పొదుపు మొత్తాలపై ఐటీ పరిమితి రెట్టింపు? | Centre may hike Income Tax exemption limit from Rs.2 lakh to Rs.5 lakh | Sakshi
Sakshi News home page

పొదుపు మొత్తాలపై ఐటీ పరిమితి రెట్టింపు?

Published Tue, Jul 1 2014 1:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

పొదుపు మొత్తాలపై  ఐటీ పరిమితి రెట్టింపు? - Sakshi

పొదుపు మొత్తాలపై ఐటీ పరిమితి రెట్టింపు?

రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచే చాన్స్
 
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సర్కారు వేతనజీవులకు భారీగానే ఊరటకల్పించనుందా? అవుననే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల్లో అఖండ విజయంతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. మధ్యతరగతి ముఖ్యంగా ఉద్యోగులకు తొలి బడ్జెట్‌లో కొన్ని తాయిలాలు ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కీలకమైనది వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపు పరిమితి పెంపు. పొదుపు, మదుపులను ప్రోత్సహించేవిధంగా వివిధ ఆర్థిక సాధనాల్లో చేసే పెట్టుబడులపై ఇస్తున్న మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
 
 ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ, 80సీసీ, 80సీసీసీల కింద బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్ పథకాలు, బీమా పత్రాలు, మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) తదితర సాధనాల్లో రూ. లక్ష వరకూ చేసే పెట్టుబడులు, పొదుపులకు పన్ను ఆదాయం నుంచి మినహాయింపు లభిస్తోంది. అలాగే పిల్లల ట్యూషన్ ఫీజులపై మినహాయింపు కూడా ఈ పరిమితిలోనే వుంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఎగబాకుతున్న వ్యయాల నేపథ్యంలో ఈ మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షలకు పెంచాలనేది తాజా ప్రతిపాదన. జూలై 10న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.
 
 డీటీసీలో ప్రతిపాదన రూ.1.5 లక్షలు...

 ఐటీ చట్టం స్థానంలో త్వరలో అమల్లోకి రానున్న ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ)లో కూడా పెట్టుబడులపై ఐటీ మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. బ్యాంకింగ్, బీమా పరిశ్రమ వర్గాలు కూడా ఈ పరిమితిని రెట్టింపు స్థాయిలో రూ. 2 లక్షలు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. 2008లో దేశంలో పొదుపు రేటు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 38 శాతం ఉండగా.. ఇది 2012-13లో ఏకంగా 30 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పొదుపును మరింత ప్రొత్సహించాలంటే పన్ను ప్రోత్సాహకాలు తప్పనిసరి అని ఆర్థికరంగ విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు.  కాగా, ప్రస్తుతం రూ. 2 లక్షల వరకూ ఆదాయంపై ఐటీ మినహాయింపు ఉండగా.. దీన్ని బడ్జెట్‌లో రూ.3-5 లక్షల స్థాయికి పెంచొచ్చనే ఊహాగానాలు ఇప్పటికే చక్కర్లుకొడుతున్న సంగతి తెలిసిందే. డీటీసీలో ఈ మినహాయింపు పరిమితిని 3 లక్షలకు పెంచాలని ఇప్పటికే ప్రతిపాదించారు కూడా.
 
 ఇతర ముఖ్య విజ్ఞప్తులు ఇవీ...
   

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లభించే వడ్డీపై ఐటీ మినహాయిపు పరిమితిని ఇప్పుడున్న రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలి. రూ. 10 వేల పరిమితి దశాబ్దకాలం క్రితం నిర్ణయించారు. సీనియర్ సిటిజన్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎక్కువగా ఈ వడ్డీలపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో వారికి ప్రయోజనం కల్పించాలంటే పెంపు తప్పనిసరి అని విజ్ఞప్తి చేస్తున్నారు.
   
గృహ రుణాల వాయిదా చెల్లింపుల్లో ప్రస్తుతం రూ.1.5 లక్షల వరకూ వడ్డీని(వార్షికంగా) ఐటీ మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. దీనివల్ల ఇళ్ల కొనుగోలుదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.
       
ప్రస్తుతం సెక్షన్ 80డీ కింద రూ.15,000 వరకూ ఆరోగ్యబీమా పాలసీలకు పన్ను ఆదాయం నుంచి మినహాయింపు అమల్లో ఉంది. ఈ పరిమితిని రూ.50 వేలకు పెంచాలనేది ప్రధాన డిమాండ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement