టైం వచ్చింది.. భారత ఫార్మా రంగంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు! | Mansukh Mandaviya Discusses On Indian Pharmaceutical Sector | Sakshi
Sakshi News home page

టైం వచ్చింది.. భారత ఫార్మా రంగంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Published Mon, Jul 4 2022 11:36 AM | Last Updated on Mon, Jul 4 2022 11:48 AM

Mansukh Mandaviya Discusses On Indian Pharmaceutical Sector - Sakshi

న్యూఢిల్లీ: భారత ఫార్మాస్యూటికల్స్‌ పరిశ్రమకు అనుకూల సమయం వచ్చిందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. పరిమాణాత్మక (సంఖ్యా పరంగా) స్థాయి నుంచి విలువ పరంగా అగ్రస్థానాన్ని చేరుకోవాలని, అంతర్జాతీయ మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమకు అనుకూలమైన విధానాలతో మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. భారత ఫార్మాస్యూటికల్స్‌ సమాఖ్యతో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘భారత ఫార్మా విజన్‌ 2047’కు కార్యాచరణను రూపొందించడంలో భాగంగా మంత్రి పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 

‘‘అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అత్యుత్తమ విధానాలను నేర్చుకోవాలి. వాటికి అనుగుణంగా సొంత నమూనాలను రూపొందించుకోవాలి. దేశీయ డిమాండ్‌ అందుకుంటూనే అంతర్జాతీయంగా విస్తరించాలి. పరిమాణాత్మకంగా అగ్రస్థానంలో ఉన్న పరిశ్రమ.. విలువ పరంగానూ అదే స్థానానికి చేరుకోవాలి. పరిశోధన, తయారీ, ఔషధాల అభివృద్ధిలో అంతర్జాతీయంగా ఉన్న ఉత్త మ విధానాలను సొంతం చేసుకోవాలి’’అని మంత్రి సూచించారు. రానున్న సంవత్సరాల్లో మరింతగా వృద్ధి సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. 

దీర్ఘకాల విధానాలు పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకొస్తా యంటూ.. ఈ విషయంలో ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో సమగ్రమైన విధానం అనుస్తామంటూ.. మన విధానాలు భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల అనంతరం తీసుకొచి్చనవిగా పేర్కొన్నారు. ఇవి దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పారు. వినూత్నమైన టెక్నాలజీలపై పరిశ్రమ పెట్టుబడులు పెట్టాలని, తయారీ సామర్థ్యాలను విస్తరించుకోవాలని సూచించారు. పీఎల్‌ఐ వంటి పథకాలతో ఫార్మా పరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement