న్యూఢిల్లీ: ఎగుమతులు మార్చిలో భారీగా నమోదయ్యాయి. 11 శాతం వృద్ధి నమోదయ్యింది. ఔషధాలు, రసాయనాలు, ఇంజనీరింగ్ రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరగడం దీనికి కారణం. కాగా మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో (2018–2019) ఎగుమతులు 9 శాతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...
►మార్చిలో ఎగుమతుల విలువ 32.55 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.29.32 బిలియన్ డాలర్లు. అంటే వృద్ధి 11 శాతం అన్నమాట. శాతాల్లో ఇంత స్థాయిలో వృద్ధి నమోదుకావడం 2018 అక్టోబర్ (17.86 శాతం) తరువాత ఇదే తొలిసారి.
►ఇక ఇదే నెలలో దిగుమతులు కేవలం 1.44 శాతమే పెరిగాయి. విలువ రూపంలో 43.44 బిలియన్ డాలర్లు.
► దీని ప్రకారం ఎగుమతులు–దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం(వాణిజ్యలోటు) 10.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఏడాది మార్చి నెలలో వాణిజ్య లోటు 13.61 బిలియన్ డాలర్లుగా ఉంది.
2018–19 వాణిజ్యలోటు
176.42 బిలియన్ డాలర్లు
కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, ఎగుమతులు 9 శాతం పెరిగి 331 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులూ 9 శాతం వృద్ధి చెందాయి. విలువ రూపంలో ఇది 507.44 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 176.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాణిజ్యలోటు 162 బిలియన్లు మాత్రమే. ఈ ఏడాది కాలంలో పెట్రోలియం (28 శాతం), ప్లాస్టిక్ (25.6 శాతం), రసాయనాలు (22 శాతం) ఫార్మా (11 శాతం), ఇంజనీరింగ్ (6.36 శాతం) రంగాలు మంచి పనితనం ప్రదర్శించాయి. ఈ కాలంలో చమురు దిగుమతులు 29.27 శాతం పెరిగి 140.47 బిలియన్ డాలర్లుగా నమోదయితే, చమురుయేతర దిగుమతులు 2.82 శాతం పెరిగి 366.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఫిబ్రవరిలో సేవలు పేలవం
2019 ఏడాది ఫిబ్రవరిలో సేవల రంగం గణాంకాలు నిరాశపరిచాయి. తాజా గణాంకాల ప్రకారం... సేవలరంగం ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6.54 శాతం (2018 ఫిబ్రవరితో పోల్చితే) తగ్గాయి. విలువ రూపంలో 16.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే కాలంలో సేవల దిగుమతులూ 11 శాతం తగ్గి 9.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
కష్టనష్టాల్లోనూ మంచి ఫలితం
గడచిన మూడు సంవత్సరాలుగా అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ 2018–19లో 331.02 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిపాం. 2013–14లో సాధించిన 314.4 బిలియన్ డాలర్లకన్నా ఇది అధికం. సవాళ్లతో కూడిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లోనూ సాధించిన విజయమిది’’
– కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ
మరిన్ని రంగాలపై దృష్టి అవసరం
అంతర్జాతీయ వాణిజ్య ప్రతికూలతల్లోనూ ఎగుమతుల విషయంలో మంచి ఫలితాలు సాధించడం హర్షణీయం. అయితే ఫుడ్ కమోడిటీ వంటి కొత్త ఉత్పత్తుల ఎగుమతులపైనా దృష్టి సారించాలి. ఎగుమతుల వృద్ధికి ఇలాంటి నిర్ణయాలు మరింత దోహదపడతాయి. దీర్ఘకాలంలో అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకుని ఎగుమతులు వృద్ధి చెందుతాయి. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ చైర్మన్
డిమాండ్లు నెరవేర్చాలి
రక్షణాత్మక వాదం, అంతర్జాతీయ, దేశీయ కఠిన పరిస్థితుల్లోనూ ఎగుమతులు పెరగడం హర్షణీయం. అయితే ఎగుమతుల వృద్ధి మున్ముందూ కొనసాగడానికి కొన్ని చర్యలు అవసరమని డిమాండ్ చేస్తున్నాం. అందులో తగిన సమయంలో తగిన రుణ సదుపాయం ఒకటి. పరిశోధనా, అభివృద్ధి విభాగాల విషయంలో పన్ను రాయితీలు ఉండాలి. జీఎస్‌టీ నుంచి మినహాయింపులు అవసరం. – గణేశ్ కుమార్ గుప్తా, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment