ప్రత్యక్ష పన్ను వసూళ్లు 9 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల్లో 9 శాతం వృద్ధిచెంది రూ. 3.27 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు భారీగా పెరగడంతో ఈ వృద్ధి సాధ్యపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబర్ మధ్యకాలంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యంలో 38 శాతం మేరకు జరిగినట్లు సీబీడీటీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కార్పొరేట్ పన్ను వసూళ్లు 9.54 శాతం పెరగ్గా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 16.85 శాతం వృద్ధిచెందాయి. అయితే రిఫండ్స్ సర్దుబాటు చేసిన తర్వాత కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ధి 2.56 శాతంగా వుంది. ఈ రెండు విభాగాల్లోనూ ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 86,491 కోట్ల రిఫండ్స్ జరిగాయి.
అడ్వాన్సు పన్ను వసూళ్లు రూ. 1.58 లక్షల కోట్లు...
సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల కాలంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 12.12 శాతం వృద్ధిచెంది రూ. 1.58 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ అడ్వాన్సు టాక్సుల్లో వృద్ధి 8.14 శాతంకాగా, వ్యక్తిగత అడ్వాన్సు పన్ను వసూళ్లలో వృద్ధి 44.5 శాతం వుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.64 శాతం వృద్ధితో రూ. 8.47 లక్షల కోట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
పరోక్ష పన్నుల వసూళ్లు 26 శాతం అప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో పరోక్ష పన్నుల వసూళ్లు 25.9 శాతం వృద్ధితో రూ. 4.08 లక్షల కోట్లకు పెరిగాయి. ఎక్సయిజు వసూళ్లు 46 శాతం పెరగడంతో మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్ల వృద్ధి సాధ్యపడింది. 2016-17 బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఈ వసూళ్లు 52.5 శాతం మేర జరిగాయి. కేంద్ర ఎక్సయిజు వసూళ్లు రూ. 1.83 లక్షల కోట్లకు పెరిగాయి. నికర ఎక్సయిజు వసూళ్లు రూ. 1.16 లక్షల కోట్లుకాగా, నికర కస్టమ్స్ వసూళ్లు రూ. 1.08 కోట్లుగా నమోదయ్యాయి.