాలంలో బదలాయించలేకపోయాయని ఇక్రా తెలిపింది. దీనితో లాభాల మార్జిన్లపై ప్రభావం పడినట్లు పేర్కొంది. 31 ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ మార్జిన్లు గత ఆర్థిక సంవత్సరంలో అయిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయని ఇక్రా తెలిపింది. సెమీకండక్టర్ కొరత సమస్యలు, ద్విచక్ర వాహనాలు .. ట్రాక్టర్లకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ వ్యాపారాలపై భౌగోళికరాజకీయ పరిణామాల వంటి అంశాలు ఆదాయాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది.
‘30 కంపెనీల (ఒక పెద్ద ఆటో విడిభాగాల సరఫరా సంస్థ కాకుండా) నిర్వహణ మార్జిన్లు 10.6 శాతంగా నమోదయ్యాయి. వార్షికంగా చూస్తే ఇది 10 బేసిస్ పాయింట్లు, మా అంచనాలతో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు తక్కువ‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుతా ఎస్ తెలిపారు. సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, ధరల పెరుగుదల భయాల కారణంగా ఆటో యాన్సిలరీలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిల్వలను భారీగా పెంచుకున్నాయని పేర్కొన్నారు. అంతక్రితం నాలుగేళ్లలో ఇదే అత్యధికమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి సంస్థల దగ్గర లిక్విడిటీ (నగదు లభ్యత) మెరుగ్గా ఉండటం సానుకూలాంశమని వినుత తెలిపారు.
పీఎల్‌ఐ స్కీముతో దన్ను..
ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీముతో మధ్యకాలికంగా ఆటో యాన్సిలరీల విభాగంలో పెట్టుబడులకు ఊతం లభించగలదని ఇక్రా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో కొత్తగా మరిన్ని పెట్టుబడులు రాగలవని వివరించింది. ఇక పరిశ్రమకు రుణ అవసరాలు కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఆటో యాన్సిలరీల రుణాల భారం పరిస్థితి మెరుగ్గా ఉందనేందుకు సూచనగా చాలా మటుకు సంస్థలకు ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం .. ఆటో యాన్సిలరీలకు సానుకూలంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment