ఆన్‌లైన్‌లో మందుల విక్రయంపై నిషేధం | Online drug sales may come to halt as licence made must | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో మందుల విక్రయంపై నిషేధం

Published Thu, Dec 5 2019 5:20 AM | Last Updated on Thu, Dec 5 2019 5:20 AM

Online drug sales may come to halt as licence made must - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఇకపై మందుల విక్రయాన్ని నిలిపివేయాలని సెంట్రల్‌ డ్రగ్స్‌ రెగ్యులేటర్‌ సంస్థ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇ–ఫార్మసీ సంస్థలన్నీ తక్షణమే ఇంటర్నెట్‌లో మందుల విక్రయాన్ని నిలిపివేయాలని కోరినట్టు ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారి బుధవారం చెప్పారు.

ఇ–ఫార్మసీ సంస్థల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనల్ని రూపొందించే పనిలో ఉంది. కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చినంత వరకు ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకాలను నిలిపివేయాలంటూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) వి.జి.సోమాని ఇటీవలే∙ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ కోర్టు తీర్పు అమలయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ డీసీజీఐ అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశించారు.  

ఎలా జరిగిందంటే..  
చట్టవిరుద్ధంగా, అనుమతుల్లేకుండా ఆన్‌లైన్‌లో యథేచ్ఛగా కొనసాగుతున్న మందుల విక్రయానికి అడ్డుకట్ట వెయ్యాలని జహీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో గత ఏడాది పిల్‌ వేశారు. ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేసి వాడడం వల్ల రాజ్యాంగంలో ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రజలు జీవించే హక్కుని కోల్పోతారని, వారి ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు 2018 డిసెంబర్‌లో ఆన్‌లైన్‌లో మందుల అమ్మకం నిలిపివేయాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జహీర్‌ మళ్లీ కోర్టుకెళ్లారు. దీనిపై హైకోర్టు కేంద్రానికి, ఇ–ఫార్మసీ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు గత సెప్టెంబర్‌లో స్పందించిన ఇ–ఫార్మసీ కంపెనీలు ఆన్‌లైన్‌ విక్రయాలకు ఎలాంటి అనుమతులు, ప్రిస్క్రిప్షన్లు అవసరం లేదని కోర్టుకు చెప్పారు. స్విగ్గీలో ఆహార పదార్థాలు ఎలా ఇంటికి అందిస్తున్నారో తాము కూడా మందుల్ని డోర్‌ డెలివరీ చేస్తున్నట్టు వింత వాదన వినిపించారు.  

ఆ కంపెనీలు 8 లక్షలు!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కంపెనీలు ఆన్‌లైన్‌లో మందులు విక్రయిస్తున్నాయి. వీటికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. దేశవ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్‌ ఫార్మసీ కంపెనీలు 8 లక్షల వరకు ఉన్నట్టు ఒక అంచనా. ఆన్‌లైన్‌ అమ్మకాలతో తమ వ్యాపారాలకు దెబ్బ పడుతోందని ఫార్మసీ కంపెనీలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి. ఇ–ఫార్మసీ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లతో తాము వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితులున్నాయని అంటున్నాయి. స్విగ్గిలో ఆహార పదార్థాల సరఫరా, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందుల డోల్‌ డెలివరీ ఒకటి కాలేదని కేంద్రం స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement