
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 వ్యాక్సిన్ సరఫరా భారత ఔషధ రంగానికి కాసులు కురిపించనుంది. ఇక్కడి తయారీ సంస్థలకు భారత్‌తోపాటు, అంతర్జాతీయంగా వచ్చే మూడేళ్లలో రూ.81,730 కోట్ల వరకు వ్యాపార అవకాశాలు ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ వెల్లడించింది. ‘వ్యాక్సిన్ల విక్రయం ద్వారా యూఎస్ సంస్థలు ప్రీమియం ధరలను ఆస్వాదిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ధరలు ఒక్కో డోసుకి రూ.1,114.5 నుంచి రూ.1,857.5 వరకు ఉంది. ఒక్కో డోసుపై రూ.260 వరకు లాభం గడిస్తున్నాయి. భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు ప్రీమియం ధరను పొందే అవకాశం లేదు’ అని వివరించింది.
అంతర్జాతీయంగా ఇలా..
దేశీయ డిమాండ్‌లో ఎక్కువ భాగం మార్చి 2022 నాటికి నెరవేరుతుందని అంచనా. యూరప్, ఉత్తర అమెరికా, అభివృద్ధి చెందిన ఆసియా దేశాల వంటి అధిక ఆదాయ మార్కెట్లలో ఎగుమతి అవకాశాలు పూర్తిగా అయిపోయాయి. చైనా, జపాన్, కొన్ని దక్షిణ అమెరికా దేశాలను మినహాయించి వివిధ ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎగుమతికి ఆస్కారం ఉంది. ఇక్కడ టీకా వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. డిమాండ్ 125 కోట్ల డోసుల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా ఆగస్ట్ 10 నాటికి 435 కోట్ల డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్స్ నమోదయ్యాయి.
భారత్‌లో అవకాశాలు..
వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆగస్ట్ 10 నాటికి భారత్‌లో 50 కోట్ల డోసులు నమోదయ్యాయి. దేశంలో మరో 200 కోట్ల డోసులు అవసరం. ఇక్కడ రోజుకు 50–55 లక్షల డోసుల స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. ఈ ఏడాది జనాభాలో అత్యధికులకు వ్యాక్సినేషన్ పూర్తి కావొచ్చని అంచనా. ఈ కాలంలో భారత ఫార్మా సంస్థలకు రూ.34,180 కోట్ల వ్యాపార అవకాశం ఉంటుంది. ఎగుమతులు పెరగడంతో ఇది వచ్చే ఏడాది నాటికి రూ.36,410 కోట్లకు చేరుకుంటుంది. 2023లో డిమాండ్ రూ.11,890 కోట్లకు పరిమితం అవుతుంది’ అని కేర్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment