న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లకు చేరాయి. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి సవరించిన లక్ష్యంలో 83.19 శాతానికి సమానమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. అలాగే అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.78 శాతం అధికంగా నమోదు కావడం విశేషం. సీబీడీటీ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.58 శాతం అధికమై రూ.16.68 లక్షల కోట్లకు ఎగశాయి.
ఇందులో రిఫండ్స్ వాటా రూ.2.95 లక్షల కోట్లుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిఫండ్స్ 59.44 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైన నికర ప్రత్యక్ష పన్నులు మొత్తం బడ్జెట్ అంచనాల్లో 96.67 శాతానికి సమానం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లే వృద్ధిని నడిపించాయని సీబీడీటీ తెలిపింది. రిఫండ్స్ పోను నికరంగా కార్పొరేట్ ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు 13.62%, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌తో కలిపి పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు 20.06% వృద్ధి చెందాయి.
Comments
Please login to add a commentAdd a comment