Personal income tax collections
-
జీడీపీలో వ్యక్తిగత ఆదాయపు పన్ను నిష్పత్తి 3% అప్
న్యూఢిల్లీ: భారత్ వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు దేశ 2021–22 స్థూల దేశీయోత్పత్తిలో 2.94 శాతానికి చేరాయి. 2014–15లో ఈ నిష్పత్తి 2.11 శాతంగా ఉంది. ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య విస్తరిస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న వివిధ చర్యల ప్రభావం గురించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ)తో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, 2014–15లో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను) రూ.2.65 లక్షల కోట్లుకాగా, ఈ పరిమాణం రూ.6.96 లక్షల కోట్లకు చేరింది. ఇక తాజాగా ‘న్యూ ట్యాక్స్ డిడక్టెడ్ యట్ సోర్స్ (టీడీఎస్) కోడ్స్ తీసుకురాడంతో ఈ లావాదేవీ సంఖ్య దాదాపు రెట్టింపై 70 కోట్ల నుంచి (2015–16 ఆర్థిక సంవత్సరంలో)144 కోట్లకు (2021–22 ఆర్థిక సంవత్సరం) ఎగసింది. సత్వర నిర్ణయాలు అవసరం: సీతారామన్ పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడం, పెండింగులో ఉన్న న్యాయ వివాదాల పరిష్కారం, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని కొన్ని సెక్షన్ల కింద రాయితీల మంజూరు వంటి పలు అంశాలపై సీబీడీటీ అధికారులతో ఆర్థిక మంత్రి సమీక్షా సమావేశం చర్చించింది. పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన అన్ని దరఖాస్తులపై సీబీడీటీ సకాలంలో తగిన చర్యలను, నిర్ణయాలను తీసుకోవాలని, ఆయా దరఖాస్తులను పరిష్కరించడానికి తగిన కాలపరిమితిని నిర్దేశించుకోవాలని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. ప్రత్యక్ష పన్ను చట్టాలు, నియమ–నిబంధనలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల్లో అవగాహనను పెంచడానికి ప్రయత్నాలను విస్తరించాలని కూడా సీబీడీటీకి ఆమె సూచించారు. ఆర్థిక మంత్రితో జరిగిన సీబీడీటీ సమీక్షా సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, బోర్డ్ చైర్మన్ నితిన్ గుప్తా తదితర సభ్యులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లు రూ.13..73 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లకు చేరాయి. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి సవరించిన లక్ష్యంలో 83.19 శాతానికి సమానమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. అలాగే అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.78 శాతం అధికంగా నమోదు కావడం విశేషం. సీబీడీటీ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.58 శాతం అధికమై రూ.16.68 లక్షల కోట్లకు ఎగశాయి. ఇందులో రిఫండ్స్ వాటా రూ.2.95 లక్షల కోట్లుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిఫండ్స్ 59.44 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైన నికర ప్రత్యక్ష పన్నులు మొత్తం బడ్జెట్ అంచనాల్లో 96.67 శాతానికి సమానం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లే వృద్ధిని నడిపించాయని సీబీడీటీ తెలిపింది. రిఫండ్స్ పోను నికరంగా కార్పొరేట్ ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు 13.62%, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌తో కలిపి పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు 20.06% వృద్ధి చెందాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా సెప్టెంబర్ 8వ తేదీ నాటికి 24 శాతం పెరిగి రూ.8.98 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్స్ మినహాయింస్తే, నికర వసూళ్లు 16.25 శాతం ఎగసి రూ.7.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్–అక్టోబర్ 8 మధ్య రిఫండ్స్ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 81 శాతం పెరిగి రూ.1.53 లక్షల కోట్లుగా నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మొత్తం వసూళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను ( సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ పన్నుసహా) 32 శాతం పెరగ్గా, కార్పొరేట్ పన్ను ఆదాయాలు 17 శాతం ఎగశాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. 2022–23లో ఈ వసూళ్ల లక్ష్యం రూ.14.20 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. తాజా గణాంకాల ప్రకారం, నికర వసూళ్లు (రూ.7.45 లక్షల కోట్లు) బడ్జెట్ అంచనాల్లో దాదాపు 52 శాతం దాటడం గమనార్హం. దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం శుభ సూచికమని నిపుణులు పేర్కొంటున్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ప్రతినెలా దాదా పు రూ.1.45 లక్షల కోట్లుగా నమోదవుతున్నాయి. -
అంచనాలను మించిన ఆదాయపన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను రూపేణా రూ.9.45 లక్షల కోట్ల ఆదాయం 2020–21 ఆర్థిక సంవత్సరంలో సమకూరింది. సవరించిన అంచనాల కంటే ఇది 5 శాతం అధికం కాగా.. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019–20)లో వచ్చిన ఆదాయం కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం. ఈ మేరకు వివరాలను ఆదాయపన్ను శాఖ శుక్రవారం విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.13.19 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వస్తుందని తొలుత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆ తర్వాత కరోనా రాకతో ఆర్థిక వ్యవస్థ చతికిలపడడం తెలిసిందే. దీంతో కేంద్ర సర్కారు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యక్ష పన్నుల ఆదాయం అంచనాలను రూ.9.05 లక్షల కోట్లకు సవరించింది. ఆదాయపన్ను రిఫండ్లను (అధికంగా వసూలు చేసిన పన్నును తిరిగి ఇచ్చేయడం) పెద్ద మొత్తంలో చేసినప్పటికీ.. సవరించిన పన్నుల ఆదాయ అంచనాలను తమ శాఖ అధిగమించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోదీ పేర్కొన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్ సంస్థల ఆదాయపన్ను చెల్లింపులను ప్రత్యక్ష పన్నులుగా పేర్కొంటారు. 2019–20 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.10.49 లక్షల కోట్లు రావడం గమనార్హం. తాజాగా ముగిసిన 2020–21లో ఇది రూ.9.45 లక్షల కోట్లుగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) రూ.11.08 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని బడ్జెట్లో కేంద్రం అంచనా వేయడం గమనార్హం. రూ.2.61లక్షల కోట్ల రిఫండ్లు ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో కార్పొరేట్ పన్ను రూపేణా రూ.4.57 లక్షల కోట్లు సమకూరగా.. వ్యక్తిగత ఆదాయపన్ను ద్వారా రూ.4.71 లక్షల కోట్లు వచ్చింది. రూ.16,927 కోట్లు సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో వసూలైంది. రూ.2.61 లక్షల కోట్ల మేర పన్ను రిఫండ్లను కూడా కలిపి చూస్తే స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం 2020–21 సంవత్సరానికి రూ.12.06లక్షల కోట్లుగా ఉంది. పన్ను రిఫండ్లు గత ఆర్థిక సంవత్సరానికి 42 శాతం పెరిగాయి. ‘‘కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లను తీసుకొచ్చినప్పటికీ.. 2020–21 సంవత్సరానికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో పెరుగుదల నమోదైంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. పన్ను నిబంధనల అమలు భారాన్ని తగ్గించేందుకు ఎన్నో చర్యలు చేపట్టినట్టు పీసీ మోదీ పేర్కొన్నారు. ఇది పన్నుల ఆదాయంలో ప్రతిఫలించినట్టు చెప్పారు. -
పడిపోతున్న ఆదాయంతో సవాలే..
ముంబై: పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను, పన్నేతర ఆదాయం లక్ష్యాలకు దూరంగా ఉండడంతోపాటు, ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం బలహీనపడడం సవాలుగా పేర్కొంది. శుక్రవారం ముంబైలో విడుదల చేసిన 25వ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఈ అంశాలను ప్రస్తావించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు తమ బ్యాలన్స్ షీట్ల ప్రక్షాళనకు తీసుకున్న చర్యల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతున్నట్టు తెలిపింది. నవంబర్ నాటికే ద్రవ్యలోటు నిర్ణీత లక్ష్యంలో 107 శాతానికి చేరిపోవడంతో.. జీడీపీలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతుండడం ఆర్బీఐ వ్యాఖ్యల్లోనూ కనిపించింది. అలాగే, జీఎస్టీ వసూళ్లు కూడా ఆశించిన మేర లేవు. మరోవైపు కార్పొరేట్ పన్ను కోత కారణంగా ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోనుంది. ‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఆర్బీఐ స్థిరత్వ నివేదిక పేర్కొంది. స్థూల ఎన్పీఏలు పెరగొచ్చు స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కారణంగా బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2020 సెప్టెంబర్ నాటికి 9.9 శాతానికి పెరగొచ్చని ఈ నివేదిక పేర్కొంది. 2019 సెప్టెంబర్ నాటికి ఇవి 9.3 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 9.3 శాతం స్థాయిలోనే స్థిరంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 12.7 శాతం నుంచి 13.2 శాతానికి, ప్రైవేటు బ్యాంకుల్లో ఇది 3.9 శాతం నుంచి 4.2 శాతానికి.. అదే విధంగా దేశంలో పనిచేసే విదేశీ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2.9% నుంచి 3.1 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆస్తుల నాణ్యత ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఎన్బీఎఫ్సీ రంగంలో స్థూల ఎన్పీఏలు 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెరిగాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నికర ఎన్పీఏలు మాత్రం స్థిరంగా 3.4 శాతం వద్దే ఉన్నాయని తెలిపింది. క్యాపిటల్ టు రిస్క్ అసెట్స్ రేషియో (సీఆర్ఏఆర్) నిర్దేశిత 20% కంటే తక్కువగా 19.5 శాతం వద్ద ఉంది. రూ.5 కోట్లు దాటితే చెప్పాలి.. రూ.5 కోట్లు, అంతకుమించి రుణాల సమాచారాన్ని.. భారీ రుణాల కేంద్ర సమాచార కేంద్రానికి (సీఆర్‌ఐఎల్‌సీ) తెలియజేయాలని పెద్దసైజు కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులున్న అన్ని అర్బన్ కోపరేటివ్ బ్యాంకులను సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాలనను మెరుగుపరిచి వృద్ధికి తోడ్పడాలి: దాస్ కంపెనీలు, బ్యాంకులు పాలనా ప్రమాణాలను మెరుగుపరుచుకుని, దేశ ఆర్థిక వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు తోడ్పడాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5%కి సెప్టెంబర్ త్రైమాసికంలో పడిపోయిన విషయం విదితమే. అలాగే, చాలా కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. వినియోగం, పెట్టుబడులను పునరుద్ధరించడం అన్నవి ప్రధాన సవాళ్లుగా దాస్ పేర్కొన్నారు. బోర్డుల్లో మంచి కార్పొరేట్ పరిపాలన అన్నది మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు ముఖ్యమైన అంశమనేది తన అభిప్రాయంగా చెప్పారు. ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల సందర్భంగా దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
14 శాతం పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ, ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 20 వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13.7 శాతం వృద్ధితో రూ. 4.12 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 3.63 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 6.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల(రూ.5.65 లక్షల కోట్లు)తో పోల్చితే ఇది 19 శాతం అధికం.