
న్యూఢిల్లీ: ఉత్తర అమెరికా, యూరప్ దేశాల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత ఫార్మా రంగ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం 11 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. 2018–19లో 19.2 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 17.3 బిలియన్ డాలర్లు కాగా, 2016–17లో 16.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత ఫార్మా ఎగుమతుల్లో ఉత్తర అమెరికా మార్కెట్ వాటా 30 శాతంగా ఉండగా, ఆఫ్రికా వాటా 19 శాతం, యూరోపియన్ యూని యన్ వాటా 16 శాతంగాను ఉంది.
కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చైనా మార్కెట్ కూడా క్రమంగా అందుబాటులోకి వస్తోందని, వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా చైనాకు ఫార్మా ఎగుమతులపై మరింతగా దృష్టి సారిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇతరత్రా కీలకమైన దక్షిణాఫ్రికా, రష్యా, నైజీరియా, బ్రెజిల్, జర్మనీలకు కూడా ఎగుమతులు వృద్ధి చెందాయి.
టాప్ 5లో ఒకటి..: ఎగుమతులకు సంబంధించిన టాప్ 5 రంగాల్లో ఫార్మా కూడా ఒకటి. 2018–19లో మొత్తం 331 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో ఫార్మా వాటా 6 శాతంగా నమోదైంది. దేశీ ఫార్మా రంగంలో జనరిక్స్ ఔషధాల వాటానే ఎక్కువగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment