దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.
‘భవిష్యత్తులో ఆన్‌లైన్ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఆమేరకు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. అందుకు ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ విధానం ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను ఒక బిలియన్(100 కోట్లు)కు చేర్చాలని భావిస్తున్నాం’ అన్నారు.
ఇదీ చదవండి: క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?
‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల సంఖ్య 483 మిలియన్లకు చేరింది. ఇది సెప్టెంబర్‌లో సుమారు 500 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 2024లో మొత్తం యూపీఐ చెల్లింపుల సంఖ్య 15.04 బిలియన్లు(1500 కోట్లు). ఫలితంగా వీటి విలువ రూ.20.64 లక్షల కోట్లకు చేరింది. ఆన్‌లైన్ చెల్లింపులు పెంచడానికి ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌లతో కూడా యూపీఐను లింక్ చేస్తున్నాం. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, మారిషస్, నేపాల్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది’ అని దాస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment