సంస్కరణల జోష్
- మార్కెట్ల సరికొత్త రికార్డు25,500ను దాటిన సెన్సెక్స్ 184 పాయింట్ల లాభం
- 7,655 వద్ద నిలిచిన నిఫ్టీ
- 71 పాయింట్లు ప్లస్ రియల్టీ ఇండెక్స్
- 6% హైజంప్ క్యాపిటల్ గూడ్స్, పవర్ 2% అప్
కొత్త ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన సంస్కరణల ఎజెండా మార్కెట్లకు జోష్‌నిచ్చింది. దీంతో మరోసారి స్టాక్ బుల్ కదం తొక్కింది. సెన్సెక్స్ 184 పాయింట్లు పుంజుకుని తొలిసారి 25,500 పాయింట్లను అధిగమించింది. 25,580 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 71 పాయింట్లు బలపడి 7,655 వద్ద స్థిరపడింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా, ఇంట్రాడేలోనూ కొత్త రికార్డులు నమోదుకావడం విశేషం! నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించిన సంస్కరణల అజెండా ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.
పార్లమెంట్ ఉభయసభలను ఉద్ధేశించి రాష్ర్టపతి ప్రణబ్ చేసిన ప్రసంగంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, ఉద్యోగ కల్పన, వృద్ధికి ఊపునివ్వడం, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, వివాదరహిత పన్ను విధానాల అమలు వంటి ఆర్థిక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. వీటితోపాటు బొగ్గు, విద్యుత్, రైల్వేలు తదితర రంగాలకు ఊపునిచ్చే విధంగా ప్రకటించిన అజెండా అన్ని రంగాల షేర్లకూ డిమాండ్ పెంచింది. ప్రధానంగా 2022కల్లా అందరికీ ఇళ్లు కల్పించడం, 100 పట్టణాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలు రియల్టీ రంగానికి ఊపునిచ్చాయి. దీంతో రియల్టీ ఇండెక్స్ 5%పైగా దూసుకెళ్లింది.దీనితోపాటు క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, మెటల్, ఆటో రంగాలు సైతం 2.5-2% మధ్య లాభపడ్డాయి.
దీంతో ఒక దశలో సెన్సెక్స్ గరిష్టంగా 25,645కు చేరగా, నిఫ్టీ కూడా 7,674ను తాకింది. విదేశీ మార్కెట్లు లాభపడటం కూడా సెంటిమెంట్‌కు జతకలిసినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలోనూ సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
విదేశీ అంశాలూ ఉన్నాయ్: అమెరికా ఉద్యోగ గణాంకాలకుతోడు, చైనా వాణిజ్య గణాంకాలు మెరుగుపడటం, జపాన్ ఆర్థిక వృద్ధిపై అంచనాలు పెరగడం, యూరోజోన్ ఆర్థిక వ్యవస్థకు సహాయక ప్యాకేజీల అమలుపై ఈసీబీ సానుకూలంగా స్పందించడం వంటి విదేశీ అంశాలు కూడా దేశీయంగా సెంటిమెం ట్‌ను మెరుగుపరచిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు
గడిచిన శుక్రవారం రూ. 1,283 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) తాజాగా మరో రూ. 537 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 490 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.
బ్లూచిప్స్ పరుగు
కోల్ ఇండియా, బజాజ్ ఆటో 5.5% చొప్పున జంప్‌చేయగా, ఎల్‌అండ్‌టీ, టాటా పవర్, గెయిల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతీ, హీరోమోటో, టీసీఎస్ 3.8-1.5% మధ్య లాభపడ్డాయి.
ఆరు షేర్లు వెనకడుగు
సెన్సెక్స్ దిగ్గజాలలో ఆరు షేర్లు మాత్రమే వెనుకంజ వేయగా, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్ 2.3-1% మధ్య నష్టపోయాయి.
యూనిటెక్ హవా: రియల్టీ షేర్లలో యూనిటెక్ 17%, డీబీ 15% చొప్పున దూసుకెళ్లగా, శోభా, ప్రెస్టేజ్, ఒబెరాయ్, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, డీఎల్‌ఎఫ్, ఒమాక్స్ 10-3.5% మధ్య పుంజుకున్నాయి.
సిమెంట్ షేర్లకు డిమాండ్
కొత్త ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టనుండటంతో సిమెంట్ షేర్లకు డిమాండ్ పుట్టింది. గ్రాసిం ఇండస్ట్రీస్ దాదాపు 12% జంప్‌చేయగా అంబుజా, ఏసీసీ, అల్ట్రాటెక్ 3.4-4.8% మధ్య పురోగమించాయి.
చిన్న షేర్ల దూకుడు
బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5-2% మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 2,307 లాభపడితే, కేవలం 778 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో మోతీలాల్ ఓస్వాల్, గ్రాఫైట్, పుర్వంకార, ఇండియా సిమెంట్స్, స్టెరిలైట్, థామస్‌కుక్, హెచ్‌సీసీ, ఐవీఆర్‌సీఎల్, ఉషా మార్టిన్ 15-9% మధ్య దూసుకెళ్లాయి.
లక్ష కోట్లు ప్లస్
మార్కెట్ల పురోభివృద్ధి కారణంగా మొత్తం లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ(క్యాప్) ఒక్క రోజులో దాదాపు రూ. 1.05 లక్షల కోట్లు ఎగసింది. మొత్తం మార్కెట్ విలువ రూ. 90.36 లక్షల కోట్లను తాకింది.
వెలుగులో రైల్వే షేర్లు
ఇక రైల్వే షేర్లు టెక్స్‌మాకో, బీఈఎంఎల్, టిటాగఢ్, కెర్నెక్స్ మైక్రో, స్టోన్ ఇండియా 10-5% మధ్య పుంజుకున్నాయి.