పడిపోతున్న ఆదాయంతో సవాలే.. | RBI's financial stability report flags governments falling revenue | Sakshi
Sakshi News home page

పడిపోతున్న ఆదాయంతో సవాలే..

Published Sat, Dec 28 2019 4:31 AM | Last Updated on Sat, Dec 28 2019 4:31 AM

RBI's financial stability report flags governments falling revenue - Sakshi

ముంబై: పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను, పన్నేతర ఆదాయం లక్ష్యాలకు దూరంగా ఉండడంతోపాటు, ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం బలహీనపడడం సవాలుగా పేర్కొంది. శుక్రవారం ముంబైలో విడుదల చేసిన 25వ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఈ అంశాలను ప్రస్తావించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలు తమ బ్యాలన్స్‌ షీట్ల ప్రక్షాళనకు తీసుకున్న చర్యల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతున్నట్టు తెలిపింది.

నవంబర్‌ నాటికే ద్రవ్యలోటు నిర్ణీత లక్ష్యంలో 107 శాతానికి చేరిపోవడంతో.. జీడీపీలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతుండడం ఆర్‌బీఐ వ్యాఖ్యల్లోనూ కనిపించింది. అలాగే, జీఎస్‌టీ వసూళ్లు కూడా ఆశించిన మేర లేవు. మరోవైపు కార్పొరేట్‌ పన్ను కోత కారణంగా ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోనుంది. ‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఆర్‌బీఐ స్థిరత్వ నివేదిక పేర్కొంది.   

స్థూల ఎన్‌పీఏలు పెరగొచ్చు
స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కారణంగా బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2020 సెప్టెంబర్‌ నాటికి 9.9 శాతానికి పెరగొచ్చని ఈ నివేదిక పేర్కొంది. 2019 సెప్టెంబర్‌ నాటికి ఇవి 9.3 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 9.3 శాతం స్థాయిలోనే స్థిరంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 12.7 శాతం నుంచి 13.2 శాతానికి, ప్రైవేటు బ్యాంకుల్లో ఇది 3.9 శాతం నుంచి 4.2 శాతానికి.. అదే విధంగా దేశంలో పనిచేసే విదేశీ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2.9% నుంచి 3.1 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది.  

ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆస్తుల నాణ్యత ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో స్థూల ఎన్‌పీఏలు 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెరిగాయని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నికర ఎన్‌పీఏలు మాత్రం స్థిరంగా 3.4 శాతం వద్దే ఉన్నాయని తెలిపింది. క్యాపిటల్‌ టు రిస్క్‌ అసెట్స్‌ రేషియో (సీఆర్‌ఏఆర్‌) నిర్దేశిత 20% కంటే తక్కువగా 19.5 శాతం వద్ద ఉంది.

రూ.5 కోట్లు దాటితే చెప్పాలి..
రూ.5 కోట్లు, అంతకుమించి రుణాల సమాచారాన్ని.. భారీ రుణాల కేంద్ర సమాచార కేంద్రానికి (సీఆర్‌ఐఎల్‌సీ) తెలియజేయాలని పెద్దసైజు కోపరేటివ్‌ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులున్న అన్ని అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులను సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

పాలనను మెరుగుపరిచి వృద్ధికి తోడ్పడాలి: దాస్‌
కంపెనీలు, బ్యాంకులు పాలనా ప్రమాణాలను మెరుగుపరుచుకుని, దేశ ఆర్థిక వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు తోడ్పడాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కోరారు. దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5%కి సెప్టెంబర్‌ త్రైమాసికంలో పడిపోయిన విషయం విదితమే. అలాగే, చాలా కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దాస్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. వినియోగం, పెట్టుబడులను పునరుద్ధరించడం అన్నవి ప్రధాన సవాళ్లుగా దాస్‌ పేర్కొన్నారు. బోర్డుల్లో మంచి కార్పొరేట్‌ పరిపాలన అన్నది మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు ముఖ్యమైన అంశమనేది తన అభిప్రాయంగా చెప్పారు. ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక  విడుదల సందర్భంగా దాస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement