డాక్టర్ రాసిన మందుల చీటిని ఫోన్ కెమెరా నుంచి క్లిక్ మనిపించి, దాన్ని మొబైల్ యాప్ నుంచి అప్‌లోడ్ చేసి, చిటికెలో ఆర్డర్ చేసేయడం... ఆ తర్వాత 24 నుంచి 48 గంటల్లోపు ఇంటికే ఔషధాలు వచ్చేయడం నేడు పట్టణాల్లో చూస్తున్నాం. చిన్న పట్టణాల నుంచి మెట్రోల వరకు ఈ ఫార్మసీ వ్యాపారం విస్తరిస్తోంది. దీనివల్ల మందుల ధరలపై ఎక్కువ తగ్గింపు లభించడంతోపాటు, డాక్టర్ సూచించిన మందుల్లో ఏదో ఒక రకం లేకపోవడమన్న సమస్య కూడా దాదాపుగా ఉండడం లేదు. దేశంలో ఔషధ మార్కెట్ రూపు రేఖలను మార్చేస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీ మార్కెట్‌కు సంబంధించి లాభ, నష్టాలపై అవగాహన కోసమే ఈ కథనం...
ఈ–ఫార్మసీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొనడం.. సంప్రదాయ ఔషధ దుకాణాలు సేవల గురించి ఆలోచించే విధంగా దారితీసింది. ఈ పోటీ కారణంగా ఆర్డర్ చేస్తే ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నాయి సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు. కస్టమర్లను కాపాడుకునేందుకు వారికి అవసరమైన ఔషధాలు తమ వద్ద లేకపోయినా కానీ, ఆర్డర్ చేసి మరీ తెప్పిస్తున్నాయి. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు లు రావడానికి దోహదం చేసింది కచ్చితంగా ఈ ఫార్మసీలేనని చెప్పుకోవాలి. ఇక వైద్యులు తప్పనిసరిగా ఔషధం బ్రాండెడ్ పేరును కాకుండా, జనరిక్ పేరునే సూచించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వినియోగదారులకు ఏ కంపెనీ ఉత్పత్తి కొనుగోలు చేసుకోవాలనే విషయంలో స్వేచ్ఛను కల్పించనుంది.
ధరలు
ఈ ఫార్మసీలు సాధారణంగా ఔషధ ధరలపై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఆయా ఉత్పత్తులను బట్టి డిస్కౌంట్ వేర్వేరుగా ఉంటుంది. పోషక ఉత్పత్తులపై చాలా వరకు ఆన్‌లైన్ ఫార్మసీలు తక్కువే డిస్కౌంట్ ఇస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులపై (వైద్యులు రాసినవి) ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాయి. దీంతో ఈ ఫార్మసీల నుంచి కొనుగోలు చేసే వారికి కొంత ఆదా అవడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ ప్రభావంతో సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు కూడా దిగొచ్చి, ఎంఆర్‌పీపై తగ్గింపు ఇస్తున్నాయి.
అయినప్పటికీ ఆన్‌లైన్ ఫార్మసీల్లోనే డిస్కౌంట్ ఎక్కువ లభిస్తోంది. ఔషధ ధరలపై తగ్గింపులు, ఆర్డర్ చేసే విషయంలో ఆన్‌లైన్ ఫార్మసీలకే ఎక్కువ మార్కులు పడతాయి. కాకపోతే డెలివరీకి తీసుకునే సమయంలోనే సవాలు నెలకొని ఉంది. ఈ ఫార్మసీ స్టార్టప్ సంస్థలు దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, రవాణా పరమైన సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. ఓ ఔషధం వెంటనే తీసుకోవాల్సి ఉంటే సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయడమే పరిష్కారం.
ఇటువంటి వారు ఆన్‌లైన్‌లో మెడిసిన్ ఆర్డర్ చేసి, అవి వచ్చే వరకు వేచి ఉండడం సాధ్యపడదు. కాకపోతే క్రమం తప్పకుండా కొన్ని రకాల జీవనశైలి సమస్యలకు మందులు వాడే వారు మాత్రం తమకు కావాల్సిన మందులను ముందుగానే ఆన్‌లైన్ ఫార్మసీల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అయితే ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు. కాకపోతే కనీస ఆర్డర్ విలువకు తక్కువ కొనుగోలు చేస్తే, డెలివరీ చార్జీలను వసూలు చేస్తున్నాయి.
భిన్న రకాలు...
ఈ ఫార్మసీల్లో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది ఆన్‌లైన్‌లో మాత్రమే ఫార్మసీలను విక్రయించే నమూనా. సంబంధిత ఫార్మసీ స్టోర్ పోర్టల్ లేదా యాప్‌లో లాగిన్ అయి, కావాల్సిన మందులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఔషధాలను ఇంటికి డెలివరీ చేస్తారు. నెట్‌మెడ్స్, మెడ్‌లైఫ్, 1ఎంజీ, ఎంకెమిస్ట్, ఫార్మ్‌ఈజీ ఇవన్నీ కూడా ఈ కోవలోనివే. ఇక రెండో నమూనాలో అటు సంప్రదాయ ఫార్మసీ స్టోర్లతో పాటు, ఆన్‌లైన్‌లోనూ ఔషధ విక్రయాలను నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి.
తద్వారా రెండు మార్గాల్లోనూ కస్టమర్లను సంపాదించుకోవడం లక్ష్యం. మెడ్‌ప్లస్ ఈ తరహాలోనే పనిచేస్తోంది. మెడ్‌ప్లస్ సంస్థ 20 శాతం వరకు ఆన్‌లైన్ ఆర్డర్లపై తగ్గింపు ఇస్తోంది. మెడ్‌ప్లస్ స్టోర్‌కు వెళ్లి రూ.1,000లోపు ఆర్డర్ చేస్తే 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంటే, అదే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తుండడం గమనార్హం. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే డిస్కౌంట్ ఆఫర్ చేయడంతోపాటు, ఇంటికి డెలివరీ చేయడం లేదా సమీపంలోని మెడ్‌ప్లస్ స్టోర్‌కు స్వయంగా వెళ్లి తీసుకునే ఆప్షన్లను కూడా ఇస్తోంది. కస్టమర్లు తమ సౌకర్యం కొద్దీ నచ్చినది ఎంచుకోవచ్చు.
ఇక మూడో రకం.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని కస్టమర్ నివాసం/కార్యాలయం సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు ఆ ఆర్డర్‌ను బదిలీ చేసేవీ ఉన్నాయి. వీఫార్మాసిస్ట్ ఇలానే చేస్తోంది. కావాల్సిన ఔషధాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుంటూ.. ఆ తర్వాత అదే ఆర్డర్‌ను కస్టమర్ లొకేషన్ సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత సంబంధిత స్టోర్ ప్రతినిధి కస్టమర్ నివాసానికి ఔషధాలను డెలివరీ చేస్తారు. డెలివరీ సమయంలోనే పేమెంట్ కూడా చేసేయవచ్చు.
చట్టం ఏం చెబుతోంది...
ఆన్‌లైన్ ఫార్మసీలు తమ వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తుండడంతో సంప్రదాయ ఔషధ వర్తకులు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరి ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లోనే ఆన్‌లైన్ ఫార్మసీల నియంత్రణకు సంబంధించి ఓ నమూనా విధానాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధానంలో ఆన్‌లైన్‌లో ఫార్మసీ నిర్వహించాలంటే సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవ్వరూ ఆన్‌లైన్‌లో ఔషధాలను ప్రదర్శించడం, పంపిణీ, విక్రయాలు చేయడం నిషిద్ధం. అలాగే, నార్కోటిక్, సైకోట్రాపిక్ ఔషధాలపై నిషేధానికి సంబంధించిన నిబంధనలూ వీటికి వర్తిస్తాయి.
రోగుల సమాచారం గోప్యంగా ఉంచడం, ఈ తరహా సమాచారం ఎవరికీ లీక్ అవకుండా, పంచుకోకుండా ఉండాలి. ఇక ఆన్‌లైన్ ఫార్మసీలను సవాలు చేస్తూ గతేడాది మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా.. ఈ ఫార్మసీ ప్రాజెక్టును అమల్లోకి తీసుకురానున్నట్టు ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రం బదులిచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానం అమల్లోకి వస్తే... లోపాలను నివారించడంతోపాటు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫార్మసీల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉంటుందని ఈ రంగానికి చెందిన పరిశీలకులు భావిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఔషధాలు... ఇవి తెలుసుకోవాల్సిందే!
Published Mon, Sep 2 2019 4:44 AM | Last Updated on Mon, Sep 2 2019 4:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment