న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి ఆరు నెలలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 24 శాతం వెనకడుగు వేశాయి. వెరసి ఏప్రిల్–సెప్టెంబర్‌లో 20.48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలలో పెట్టుబడులు తగ్గడం ఇందుకు కారణమైనట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది(2022–23) తొలి అర్ధభాగంలో 26.91 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు లభించాయి. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లోనూ ఎఫ్‌డీఐలు దాదాపు 41 శాతం క్షీణించి 9.28 బిలియన్ డాలర్లను తాకాయి.
కాగా.. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్ట్‌లలో పెట్టుబడులు నీరసించగా.. సెప్టెంబర్‌లో మాత్రం పుంజుకుని 4.08 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఇవి 2.97 బిలియన్ డాలర్లు మాత్రమే. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాలివి.
పెట్టుబడుల తీరిలా
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఈక్విటీ, ఆర్జనను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, ఇతర మూలధన పెట్టుబడులు 16 శాతం తగ్గి 32.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో 38.94 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. తాజా సమీక్షా కాలంలో సింగపూర్, మారిషస్, యూఎస్, యూకే, యూఏఈ నుంచి ఈక్విటీ పెట్టుబడులు డీలా పడ్డాయి.
అయితే నెదర్లాండ్స్, జపాన్, జర్మనీ నుంచి పెట్టుబడులు పుంజుకోగా.. నిర్మాణ(మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలు, కన్‌స్ట్రక్షన్ డెవలప్‌మెంట్, మెటలర్జికల్ ఇండస్ట్రీలకు ఎఫ్‌డీఐలు పెరిగాయి. రాష్ట్రాలవారీగా చూస్తే తొలి 6 నెలల్లో మహారాష్ట్రకు అత్యధికంగా 7.95 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. గతేడాది ఇదే కాలంలో లభించిన 8 బిలియన్ డాలర్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కర్ణాటకకు పెట్టుబడులు 5.32 బిలియన్ డాలర్ల నుంచి 2.84 బిలియన్ డాలర్లకు క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment