దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 11 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.54 శాతం వృద్ధి చెంది రూ. 5.74 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ పన్ను వసూళ్లు రూ.4.80 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.74 లక్షల కోట్లలో (జూలై 11 నాటికి) కార్పొరేషన్ పన్ను (CIT) రూ. 2.1 లక్షల కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత), వ్యక్తిగత ఆదాయపు పన్ను (PIT) రూ. 3.46 లక్షల కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) రూ. 16,634 కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత) ఉన్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వివరించింది.
కాగా ప్రభుత్వం 2024-25లో జూలై 11 వరకు రూ. 70,902 కోట్ల ప్రత్యక్ష పన్ను రీఫండ్‌లను జారీ చేసింది. 2023-24లో జారీ చేసిన రూ. 43,105 కోట్లతో పోలిస్తే ఇది 64.49 శాతం పెరిగింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) రూ. 21.99 లక్షల కోట్ల వసూళ్లను అంచనా వేసింది.
ఒక నిర్దిష్ట సంవత్సరానికి ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన పన్ను వసూళ్లు ముఖ్యమైనవి . కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక లోటు 5.2 శాతం లక్ష్యంగా పెట్టుకుంది. స్థూల ప్రాతిపదికన, రీఫండ్‌లను సర్దుబాటు చేయడానికి ముందు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూలై 11 నాటికి రూ. 6.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23.24 శాతం వృద్ధి.
Comments
Please login to add a commentAdd a comment