ఔషధ విక్రయాలకు రెండంకెల వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఔషధ విక్రయాలు గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో 13 శాతం వృద్ధి చెందాయి. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం నాలుగు మాసాలుగా పరిశ్రమ రెండంకెల వృద్ధి కొనసాగిస్తోందని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ వెల్లడించింది.
ఆగస్ట్‌లో ఇది 12.1 శాతం నమోదైతే, 2021 సెప్టెంబర్‌లో ఇది 12.6 శాతంగా ఉంది. భారత ఔషధ విపణి యాంటీ–ఇన్ఫెక్టివ్స్, రెస్పిరేటరీ మినహా అన్ని రకాల చికిత్సలలో బలమైన రెండంకెల వృద్ధి కారణంగా మెరుగైన పనితీరును అందించడం కొనసాగించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది.
ధరల్లో 6.6 శాతం పెరుగుదల..
2021 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఔషధాల అమ్మకాల పరిమాణం 4.5 శాతం ఎగసింది. నూతన ఉత్పత్తుల రాక 1.9 శాతం పెరిగింది. ధరలు 6.6 శాతం దూసుకెళ్లాయి. తీవ్రమైన జబ్బులకు వాడే ఔషధాల విక్రయాలు 9.2 శాతం పెరిగాయి. మొత్తం పరిశ్రమలో వీటి వాటా 47 శాతం. దీర్ఘకాలిక రోగాలకు వాడే మందులు 16.1 శాతం, మిత, మధ్యస్థ వ్యవధి జబ్బులకు ఉపయోగించే ఔషధాల అమ్మకాలు 17.3 శాతం అధికం అయ్యాయి. గైనకాలజీ సంబంధ మెడిసిన్స్ అత్యధికంగా 24.7 శాతం, హృదయ 18.2, చర్మ, నాడీ వ్యవస్థ సంబంధ మందులు 17.8 శాతం ఎగశాయి.
కంపెనీల వారీగా ఇలా..
సెప్టెంబర్ నెల అమ్మకాల్లో అత్యధికంగా నాట్కో ఫార్మా 31.2 శాతం వృద్ధి సాధించింది. బయోకాన్ 28.2, గ్లెన్‌మార్క్ 23.2, ఈరిస్ లైఫ్‌సైన్సెస్ 21.2 శాతం దూసుకెళ్లాయి. టోరెంట్, ఆస్ట్రాజెనికా, అజంతా, జైడస్, సన్ ఫార్మా, అబాట్, వొకార్డ్, జేబీ కెమికల్స్, ఇప్కా ల్యాబ్స్ మార్కెట్ కంటే అధికంగా 16 నుంచి 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్డీసీ, ఆల్కెమ్, సిప్లా, గ్లాక్సోస్మిత్‌క్లైన్ 10–12 శాతం, లుపిన్, రెడ్డీస్, అలెంబిక్ 8–9 శాతం అధికంగా విక్రయాలు సాగించాయి. నొవార్టిస్, ఇండాకో రెమెడీస్, ఫైజర్, సనోఫి 3 శాతం లోపు వృద్ధికి పరిమితం అయ్యాయి. ఇక సెప్టెంబర్ త్రైమాసికానికి పరిశ్రమ 13 శాతం వృద్ధి సాధించింది.