న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు డిసెంబర్ 17వ తేదీ నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగి రూ.13,70,388 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) వాటా రూ.6.95 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ), సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) వాటా రూ.6.73 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సమాచారం ప్రకారం, 2023–24 బడ్జెట్ లక్ష్యాల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 75 శాతానికి చేరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.63 లక్షల కోట్లు. 2023–24లో ఈ లక్ష్యాన్ని రూ.18.23 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించుకుంది.
రిఫండ్స్ రూ.2.25 లక్షల కోట్లు..
కాగా, డిసెంబర్ 17 వరకూ రిఫండ్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు. వీటిని కూడా కలుపుకుంటే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.7.90 లక్షల కోట్లు, ఎస్‌టీటీసహా వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.03 లక్షల కోట్లు. వేర్వేరుగా వసూళ్లను పరిశీలిస్తే... అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ.6.25 లక్షల కోట్లు, టీడీఎస్ రూ.7.71 లక్షల కోట్లు, సెల్ప్–అసెస్‌మెంట్ ట్యాక్స్ రూ.1.49 లక్షల కోట్లు. రెగ్యులర్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూ. 36,651 కోట్లు. ఇతర హెడ్స్ కింద వసూళ్ల మ్తొతం రూ.14,455 కోట్లు.
లక్ష్యాల సాధనపై భరోసా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్నుల (వస్తు సేవల పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్) వసూళ్ల లక్ష్యం రూ.15.38 లక్షల కోట్లు. వెరసి మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 33.61 లక్షల కోట్లు. ఈ స్థాయి పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, డిసెంబర్ 17 వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 21 శాతం పెరిగాయి. పరోక్ష పన్ను దాదాపు 5 శాతం అధికంగా నమోదయ్యాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల మొత్తం రూ.30.54 లక్షల కోట్లు. 2023–24లో దీనిని 10 శాతం (రూ.33.61 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభకు ఎన్నికల అనంతరం కొలువుదీరే నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment