Personal Income Tax
-
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.70 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు డిసెంబర్ 17వ తేదీ నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగి రూ.13,70,388 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) వాటా రూ.6.95 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ), సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వాటా రూ.6.73 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సమాచారం ప్రకారం, 2023–24 బడ్జెట్ లక్ష్యాల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 75 శాతానికి చేరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.63 లక్షల కోట్లు. 2023–24లో ఈ లక్ష్యాన్ని రూ.18.23 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించుకుంది. రిఫండ్స్ రూ.2.25 లక్షల కోట్లు.. కాగా, డిసెంబర్ 17 వరకూ రిఫండ్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు. వీటిని కూడా కలుపుకుంటే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.7.90 లక్షల కోట్లు, ఎస్‌టీటీసహా వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.03 లక్షల కోట్లు. వేర్వేరుగా వసూళ్లను పరిశీలిస్తే... అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ.6.25 లక్షల కోట్లు, టీడీఎస్ రూ.7.71 లక్షల కోట్లు, సెల్ప్–అసెస్మెంట్ ట్యాక్స్ రూ.1.49 లక్షల కోట్లు. రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ రూ. 36,651 కోట్లు. ఇతర హెడ్స్ కింద వసూళ్ల మ్తొతం రూ.14,455 కోట్లు. లక్ష్యాల సాధనపై భరోసా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్నుల (వస్తు సేవల పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్) వసూళ్ల లక్ష్యం రూ.15.38 లక్షల కోట్లు. వెరసి మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 33.61 లక్షల కోట్లు. ఈ స్థాయి పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, డిసెంబర్ 17 వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 21 శాతం పెరిగాయి. పరోక్ష పన్ను దాదాపు 5 శాతం అధికంగా నమోదయ్యాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల మొత్తం రూ.30.54 లక్షల కోట్లు. 2023–24లో దీనిని 10 శాతం (రూ.33.61 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభకు ఎన్నికల అనంతరం కొలువుదీరే నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 26 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం (ప్రస్తుత 2022–23) ఇంకా దాదాపు మూడు నెలలుపైగా మిగిలి ఉండగానే ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష్యంవైపునకు దూసుకుపోతున్నాయి. ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 17వ తేదీ నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా 26 శాతం వృద్ధితో రూ.13,63,649 కోట్లుగా నమోదయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ లక్ష్యంలో ఇది దాదాపు 80 శాతం. అధికారిక సమాచారం ప్రకారం, స్థూల వసూళ్లలో రిఫండ్స్ విలువ రూ.2.28 లక్షల కోట్లు. ఇవి పోను నికరంగా వసూళ్లు రూ.11.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థూల వసూళ్లలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) విలువ రూ.7.25 లక్షల కోట్లు. ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్)సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (పీఐటీ) వసూళ్లు రూ.6.35 లక్షల కోట్లు. మొత్తం లక్ష్యం రూ.27.50 లక్షల కోట్లు.. 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. 2022–23లో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు కట్టడికి (జీడీపీలో 6.4 శాతం వద్ద) దోహదపడే అంశం ఇది. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
Pre-Budget 2023: బడ్జెట్లో పన్నులు తగ్గించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలన్నది బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ముందుకు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. అలాగే, మరింత మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని, ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా మరిన్ని నిధులను ఖర్చు చేయాలని, పలు రంగాలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న డిమాండ్లు వచ్చా యి. కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 బడ్జెట్‌కు ముందు వివిధ భాగస్వాములు, పరిశ్రమలతో సంప్రదింపులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 21న పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు మొదలు పెట్టారు. సోమవారం ఆర్థికవేత్తల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా చర్చలను ముగించారు. వచ్చే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను మంత్రి సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనుండడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు గ్రీన్ సర్టిఫికేషన్, పట్టణ నిరుద్యోగుల కోసం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని, ఆదాయపన్నును క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా సరఫరా వ్యవస్థ బలోపేతం, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల తగ్గింపు, ఈవీ విధానాన్ని ప్రకటించడం, గ్రీన్ హైడ్రోజన్‌కు భారత్‌ను కేంద్రం చేయడం, చిన్నారులకు సామాజిక భద్రత ప్రయోజనం, ఈఎస్ఐసీ కింద అసంఘటిత రంగ కార్మికులకు కవరేజీ కల్పించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. -
Pre-Budget 2023: ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్..
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచడానికి ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలని, తద్వారా పన్ను బేస్‌ను విస్తృతం చేసే చర్యలపై బడ్జెట్ దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రితో సోమవారం జరిగిన వర్చువల్ ప్రీ–బడ్జెట్ సమావేశంలో కోరాయి. ఈ సమావేశంలో తమ ప్రతినిధులు చేసిన సూచనలపై పారిశ్రామిక వేదికలు చేసిన ప్రకటనల ముఖ్యాంశాలు.. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం: సీఐఐ ‘అంతర్జాతీయ పరిణామాలు కొంతకాలం పాటు అననుకూలంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ డిమాండ్, అన్ని రంగాల పురోగతి, వృద్ధి పెంపునకు చర్యలు అవసరం. ఉపాధి కల్పనను ప్రోత్సహించడం ద్వారా మన దేశీయ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దూకుడుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా చూడ్డానికి పెట్టుబడులకు దారితీసే వృద్ధి వ్యూహంపై దృష్టి పెట్టాలి. మూలధన వ్యయాల కేటాయింపుల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధి కల్పనను పెంచేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాపారాలకు సంబంధించి పన్ను ఖచ్చితత్వం అవసరం. ఇందుకుగాను కార్పొరేట్ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలి. పన్నుల విషయంలో మరింత సరళీకరణ, హేతుబద్ధీకరణ, చెల్లింపులో సౌలభ్యత, వ్యాజ్యాల తగ్గింపు ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండాలి’ అని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. పంచముఖ వ్యూహం: పీహెచ్‌డీసీసీఐ ‘కేంద్ర బడ్జెట్ (2023–24) భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వంటి కీలకమైన తరుణంలో రూపొందుతోంది. ఈ తరుణంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి పథాన్ని కొనసాగించడానికి, దేశీయ వృద్ధి వనరులను పెంపొందించడానికి కీలక చర్యలు అవసరం. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులను పునరుద్ధరించడానికి పంచముఖ వ్యూహాన్ని అవలంభించాలి. వినియోగాన్ని పెంచడం, కర్మాగారాల్లో సామర్థ్య వినియోగాన్ని పెంచడం, ఉద్యోగాల అవకాశాల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడం, భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటి చర్యలు ఇందులో కీలకమైనవి’అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా సూచించారు.æ శుక్రవారం రాష్ట్రాల ఆర్థికమంత్రులతో భేటీ కాగా, ఆర్థికమంత్రి సీతారామన్ వచ్చే శుక్రవారం (25వ తేదీ) రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. -
భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు, ఎంతంటే?
