E-pharmacy business
-
రిలయన్స్ ‘ఫార్మా’ షాపింగ్ !
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ–ఫార్మసీ విభాగంలో మరో సంస్థను దక్కించుకుంది. నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 620 కోట్లు. దీనితో వైటలిక్ హెల్త్‌లో 60 శాతం, దాని అనుబంధ సంస్థల్లో 100 శాతం (అన్నింటినీ కలిపి నెట్‌మెడ్స్‌గా వ్యవహరిస్తారు) వాటాలు ఆర్ఐఎల్కు దక్కుతాయి. డిజిటల్ విభాగం జియో ద్వారా కాకుండా రిటైల్ విభాగం ద్వారా ఆర్ఐఎల్ ఈ కొనుగోలు జరిపింది. ఈ–ఫార్మసీ విభాగానికి సంబంధించి ఆర్ఐఎల్ గతేడాదే సి–స్క్వేర్ అనే సంస్థను కొనుగోలు చేసింది. ఫార్మా రంగ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు ఇది సాఫ్ట్వేర్ అందిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ఆర్ఐఎల్ దాదాపు 3.1 బిలియన్ డాలర్ల విలువ చేసే కొనుగోళ్లు జరిపింది. ఈ డీల్స్‌లో 13 శాతం రిటైల్, 80 శాతం టెలికం.. మీడియా .. టెక్నాలజీ, మరో 6 శాతం ఇంధన రంగానికి చెందినవి ఉన్నాయి. గ్రూప్‌లో భాగమైన జియోమార్ట్ కేవలం నిత్యావసరాలకు మాత్రమే పరిమితం కాకుండా ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ తదితర ఉత్పత్తులను కూడా డెలివరీ చేయనున్నట్లు గత నెల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్ఐఎల్ వెల్లడించింది. ఆ దిశగా నెట్‌మెడ్స్ కొనుగోలు కంపెనీకి ఉపయోగపడనుంది. కన్సల్టింగ్ నుంచి ఔషధాల దాకా అన్నీ ఒకే చోట.. పటిష్టమైన డిజిటల్, ఈ–కామర్స్ వ్యవస్థను రూపొందించుకోవడంపై కంపెనీ మరింతగా దృష్టి పెడుతోందనడానికి ఈ కొనుగోలు నిదర్శనమని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ‘ప్రస్తుతం ఆర్ఐఎల్ తమ ఆన్లైన్ యాప్ జియోహెల్త్ హబ్ ద్వారా డిజిటల్ కన్సల్టేషన్, డయాగ్నొస్టిక్ టెస్టుల సర్వీసులు అందిస్తోంది. నెట్‌మెడ్స్ కొనుగోలుతో ఔషధాల డెలివరీ విభాగంలోకి కూడా దిగినట్లవుతుంది. టెలీకన్సల్టేషన్ అనంతరం, ప్రిస్క్రిప్షన్‌ను యాప్‌లో పొందుపర్చవచ్చు. ఆ తర్వాత పేషెంట్లకు అటు వైద్య పరీక్షలు ఇటు డాక్టరు సూచించిన ఔషధాలకు కలిపి కస్టమైజ్డ్ ఆఫర్లాంటివి ఇవ్వచ్చు‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. సాధారణగా డెలివరీ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ఫార్మసీలో మార్జిన్లు తక్కువగా ఉంటాయని, కాకపోతే దేశీయంగా భారీ మార్కెట్ కావడం వల్ల వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఆన్లైన్ ఫార్మసీ మార్కెట్‌ను ఆర్ఐఎల్ గణనీయంగా విస్తరించే అవకాశం ఉందని వివరించింది. రిటైల్ నెట్వర్క్ ఊతం.. దేశీయంగా మొత్తం ఔషధాల మార్కెట్ ఏకంగా 18–19 బిలియన్ డాలర్ల భారీ పరిమాణంలో ఉండగా ఆన్లైన్ ఔషధ మార్కెట్ వాటా ప్రస్తుతం సుమారు 3–3.5 శాతం స్థాయికే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న సంస్థలు సత్వర డెలివరీ సేవలు ఇవ్వలేకపోతుండటం, కస్టమర్లకు ఔషధాలు చేరాలంటే కనీసం 24–48 గంటల దాకా సమయం పట్టేస్తుండటం ఈ విభాగానికి ప్రతికూలాంశంగా ఉంటోంది. అయితే, దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లు ఉండటం ఆర్ఐఎల్కు లాభించే అంశమని క్రెడిట్ సూసీ పేర్కొంది. ‘భారీ సంఖ్యలో రిటైల్ నెట్వర్క్ ఉన్నందున డెలివరీ సమయాన్ని ఆర్ఐఎల్ గణనీయంగా తగ్గించడానికి వీలుంది. కంపెనీపరంగా డెలివరీ వ్యయాలూ తక్కువగా ఉంటాయి. తద్వారా మార్కెట్‌ను పెంచుకోవచ్చు‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. నిత్యావసరాలకు సంబంధించి కిరాణా దుకాణాలకు అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తున్నట్లే మధ్యకాలికంగా చిన్నా, చితకా మెడికల్ హాల్స్‌కు కూడా ఆర్ఐఎల్ అగ్రిగేటర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలిపింది. 670 పట్టణాల్లో నెట్‌మెడ్స్.. నెట్‌మెడ్స్ దేశీయంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ (ఓవర్ ది కౌంటర్), ఆరోగ్యం, వెల్నెస్ ఉత్పత్తులను ఆన్లైన్ ఫార్మసీ ద్వారా అందిస్తోంది. ఫార్మా రిటైలింగ్, తయారీలో సుదీర్ఘానుభవం ఉన్న ప్రమోటర్లు దీన్ని ఏర్పాటు చేశారు. 2018 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 1 మిలియన్ డాలర్లకు పైగా నమోదైనట్లు ఆర్ఐఎల్ తెలిపింది. నెట్‌మెడ్స్ ప్రస్తుతం 670 నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 70,000 పైచిలుకు ప్రిస్క్రిప్షన్, లైఫ్‌స్టయిల్ ఔషధాలు .. వెల్నెస్, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి వేల కొద్దీ సంఖ్యలో నాన్–ప్రిస్క్రిప్షన్ ఉత్పత్తులను అందిస్తోంది. యాప్ ద్వారా డాక్టర్ కన్సల్టేషన్ సేవలు కూడా అందిస్తోంది. -
ఆన్లైన్లో మందుల విక్రయంపై నిషేధం
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఇకపై మందుల విక్రయాన్ని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ రెగ్యులేటర్ సంస్థ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇ–ఫార్మసీ సంస్థలన్నీ తక్షణమే ఇంటర్నెట్లో మందుల విక్రయాన్ని నిలిపివేయాలని కోరినట్టు ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారి బుధవారం చెప్పారు. ఇ–ఫార్మసీ సంస్థల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనల్ని రూపొందించే పనిలో ఉంది. కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చినంత వరకు ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను నిలిపివేయాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వి.జి.సోమాని ఇటీవలే∙ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ కోర్టు తీర్పు అమలయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ డీసీజీఐ అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశించారు. ఎలా జరిగిందంటే.. చట్టవిరుద్ధంగా, అనుమతుల్లేకుండా ఆన్లైన్లో యథేచ్ఛగా కొనసాగుతున్న మందుల విక్రయానికి అడ్డుకట్ట వెయ్యాలని జహీర్ అహ్మద్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో గత ఏడాది పిల్ వేశారు. ఇష్టారాజ్యంగా ఆన్లైన్లో మందులు కొనుగోలు చేసి వాడడం వల్ల రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రజలు జీవించే హక్కుని కోల్పోతారని, వారి ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు 2018 డిసెంబర్లో ఆన్లైన్లో మందుల అమ్మకం నిలిపివేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జహీర్ మళ్లీ కోర్టుకెళ్లారు. దీనిపై హైకోర్టు కేంద్రానికి, ఇ–ఫార్మసీ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు గత సెప్టెంబర్‌లో స్పందించిన ఇ–ఫార్మసీ కంపెనీలు ఆన్లైన్ విక్రయాలకు ఎలాంటి అనుమతులు, ప్రిస్క్రిప్షన్లు అవసరం లేదని కోర్టుకు చెప్పారు. స్విగ్గీలో ఆహార పదార్థాలు ఎలా ఇంటికి అందిస్తున్నారో తాము కూడా మందుల్ని డోర్ డెలివరీ చేస్తున్నట్టు వింత వాదన వినిపించారు. ఆ కంపెనీలు 8 లక్షలు! ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కంపెనీలు ఆన్లైన్లో మందులు విక్రయిస్తున్నాయి. వీటికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. దేశవ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్ ఫార్మసీ కంపెనీలు 8 లక్షల వరకు ఉన్నట్టు ఒక అంచనా. ఆన్లైన్ అమ్మకాలతో తమ వ్యాపారాలకు దెబ్బ పడుతోందని ఫార్మసీ కంపెనీలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి. ఇ–ఫార్మసీ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లతో తాము వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితులున్నాయని అంటున్నాయి. స్విగ్గిలో ఆహార పదార్థాల సరఫరా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల డోల్ డెలివరీ ఒకటి కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. -
ఆన్లైన్లో ఔషధాలు... ఇవి తెలుసుకోవాల్సిందే!
డాక్టర్ రాసిన మందుల చీటిని ఫోన్ కెమెరా నుంచి క్లిక్ మనిపించి, దాన్ని మొబైల్ యాప్ నుంచి అప్లోడ్ చేసి, చిటికెలో ఆర్డర్ చేసేయడం... ఆ తర్వాత 24 నుంచి 48 గంటల్లోపు ఇంటికే ఔషధాలు వచ్చేయడం నేడు పట్టణాల్లో చూస్తున్నాం. చిన్న పట్టణాల నుంచి మెట్రోల వరకు ఈ ఫార్మసీ వ్యాపారం విస్తరిస్తోంది. దీనివల్ల మందుల ధరలపై ఎక్కువ తగ్గింపు లభించడంతోపాటు, డాక్టర్ సూచించిన మందుల్లో ఏదో ఒక రకం లేకపోవడమన్న సమస్య కూడా దాదాపుగా ఉండడం లేదు. దేశంలో ఔషధ మార్కెట్ రూపు రేఖలను మార్చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీ మార్కెట్‌కు సంబంధించి లాభ, నష్టాలపై అవగాహన కోసమే ఈ కథనం... ఈ–ఫార్మసీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొనడం.. సంప్రదాయ ఔషధ దుకాణాలు సేవల గురించి ఆలోచించే విధంగా దారితీసింది. ఈ పోటీ కారణంగా ఆర్డర్ చేస్తే ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నాయి సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు. కస్టమర్లను కాపాడుకునేందుకు వారికి అవసరమైన ఔషధాలు తమ వద్ద లేకపోయినా కానీ, ఆర్డర్ చేసి మరీ తెప్పిస్తున్నాయి. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు లు రావడానికి దోహదం చేసింది కచ్చితంగా ఈ ఫార్మసీలేనని చెప్పుకోవాలి. ఇక వైద్యులు తప్పనిసరిగా ఔషధం బ్రాండెడ్ పేరును కాకుండా, జనరిక్ పేరునే సూచించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వినియోగదారులకు ఏ కంపెనీ ఉత్పత్తి కొనుగోలు చేసుకోవాలనే విషయంలో స్వేచ్ఛను కల్పించనుంది. ధరలు ఈ ఫార్మసీలు సాధారణంగా ఔషధ ధరలపై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఆయా ఉత్పత్తులను బట్టి డిస్కౌంట్ వేర్వేరుగా ఉంటుంది. పోషక ఉత్పత్తులపై చాలా వరకు ఆన్లైన్ ఫార్మసీలు తక్కువే డిస్కౌంట్ ఇస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులపై (వైద్యులు రాసినవి) ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాయి. దీంతో ఈ ఫార్మసీల నుంచి కొనుగోలు చేసే వారికి కొంత ఆదా అవడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ ప్రభావంతో సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు కూడా దిగొచ్చి, ఎంఆర్పీపై తగ్గింపు ఇస్తున్నాయి. అయినప్పటికీ ఆన్లైన్ ఫార్మసీల్లోనే డిస్కౌంట్ ఎక్కువ లభిస్తోంది. ఔషధ ధరలపై తగ్గింపులు, ఆర్డర్ చేసే విషయంలో ఆన్లైన్ ఫార్మసీలకే ఎక్కువ మార్కులు పడతాయి. కాకపోతే డెలివరీకి తీసుకునే సమయంలోనే సవాలు నెలకొని ఉంది. ఈ ఫార్మసీ స్టార్టప్ సంస్థలు దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, రవాణా పరమైన సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. ఓ ఔషధం వెంటనే తీసుకోవాల్సి ఉంటే సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయడమే పరిష్కారం. ఇటువంటి వారు ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేసి, అవి వచ్చే వరకు వేచి ఉండడం సాధ్యపడదు. కాకపోతే క్రమం తప్పకుండా కొన్ని రకాల జీవనశైలి సమస్యలకు మందులు వాడే వారు మాత్రం తమకు కావాల్సిన మందులను ముందుగానే ఆన్లైన్ ఫార్మసీల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో అయితే ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు. కాకపోతే కనీస ఆర్డర్ విలువకు తక్కువ కొనుగోలు చేస్తే, డెలివరీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. భిన్న రకాలు... ఈ ఫార్మసీల్లో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది ఆన్లైన్లో మాత్రమే ఫార్మసీలను విక్రయించే నమూనా. సంబంధిత ఫార్మసీ స్టోర్ పోర్టల్ లేదా యాప్‌లో లాగిన్ అయి, కావాల్సిన మందులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఔషధాలను ఇంటికి డెలివరీ చేస్తారు. నెట్‌మెడ్స్, మెడ్‌లైఫ్, 1ఎంజీ, ఎంకెమిస్ట్, ఫార్మ్ఈజీ ఇవన్నీ కూడా ఈ కోవలోనివే. ఇక రెండో నమూనాలో అటు సంప్రదాయ ఫార్మసీ స్టోర్లతో పాటు, ఆన్‌లైన్‌లోనూ ఔషధ విక్రయాలను నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. తద్వారా రెండు మార్గాల్లోనూ కస్టమర్లను సంపాదించుకోవడం లక్ష్యం. మెడ్‌ప్లస్ ఈ తరహాలోనే పనిచేస్తోంది. మెడ్‌ప్లస్ సంస్థ 20 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్లపై తగ్గింపు ఇస్తోంది. మెడ్‌ప్లస్ స్టోర్‌కు వెళ్లి రూ.1,000లోపు ఆర్డర్ చేస్తే 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంటే, అదే ఆన్లైన్లో ఆర్డర్‌పై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తుండడం గమనార్హం. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే డిస్కౌంట్ ఆఫర్ చేయడంతోపాటు, ఇంటికి డెలివరీ చేయడం లేదా సమీపంలోని మెడ్‌ప్లస్ స్టోర్‌కు స్వయంగా వెళ్లి తీసుకునే ఆప్షన్లను కూడా ఇస్తోంది. కస్టమర్లు తమ సౌకర్యం కొద్దీ నచ్చినది ఎంచుకోవచ్చు. ఇక మూడో రకం.. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని కస్టమర్ నివాసం/కార్యాలయం సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు ఆ ఆర్డర్‌ను బదిలీ చేసేవీ ఉన్నాయి. వీఫార్మాసిస్ట్ ఇలానే చేస్తోంది. కావాల్సిన ఔషధాన్ని ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుంటూ.. ఆ తర్వాత అదే ఆర్డర్‌ను కస్టమర్ లొకేషన్ సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత సంబంధిత స్టోర్ ప్రతినిధి కస్టమర్ నివాసానికి ఔషధాలను డెలివరీ చేస్తారు. డెలివరీ సమయంలోనే పేమెంట్ కూడా చేసేయవచ్చు. చట్టం ఏం చెబుతోంది... ఆన్లైన్ ఫార్మసీలు తమ వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తుండడంతో సంప్రదాయ ఔషధ వర్తకులు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరి ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లోనే ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణకు సంబంధించి ఓ నమూనా విధానాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధానంలో ఆన్లైన్లో ఫార్మసీ నిర్వహించాలంటే సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవ్వరూ ఆన్లైన్లో ఔషధాలను ప్రదర్శించడం, పంపిణీ, విక్రయాలు చేయడం నిషిద్ధం. అలాగే, నార్కోటిక్, సైకోట్రాపిక్ ఔషధాలపై నిషేధానికి సంబంధించిన నిబంధనలూ వీటికి వర్తిస్తాయి. రోగుల సమాచారం గోప్యంగా ఉంచడం, ఈ తరహా సమాచారం ఎవరికీ లీక్ అవకుండా, పంచుకోకుండా ఉండాలి. ఇక ఆన్లైన్ ఫార్మసీలను సవాలు చేస్తూ గతేడాది మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా.. ఈ ఫార్మసీ ప్రాజెక్టును అమల్లోకి తీసుకురానున్నట్టు ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రం బదులిచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానం అమల్లోకి వస్తే... లోపాలను నివారించడంతోపాటు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫార్మసీల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉంటుందని ఈ రంగానికి చెందిన పరిశీలకులు భావిస్తున్నారు. -
ఈ-ఫార్మసీలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు: ఏఐఓసీడీ
ముంబై : ఈ-ఫార్మసీల (ఆన్లైన్ ద్వారా ఔషధాల విక్రయం) వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) హెచ్చరించింది. ఔషధాలను (మెడిసిన్స్) సాధారణ వస్తువులతో పోల్చలేమని తెలిపింది. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ-ఫార్మసీల రూపంలో ఈ-కామర్స్ హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశించిందని వివరించింది. ఈ-ఫార్మసీలు ఎలాంటి రూపంలో ఉన్నప్పటికీ వాటి కార్యకలాపాలను ప్రస్తుత నిబంధనలు అనుమతించవని పేర్కొంది. ఆన్లైన్ ఔషధాల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-ఫార్మసీ బిజినెస్‌ను అనుమతించడం సరైందికాదని ఏఐఓసీడీ ప్రెసిడెంట్ జే ఎస్ షిండే తెలిపారు. కొన్ని సంస్థలు స్వలాభం కోసం ప్రజల జీవితాలతో ఆట్లాడుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఔషధాలను వైద్యులు, ఫార్మసిస్ట్స్ సలహాల మేరకే వినియోగించాలని సూచించారు. ఎవరి సూచనలు, సలహాలు లేకుండా ఆన్లైన్ ద్వారా ఔషధాలను తెప్పించుకొని ఉపయోగించడం సురక్షితం కాదని వివరించారు. ఆన్లైన్ ఔషధాల వినియోగానికి ప్రభు త్వం ప్రత్యేకమైన నిబంధనలను రూపొందిం చాలని కోరారు. ఆన్లైన్ ఫార్మసీల వల్ల చిన్న ఫార్మసీలు, వాటిపై ఆధారపడిన కుటుంబాలు, ఉద్యోగులకు నష్టంవాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.