ఈ-ఫార్మసీలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు: ఏఐఓసీడీ
ముంబై : ఈ-ఫార్మసీల (ఆన్‌లైన్ ద్వారా ఔషధాల విక్రయం) వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) హెచ్చరించింది. ఔషధాలను (మెడిసిన్స్) సాధారణ వస్తువులతో పోల్చలేమని తెలిపింది. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ-ఫార్మసీల రూపంలో ఈ-కామర్స్ హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశించిందని వివరించింది. ఈ-ఫార్మసీలు ఎలాంటి రూపంలో ఉన్నప్పటికీ వాటి కార్యకలాపాలను ప్రస్తుత నిబంధనలు అనుమతించవని పేర్కొంది. ఆన్‌లైన్ ఔషధాల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్‌కు విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-ఫార్మసీ బిజినెస్‌ను అనుమతించడం సరైందికాదని ఏఐఓసీడీ ప్రెసిడెంట్ జే ఎస్ షిండే తెలిపారు. కొన్ని సంస్థలు స్వలాభం కోసం ప్రజల జీవితాలతో ఆట్లాడుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఔషధాలను వైద్యులు, ఫార్మసిస్ట్స్ సలహాల మేరకే వినియోగించాలని సూచించారు. ఎవరి సూచనలు, సలహాలు లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఔషధాలను తెప్పించుకొని ఉపయోగించడం సురక్షితం కాదని వివరించారు. ఆన్‌లైన్ ఔషధాల వినియోగానికి ప్రభు త్వం ప్రత్యేకమైన నిబంధనలను రూపొందిం చాలని కోరారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల చిన్న ఫార్మసీలు, వాటిపై ఆధారపడిన కుటుంబాలు, ఉద్యోగులకు నష్టంవాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.