దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ ద్వారా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు నమోదైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. లావాదేవీల పరిమాణం సెప్టెంబర్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42% పెరిగి 1500 కోట్లకు చేరింది. సగటున రోజువారీ లావాదేవీలు 50 కోట్ల మార్కును చేరాయి.
భారత్‌లోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్‌పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫిజికల్‌గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్‌పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలు
దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది. తాజాగా సెప్టెంబర్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీలు కలుపుకుంటే ఈ పరిమాణం మరింత పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment