ఇప్పుడు 7.2 శాతం.. వచ్చేది 7 శాతం! | Indian economy likely to grow 7percent in 2024-25 | Sakshi
Sakshi News home page

ఇప్పుడు 7.2 శాతం.. వచ్చేది 7 శాతం!

Published Thu, Jan 18 2024 6:28 AM | Last Updated on Thu, Jan 18 2024 6:28 AM

Indian economy likely to grow 7percent in 2024-25 - Sakshi

దావోస్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదుచేసుకోగలదన్న విశ్వాసాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యస్తం చేశారు. ఆర్‌బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న భరోసాను ఇచ్చారు.

గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు  సభ్యుల ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2023–24 జీడీపీ అంచనాలు 7 శాతంకన్నా... వ్యక్తిగతంగా దాస్‌ అంచనా 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) అధికంగా గమనార్హం.  దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సీఐఐ వార్షిక సమావేశంలో ‘అధిక వృద్ధి తీరు–తక్కువ స్థాయిలో ఇబ్బందులు: ది ఇండియా స్టోరీ’ అనే అంశంపై దాస్‌ మాట్లాడుతూ, వృద్ధి స్పీడ్‌ తక్కువగా ఉన్నప్పటికీ,  అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలకు సంబంధించి ద్రవ్యోల్బణం ప్రమాదం ఇటీవల తగ్గుముఖం పట్టిందని అన్నారు. ఇది భవిష్యత్‌ వృద్ధి పటిష్టతకు సంకేతమని పేర్కొన్నారు. సమావేశంలో ఇంకా ఆయన ఏమన్నారంటే...

► ఇటీవలి సంవత్సరాలలో భారత్‌ ప్రభుత్వం చేపట్టిన పటిష్ట నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పెంచాయి.  
► సవాలుతో కూడిన ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ  భారత్‌... పటిష్ట వృద్ధి, స్థిరత్వ బాటన పయనిస్తోంది.
► ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు, మార్కెట్ల సానుకూల వాతావారణం ఉన్నప్పటికీ, భౌగోళిక ఇబ్బందులు, వాతావరణ మార్పులు ఆందోళనకు కారణమవుతున్నాయి.  
► బలమైన దేశీయ డిమాండ్‌తో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.  ఇటీవలి ప్రపంచ అనిశ్చితి పరిణామాల నుంచి భారత్‌ మరింత బలంగా బయటపడింది.
► అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనగలిగిన స్థాయిలో భారత్‌ చెల్లింపుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశానికి తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి.
► 2022 మే నుంచి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతూ వచి్చంది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానం, ద్రవ్య లభ్యత నిర్వహణా పరిస్థితులు ఇందుకు దోహదపడ్డాయి. (2022 మే నుంచి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటు 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.) సరఫరాల వైపు సమస్యలు కూడా తొలిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోంది.
► వచ్చే ఏడాది సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని  భావిస్తున్నా. ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా ఆర్‌బీఐ 4 శాతం లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలదనే విశ్వాసంతో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement