దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీగా పడుతున్నాయి. ఉదయం 11:25 నిమిషాల సమయం వరకు ఏకంగా సుమారు రూ.7.5 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైనట్లు తెలిసింది. మార్కెట్లు పడిపోతుండడంపై నిపుణులు కొన్ని అంతర్జాతీయ అంశాలు కారణమని విశ్లేషిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
అమెరికా ఎన్నికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు(మంగళవారం 5న) జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.
యూఎస్ ఫెడ్ సమావేశం
మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నాయి. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధ, గురువారాల్లో(6–7వ తేదీన) మానిటరీ పాలసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నాయి. 7న యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీరు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం(2.4 శాతం), అక్టోబర్ ఉపాధి గణాంకాల ఆధారంగా వడ్డీ రేట్లలో సవరణలకు తెరతీయనుంది. గత సమావేశంలో నాలుగేళ్ల తదుపరి ఎఫ్‌వోఎంసీ తొలిసారి 0.5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతంగా అమలవుతున్నాయి.
క్యూ2 ఫలితాలు
ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ వేడెక్కింది. పలు దిగ్గజాలు పనితీరును వెల్లడిస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మార్కెట్లు కింది చూపులు చూస్తున్నాయి. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాల జాబితాలో డాక్టర్ రెడ్డీస్, టైటన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ పీఎంఐ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. దేశ, విదేశీ గణాంకాలను ఈ వారం స్టాక్ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నాయి.
ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?
ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్
దేశీ స్టాక్స్‌లో ఉన్నట్టుండి గత నెలలో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త చరిత్రకు తెరతీశారు. అక్టోబర్‌లో నికరంగా రూ.94,000 కోట్ల(11.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నెలవారీగా దేశీ స్టాక్ మార్కెట్లలో ఇవి అత్యధిక అమ్మకాలుకాగా..కొవిడ్–19 ప్రభావంతో ఇంతక్రితం 2020 మార్చిలో ఎఫ్‌పీఐలు రూ.61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీయంగా ఒక నెలలో ఇవి అత్యధిక విక్రయాలుగా నమోదయ్యాయి. ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌లో రూ.57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇవి గత 9 నెలల్లోనే గరిష్టంకావడం గమనార్హం. అయితే చైనాలో ఆకర్షణీయ ఈక్విటీ విలువలు, ప్రభుత్వ సహాయక ప్యాకేజీలు ఎఫ్‌పీఐలను అమ్మకాలవైపు ఆకర్షిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment