న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్లు (సుమారు రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ మైలురాయిని అందుకోవడంలో ఇది కీలకమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 9 రోజులు మిగిలి ఉండగానే ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 22 వరకు ఎగుమతులు 37 శాతం పెరిగి 400 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
భారతదేశ చరిత్రలో ఎగుమతులు 400 బిలియన్ డాలర్లను చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ‘‘భారత్ 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని మొదటిసారి అధిగమించింది. మన రైతులు, చేనేతకారులు, ఎంఎస్‌ఎంఈలు, తయారీదారులు, ఎగుమతిదారులు అందరినీ ఈ విజయాన్ని సాధించినందుకు అభినందిస్తున్నాను. మన ఆత్మనిర్భర భారత్ ప్రయాణానికి ఇది కీలకం‘‘అంటూ మోదీ ట్వీట్ చేశారు. స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాల సహకారంతో..
ట్విట్టర్‌లోనే ప్రధాని కొన్ని గ్రాఫిక్స్‌ను కూడా పోస్ట్ చేశారు. రాష్ట్రాల భాగస్వామ్యం, జిల్లా అధికారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం, వివిధ ఎగుమతుల మండళ్లు, పరిశ్రమల మండళ్లు, భాస్వాములతో చురుగ్గా సంప్రదింపులు చేయడం వల్లే ఈ మైలురాయిని చేరుకోవడం సాధ్యపడినట్టు గ్రాఫిక్స్‌ను పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రతి నెలా సగటున 33 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధ్యమయ్యాయి.
పెట్రోలియం ఉత్పత్తులు..: ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరగడానికి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ గూడ్స్, తోలు, కాఫీ, ప్లా స్టిక్, రెడీమేడ్ వస్త్రాలు, మాంసం, డెయిరీ, సము ద్ర ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు మద్దతుగా నిలిచాయి. 400 బిలియన్ డాలర్ల ఎగుమతు లు నిజం గా గొప్ప మైలురాయిగా భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. రవాణా పరంగా ఎన్నో సవాళ్లు ఉన్నాకానీ, అదనంగా 100 బిలియన్ డాలర్ల ఎగుమతులు పెంచుకోగలిగినట్టు చెప్పారు. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలకుతోడు, పీఎల్‌ఐ పథకాలు ఎగుమతుల వృద్ధికి సాయపడినట్టు తెలిపారు.
37 శాతం అధికం..
దేశ చరిత్రలో మొదటిసారి ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించాయి. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 37 శాతం పెరిగి 400.8 బిలియన్ డాలర్లుగా మార్చి 21 నాటికి నమోదైనట్టు తెలిపింది. 2020–21లో 292 బిలియన్ డాలర్లు, 2018–19లో 330 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు గణాంకాలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 21 నాటికి దిగుమతులు 589 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 189 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యలోటు ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మరికొన్ని రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు నమోదు కావచ్చని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment