న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ, ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 20 వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13.7 శాతం వృద్ధితో రూ. 4.12 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 3.63 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 6.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల(రూ.5.65 లక్షల కోట్లు)తో పోల్చితే ఇది 19 శాతం అధికం.