న్యూఢిల్లీ: ఎకానమీ పురోగతికి అద్దం పడుతూ, ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారీ వృద్ధి నమోదయ్యింది. ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం, ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సెప్టెంబర్ 8వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్ధూలంగా 35 శాతం పురోగతి నమోదయ్యింది. విలువలో రూ.6.48 లక్షల కోట్ల పరోక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ఇక రిఫండ్స్ విషయానికి వస్తే, సమీక్షా కాలంలో ఈ పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. వెరసి నికర వసూళ్లు 30.17 శాతం వృ ద్ధితో రూ.5.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే రిఫండ్స్ 65.29 శాతం అధికం. సమీక్షా కాలంలో విభాగాల వారీగా చూస్తే, కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లలో స్థూలంగా 25.95 శాతం వృద్ధి నమోదయితే, వ్యక్తిగత పన్ను స్థూల వసూళ్లలో (ఎస్టీటీ సహా) 44.37 శాతం వృద్ధి చోటుచేసుకుంది. రిఫండ్స్ సర్దుబాటు చేస్తే ఈ వృద్ధి రేట్లు వరుసగా 32.73 శాతం, 28.32 శాతాలుగా ఉన్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ అంచనా వేస్తోంది. -
ఇళ్లకు డిమాండ్ కల్పించండి
కేంద్ర బడ్జెట్ 2021–22లో ఇళ్లకు డిమాండ్ సృష్టించే చర్యలకు చోటివ్వాలని రియల్ ఎస్టేట్ రంగం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. వ్యక్తిగత ఆదాయపన్ను ఉపశమనానికి తోడు, ఇళ్ల కొనుగోలుపై పన్ను రాయితీలను ఫిబ్రవరి 1న బడ్జెట్లో భాగంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. అదే విధంగా వడ్డీ రాయితీని కొనసాగించాలని, జీఎస్టీని ఎత్తివేయాలని, రియల్ ఎస్టేట్ పరిశ్రమకు మౌలికరంగ హోదా కల్పించాలని, ఈ రంగానికి నిధుల లభ్యతను సులభతరం చేయాలంటూ క్రెడాయ్ బెంగాల్ శాఖా పలు డిమాండ్లు వినిపించింది. వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వినియోగించే సిమెంట్ తదితర ముడి సరుకుల కోసం చెల్లించిన జీఎస్టీని అద్దె ఆదాయంలో సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాలని కోరింది. దీనివల్ల ద్వంద్వ పన్నులను నిరోధించడంతోపాటు.. దేశంలో ఆఫీస్ స్థలాలకు డిమాండ్‌ను పెంచినట్టు అవుతుందంటూ పారిశ్రామిక మండలి సీఐఐ సైతం కేంద్రానికి సూచించింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రియల్ ఎసేŠట్ట్కు తిరస్కరించడం వల్ల డెవలపర్ల నిధులు బ్లాక్ (నిలిచిపోతాయని) అవుతాయని పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల ప్రాజెక్టుల పూర్తికి గాను రూ.25,000 కోట్ల నిధుల సాయాన్ని (స్ట్రెస్డ్ ఫండ్) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆఫర్ చేసిన విషయం గమనార్హం. అలాగే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 43(సీఏ) కింద రిజిస్ట్రేషన్, ఒప్పంద విలువ (సర్కిల్)ల మధ్య అంతరాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. 2021 జూన్ 30 వరకు ఇవి అమలు కానున్నాయి. మద్దతుగా నిలవాలి.. ‘‘మానవ చరిత్రలోనే 2020 ఎంతో అసాధారణమైనది. సాధారణ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ పరిశ్రమ తీవ్ర నిధుల సమస్యను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వాటాను అందిస్తున్న రియల్ ఎస్టేట్‌కు రంగాన్ని మరింత పెంచి పోషించాల్సి ఉంది. దాంతో వచ్చే పదేళ్లలో ఈ రంగం పెద్ద ఎత్తున దూసుకుపోతుంది’’ అంటూ క్రెడాయ్ పశ్చిమబెంగాల్ శాఖ ప్రెసిడెంట్ సుశీల్ మెహతా పేర్కొన్నారు. చౌక గృహ రుణంపై చెల్లిస్తున్న వడ్డీలో వార్షికంగా రూ. 2 లక్షల వరకు పన్ను రాయితీ ఉండగా, దీన్ని రూ. 5 లక్షలకు పెంచాలి. ఇంటి రుణంలో అసలుకు చెల్లించే మొత్తాలను సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5లక్షల వరకు చూపించుకునేందుకు అనుమతిస్తుండగా.. ఇలా సెక్షన్ 80సీ కింద కాకుండా ప్రత్యేకంగా రూ. 1.5లక్షలపై పన్ను ఆదాకు అవకాశమివ్వాలి. వాహనాల విలువ క్షీణతపై ప్రయోజనాలు కావాలి ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ వాహనాల వినియోగంతో తరిగిపోయే విలువపై పన్ను ప్రయోజనాలు కల్పించాలంటూ ఆటోమొబైల్ పరిశ్రమ కేందాన్ని కోరింది. మరో వారంలో కేంద్ర ఆర్థిక బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ పలు డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు వాహనాల తరిగే విలువను క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. అలాగే, కార్పొరేట్లకు తరుగుదల కాలాన్ని పొడిగించాలని డిమాండ్ చేసింది. వాహన డీలర్లు వార్షికంగా 0.1 శాతం టీసీఎస్ (మూలం వద్దే పన్ను వసూలు)ను పక్కన పెట్టడం అన్నది ఆర్థికంగా వాహన రిటైల్ పరిశ్రమపై ఎంతో భారాన్ని మోపుతుందంటూ, దీన్ని తొలగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) కోరింది. ఖరీదైన కార్లవైపూ చూడాలి.. మరోవైపు.. ఖరీదైన కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, ఆడి, లంబోర్గిని బడ్జెట్లో లగ్జరీ వాహనాలపై పన్నుల భారాన్ని తగ్గించాలని కోరాయి. అధిక పన్నుల కారణంగా ఖరీదైన కార్ల విభాగం వృద్ధి చెందలేకపోతున్నట్టు పేర్కొన్నాయి. ఒకవేళ ఖరీదైన లగ్జరీ శ్రేణి కార్లపై పన్నులను తగ్గించడానికి బదులు పెంచే చర్యలకు వెళితే డిమాండ్‌ను దెబ్బతీయడమే కాకుండా, గతేడాది కరోనా కారణంగా ఏర్పడిన సమస్యల నుంచి కోలుకోకుండా చేసినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 9 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల్లో 9 శాతం వృద్ధిచెంది రూ. 3.27 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు భారీగా పెరగడంతో ఈ వృద్ధి సాధ్యపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబర్ మధ్యకాలంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యంలో 38 శాతం మేరకు జరిగినట్లు సీబీడీటీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కార్పొరేట్ పన్ను వసూళ్లు 9.54 శాతం పెరగ్గా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 16.85 శాతం వృద్ధిచెందాయి. అయితే రిఫండ్స్ సర్దుబాటు చేసిన తర్వాత కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ధి 2.56 శాతంగా వుంది. ఈ రెండు విభాగాల్లోనూ ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 86,491 కోట్ల రిఫండ్స్ జరిగాయి. అడ్వాన్సు పన్ను వసూళ్లు రూ. 1.58 లక్షల కోట్లు... సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల కాలంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 12.12 శాతం వృద్ధిచెంది రూ. 1.58 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ అడ్వాన్సు టాక్సుల్లో వృద్ధి 8.14 శాతంకాగా, వ్యక్తిగత అడ్వాన్సు పన్ను వసూళ్లలో వృద్ధి 44.5 శాతం వుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.64 శాతం వృద్ధితో రూ. 8.47 లక్షల కోట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పరోక్ష పన్నుల వసూళ్లు 26 శాతం అప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో పరోక్ష పన్నుల వసూళ్లు 25.9 శాతం వృద్ధితో రూ. 4.08 లక్షల కోట్లకు పెరిగాయి. ఎక్సయిజు వసూళ్లు 46 శాతం పెరగడంతో మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్ల వృద్ధి సాధ్యపడింది. 2016-17 బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఈ వసూళ్లు 52.5 శాతం మేర జరిగాయి. కేంద్ర ఎక్సయిజు వసూళ్లు రూ. 1.83 లక్షల కోట్లకు పెరిగాయి. నికర ఎక్సయిజు వసూళ్లు రూ. 1.16 లక్షల కోట్లుకాగా, నికర కస్టమ్స్ వసూళ్లు రూ. 1.08 కోట్లుగా నమోదయ్యాయి. -
పొదుపు మొత్తాలపై ఐటీ పరిమితి రెట్టింపు?
రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచే చాన్స్ న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సర్కారు వేతనజీవులకు భారీగానే ఊరటకల్పించనుందా? అవుననే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల్లో అఖండ విజయంతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. మధ్యతరగతి ముఖ్యంగా ఉద్యోగులకు తొలి బడ్జెట్లో కొన్ని తాయిలాలు ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కీలకమైనది వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపు పరిమితి పెంపు. పొదుపు, మదుపులను ప్రోత్సహించేవిధంగా వివిధ ఆర్థిక సాధనాల్లో చేసే పెట్టుబడులపై ఇస్తున్న మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ, 80సీసీ, 80సీసీసీల కింద బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్ పథకాలు, బీమా పత్రాలు, మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) తదితర సాధనాల్లో రూ. లక్ష వరకూ చేసే పెట్టుబడులు, పొదుపులకు పన్ను ఆదాయం నుంచి మినహాయింపు లభిస్తోంది. అలాగే పిల్లల ట్యూషన్ ఫీజులపై మినహాయింపు కూడా ఈ పరిమితిలోనే వుంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఎగబాకుతున్న వ్యయాల నేపథ్యంలో ఈ మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షలకు పెంచాలనేది తాజా ప్రతిపాదన. జూలై 10న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. డీటీసీలో ప్రతిపాదన రూ.1.5 లక్షలు... ఐటీ చట్టం స్థానంలో త్వరలో అమల్లోకి రానున్న ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ)లో కూడా పెట్టుబడులపై ఐటీ మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. బ్యాంకింగ్, బీమా పరిశ్రమ వర్గాలు కూడా ఈ పరిమితిని రెట్టింపు స్థాయిలో రూ. 2 లక్షలు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. 2008లో దేశంలో పొదుపు రేటు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 38 శాతం ఉండగా.. ఇది 2012-13లో ఏకంగా 30 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పొదుపును మరింత ప్రొత్సహించాలంటే పన్ను ప్రోత్సాహకాలు తప్పనిసరి అని ఆర్థికరంగ విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రూ. 2 లక్షల వరకూ ఆదాయంపై ఐటీ మినహాయింపు ఉండగా.. దీన్ని బడ్జెట్లో రూ.3-5 లక్షల స్థాయికి పెంచొచ్చనే ఊహాగానాలు ఇప్పటికే చక్కర్లుకొడుతున్న సంగతి తెలిసిందే. డీటీసీలో ఈ మినహాయింపు పరిమితిని 3 లక్షలకు పెంచాలని ఇప్పటికే ప్రతిపాదించారు కూడా. ఇతర ముఖ్య విజ్ఞప్తులు ఇవీ... బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై లభించే వడ్డీపై ఐటీ మినహాయిపు పరిమితిని ఇప్పుడున్న రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలి. రూ. 10 వేల పరిమితి దశాబ్దకాలం క్రితం నిర్ణయించారు. సీనియర్ సిటిజన్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎక్కువగా ఈ వడ్డీలపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో వారికి ప్రయోజనం కల్పించాలంటే పెంపు తప్పనిసరి అని విజ్ఞప్తి చేస్తున్నారు. గృహ రుణాల వాయిదా చెల్లింపుల్లో ప్రస్తుతం రూ.1.5 లక్షల వరకూ వడ్డీని(వార్షికంగా) ఐటీ మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. దీనివల్ల ఇళ్ల కొనుగోలుదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ప్రస్తుతం సెక్షన్ 80డీ కింద రూ.15,000 వరకూ ఆరోగ్యబీమా పాలసీలకు పన్ను ఆదాయం నుంచి మినహాయింపు అమల్లో ఉంది. ఈ పరిమితిని రూ.50 వేలకు పెంచాలనేది ప్రధాన డిమాండ్.