హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో కీలక ముడి పదార్థాల కోసం చైనా మార్కెట్‌పై ఆధారపడుతున్న భారత కంపెనీలు... దాన్ని ఎగుమతి మార్కెట్‌గానూ చూస్తున్నాయి. అమెరికాలో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో... భారత ఫార్మా కంపెనీలకు కొత్త ఎగుమతుల మార్కెట్‌గా చైనా అవతరిస్తోంది. ఇటీవలి ఇరు దేశాధినేతల సమావేశం దీనికి మరింత ఊతమిచ్చినట్లు ఫార్మా సంస్థలు భావిస్తున్నాయి.
చైనాలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని వ్యాపార అవకాశంగా మలిచేందుకు ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) హైదరాబాద్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఇరు దేశాల అగ్రశ్రేణి సంస్థల ఉన్నతాధికారులతో పలు సమావేశాలనూ నిర్వహించింది. ఈ నేపథ్యంలో త్వరలో పలు వ్యాపార భాగస్వామ్యాలు సాకారం కానున్నట్లు తెలియవచ్చింది. భారత ఫార్మా ఎగుమతుల్లో చైనాతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి అనూహ్య వృద్ధి సాధ్యమేనని ఫార్మెక్సిల్ కృతనిశ్చయంతో ఉంది.
చైనా ఎందుకంటే..
బీఎంఐ నివేదిక ప్రకారం చైనా ఫార్మా మార్కెట్ విలువ రూ.10.2 లక్షల కోట్లు. 2018లో ఇది రూ.10.4 లక్షల కోట్లకు, 2027 నాటికి రూ.27.2 లక్షల కోట్లకు చేరనుంది. ఇక జనరిక్స్ వాటా గతేడాది రూ.5.57 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత సంవత్సరం ఇది రూ.6.61 లక్షల కోట్లకు, 2022 కల్లా రూ.9.12 లక్షల కోట్లకు చేరుతుంది.
ఈ డిమాండ్‌ను ఊహించిన అక్కడి ప్రభుత్వం విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తోంది. భారత్‌తో పోలిస్తే యా క్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్ల తయారీ ఖర్చు చైనాలో ఎక్కువ. ఈ రంగంలో వేతనాలూ ఎక్కువే. వైద్య ఖర్చుల భారం ప్రభుత్వంపై, ప్రజలపై తగ్గించాలన్న ఆలోచనలో భాగంగా చాలా ఔషధాలపై సుంకాన్ని ఎత్తివేసింది. అంటే చైనాకు మందులు ఎగుమతి చేసే కంపెనీపై పన్ను భారం ఉండదన్న మాట.
భారత్ నుంచి ఎగుమతులు ఇలా..
భారత్ నుంచి ఫార్మా ఎగుమతులు ఏప్రిల్–సెప్టెంబరు పీరియడ్‌లో 12.37 శాతం వృద్ధి కనబరిచాయి. ఎగుమతులు రూ.60,590 కోట్ల నుంచి రూ.68,094 కోట్లకు చేరాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజికల్స్ 13.66 శాతం, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 11.53 శాతం వృద్ధి చెందాయి. ఏప్రిల్– సెప్టెంబరులో రీజియన్ పరంగా ఉత్తర అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆసియాన్‌లు టాప్‌లో ఉన్నాయి. దేశాల పరంగా చూస్తే యూఎస్‌ఏ, యూకే, సౌత్ ఆఫ్రికా, రష్యా, బ్రెజిల్, జర్మనీ, నైజీరియా, కెనడా, బెల్జియం ఒకదాని వెంట ఒకటి ముందు వరుసలో ఉన్నాయి.
అడ్డంకులు తొలగిస్తే..
చైనా పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా మారుతున్నట్లు ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘2017–18 ఏప్రిల్–సెప్టెంబరులో భారత్ నుంచి చైనాకు రూ.700 కోట్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 11.7 శాతం వృద్ధితో రూ.781 కోట్లకు చేరింది. ఏపీఐలు ఎగుమతి చేయాలంటే చైనా ఎఫ్‌డీఏ అనుమతి తప్పనిసరి. దీనికి మూడేళ్లు పడుతోంది. అనుమతులను వేగంగా ఇవ్వాలని ఫార్మెక్సిల్ తరఫున కోరాం.
యూఎస్, ఈయూ, జపాన్ అనుమతి ఉంటే.. ఆ దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్లాంట్లకు గ్రీన్ చానెల్ రూట్లో ఏడాదిలోపే పర్మిషన్లను చైనా మంజూరు చేస్తోంది. దీన్నే భారత్‌కూ అమలు చేయాలన్నది మా డిమాండ్. ఫెర్మెంటేషన్ టెక్నాలజీలో ఇక్కడి కంపెనీలకు చైనా సాయం చేయాలి. మన కంపెనీలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రతిపాదనలను ఆ ప్రభుత్వం ముందు ఉంచాం’ అని రవి వివరించారు. ఇటీవల చైనాలో అక్కడి ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ఫార్మెక్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చైనా నుంచి 100, భారత్ నుంచి 27 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. దీంతో త్వరలోనే కొన్ని డీల్స్ సాకారం కానున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment