సెన్సెక్స్.... పోర్ట్ వాల్
కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో జోరుమీదున్న ఆపరేటర్లు మరోసారి విజృంభించారు. దీంతో స్టాక్ బుల్ మళ్లీ కాలు దువ్వింది. ఫలితం.... వరుసగా రెండో రోజూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. సెన్సెక్స్ 557 పాయింట్లు దూసుకెళ్లి తొలిసారి 23,551వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 155 పాయింట్ల హైజంప్‌తో అతి సులువుగా 7,000 పాయింట్లను అధిగమించింది. ఈ బాటలో బ్యాంక్ నిఫ్టీ కూడా 14,090 పాయింట్ల సరికొత్త రికార్డును చేరుకోవడం విశేషం!
ఎగ్జిట్ పోల్స్ రాకముందే వరుసగా రెండో రోజూ బుల్ ఆపరేటర్లు పట్టు బిగించారు. ప్రధానంగా బ్లూచిప్స్‌పై దృష్టిపెట్టడం ద్వారా మరోసారి మార్కెట్లను పరుగెత్తించారు. శుక్రవారం 650 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో 557 పాయింట్లు పుంజుకోవడం ద్వారా రెండు రోజుల్లో 1,200 పాయింట్లకుపైగా లాభపడింది. 2011 ఆగస్ట్ తరువాత ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి! ఇక సెన్సెక్స్ ఇంట్రాడేలో 23,573కు చేరగా, నిఫ్టీ 7,020 పాయింట్లను అధిగమించడం విశేషం! వెరసి... కొత్త చరిత్ర సృష్టిస్తూ నిఫ్టీ 7,014 వద్ద ముగిసింది. కాగా, మార్కెట్లు ముగిశాక సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్‌డీఏకు 290 సీట్ల వరకూ వచ్చే అవకాశమున్నట్లు వెల్లడికావడం గమనార్హం!! సుస్థిర ప్రభుత్వ ఆశలతోపాటు, విదేశీ మార్కెట్ల లాభాలు, డాలరుతో మారకంలో రూపాయి 60 దిగువకు బలపడటం వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలిపారు.
బీఎస్‌ఈలో ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాలూ లాభపడటం విశేషం! ప్రధానంగా ఆయిల్, పవర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, మెటల్స్ 3-2.5% మధ్య బలపడ్డాయి.
శుక్రవారం రూ. 1,269 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 1,218 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
బ్లూచిప్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హీరోమోటో, ఐటీసీ, సెసాస్టెరిలైట్, ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్, ఓఎన్‌జీసీ, భారతీ, భెల్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ 5-2% మధ్య పురోగమించాయి.
ఆటో దిగ్గజాలు టాటా మోటార్స్(4%), మారుతీ(4%), ఎంఅండ్‌ఎం(2%), టీవీఎస్ మోటార్(9%) కొత్త గరిష్టాలను తాకగా, అశోక్ లేలాండ్(6%) ఏడాది గరిష్టానికి చేరింది. ఇతర దిగ్గజాలలో కోల్ ఇండియా(7%), ఎల్‌అండ్‌టీ(3%), జేఎస్‌డ బ్ల్యూ స్టీల్, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీతోపాటు మొత్తం 189 షేర్లు ఏడాది గరిష్టాలను తాకాయి.
సెన్సెక్స్‌లో సన్ ఫార్మా, సిప్లా 1.5% స్థాయిలో నష్టపోయాయి.
సోమవారం విద్యుత్ రంగ షేర్లు వెలుగులో నిలిచాయి. టొరంట్ పవర్ 18% దూసుకెళ్లగా, ఏబీబీ, పవర్‌గ్రిడ్, జేపీ, రిలయన్స్ పవర్, సీమెన్స్, పీటీసీ, ఎన్‌టీపీసీ 6-2.5% మధ్య పుంజుకున్నాయి.
మిడ్ క్యాప్స్‌లో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, కేఎస్‌కే ఎనర్జీ, ఐఎల్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్, కేఈసీ, గుజరాత్ పిపావవ్, కల్పతరు పవర్, ఎన్‌సీసీ, పుంజ్‌లాయిడ్, జిందాల్ సా తదితరాలు 13-7% మధ్య జంప్ చేశాయి.
అయితే ట్రేడైన షేర్లలో 1,408 లాభపడగా, 1,440 నష్టపోవడం గమనార్హం.