ఎఫ్‌ఐఐల దూకుడు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) అండతో స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 22,214 వద్ద నిలవగా, 40 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 6,642 వద్ద ముగిసింది. ఇవి కొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 22,308, నిఫ్టీ 6,674 పాయింట్లను చేరడం ద్వారా సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి! ఇందుకు ఎఫ్‌ఐఐల పెట్టుబడుల దూకుడు సహకరిస్తోంది. గత మూడు రోజుల్లో రూ. 3,700 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 2,192 కోట్ల విలువైనషేర్లను కొనుగోలు చేశారు.
అయితే దేశీయ ఫండ్స్ రూ. 592 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకు షేర్లకు డిమాండ్ కొనసాగింది. కాగా, జెట్ ఎతిహాద్ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ కొట్టివేయడంతో జెట్ ఎయిర్‌వేస్ 3% ఎగసింది. ఒక దశలో 7% వరకూ దూసుకెళ్లింది. ఈ బాటలో స్పైస్‌జెట్ సైతం 3.5% లాభపడింది. విమానయాన రంగ సంస్థలు వచ్చే మార్చి వరకూ విదేశీ రుణాలను సమీకరించుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించడం ఇందుకు దోహదపడింది.
మొబైళ్ల ద్వారా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్..
క్యాపిటల్ మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లకు మరింత అవగాహన కల్పించేందుకు సెబీ మొబైల్, ఇంటర్నెట్ మాధ్యమాలను వినియోగించుకోనుంది. ఇందుకు పారిశ్రామిక సమాఖ్యలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు తదితరాలతో చేతులు కలపనుంది. తద్వారా ఇన్వెస్టర్లకు క్యాపిటల్ మార్కెట్ల పట్ల మరింత అవగాహన కల్పిం చడం, విజ్ఞానాన్ని పెంచడం వంటి కార్యక్రమాల్లో ఈ సంస్థలను భాగస్వాములను చేయనుంది. దీనిలో భాగంగాగత డిసెంబర్‌లోనే సెబీ ఇన్వెస్టర్ల సమస్యలు-పరిష్కార మార్గాలు పేరిట కార్యక్రమాలు కూడా ప్రారంభించింది.