పెట్రోలియం, క్రూడాయిల్‌ దిగుమతుల భారం | India exports jump by 22. 36 per cent to 33. 81 billion dollers in February | Sakshi
Sakshi News home page

పెట్రోలియం, క్రూడాయిల్‌ దిగుమతుల భారం

Published Thu, Mar 3 2022 12:56 AM | Last Updated on Thu, Mar 3 2022 12:56 AM

India exports jump by 22. 36 per cent to 33. 81 billion dollers in February - Sakshi

న్యూఢిల్లీ: భారత పెట్రోలియం, క్రూడాయిల్‌ దిగుమతుల విలువ ఫిబ్రవరిలో భారీగా 67 శాతం పెరిగింది. విలువలో 15 బిలియన్‌ డాలర్లకు చేరింది. సమీప భవిష్యత్‌లో భారత్‌లో ధరల పెరుగుదలకు సంకేతంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఫిబ్రవరి ఎగుమతులు–దిగుమతుల గణాంకాల్లో ఈ అంశం కీలకాంశంగా ఉంది. గణాంకాల్లో కీలకాంశాలు...

► ఫిబ్రవరిలో మొత్తం ఎగుమతుల విలువ 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక దిగుమతుల విలువ 35 శాతం పెరిగి 55 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు భారీగా 21.19 డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ కేవలం 13.12 బిలియన్‌ డాలర్లు.  

► ఎగుమతుల్లో  ఇంజనీరింగ్‌ (31.34 శాతం పెరిగి 9.27 బిలియన్‌ డాలర్లు), పెట్రోలియం (66.29 శాతం పెరిగి 4.1 బిలియన్‌ డాలర్లు), రసాయన రంగాలు (25 శాతం పెరిగి 2.4 బిలియన్‌ డాలర్లు) మంచి పనితీరును ప్రదర్శించాయి. కాగా, ఫార్మా ఎగుమతులు 3.13 శాతం క్షీణించి 1.9 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.  

► ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ దిగుమతులు 29 శాతం పెరిగి 6.24 బిలియన్‌ డాలర్లకు చేరింది.  


400 బిలియన్‌ డాలర్ల లక్ష్యం సాకారం!
ఇక భారత్‌ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 45.80 శాతం అధికం. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 176.07 బిలియన్‌ డాలర్లుగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, భారత్‌ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement