సరికొత్త గరిష్టం వద్ద ముగింపు
58 పాయింట్లు అప్
23,323కు చేరిక
సెన్సెక్స్150 పాయింట్లు ప్లస్
తొలుత 594 పాయింట్ల దూకుడు
బీఎస్‌ఈ మార్కెట్ విలువ రికార్డ్
మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 58 పాయింట్లు బలపడి 23,323 వద్ద నిలిచింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇంట్రాడేలోనూ 177 పాయింట్లు పురోగమించి 23,442 వద్ద సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తొలి సెషన్‌లో సెన్సెక్స్ 594 పాయింట్లు జంప్ చేసింది. ఇంట్రాడే రికార్డ్ 77,079కు చేరువగా 77,050ను అధిగమించింది. చివరికి 150 పాయింట్లు జమ చేసుకుని 76,607 వద్ద ముగిసింది.
ముంబై: ఎంపిక చేసిన బ్లూచిప్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. రోజంతా ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో లాభాలమధ్యే కదిలాయి. ఫలితంగా బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. రూ. 429.32 లక్షల కోట్లను(5.14 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. కాగా.. ఎన్‌ఎస్‌ఈలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, హెల్త్‌కేర్ రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి.
చిన్న షేర్లు జూమ్
బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతానికిపైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,518 లాభపడితే.. 1,376 మాత్రమే డీలాపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 427 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 234 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి.
ఫెడ్‌పై దృష్టి
దేశీయంగా జీడీపీ పురోగతిపై ఆర్‌బీఐ ఆశావహ అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురానున్న తుది బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు బలహీనపడినట్లు తెలియజేశారు. విదేశీ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 83 డాలర్లకు చేరగా, డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా 3 పైసలు బలపడి 83.56(ప్రొవిజినల్) వద్ద ముగిసింది.
ఇక్సిగో ఐపీవో బంపర్ సక్సెస్
ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో మాతృ సంస్థలే ట్రావెన్యూస్ టెక్నాలజీ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్‌ను సాధించింది. షేరుకి రూ. 88–93 ధరలో బుధవారం ముగిసిన ఇష్యూ 98 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 740 కోట్లు సమీకరించింది.
డీ డెవలప్‌మెంట్ @ రూ. 193–203
పైపింగ్ సొల్యూషన్స్ కంపెనీ డీ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 193–203 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 418 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవాలన్నది సంస్థ ప్రణాళిక.
Comments
Please login to add a commentAdd a comment