హీరో ఆరో ప్లాంట్.. దక్షిణాదిన
- స్థలం కోసం అన్వేషణ
- కంపెనీ సీఈవో పవన్ ముంజాల్
సావో పాలో: హీరో మోటోకార్ప్ ఆరో ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దక్షిణ భారతదేశ మార్కెట్ అవసరాలను తీర్చడం లక్ష్యంగా అక్కడ ఆరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. స్థలం కోసం అన్వేషిస్తున్నామని చెప్పిన ఆయన ఎప్పటికల్లా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కంపెనీ మూడు ప్లాంట్లు-ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, హర్యానాలోని గుర్గావ్, దారుహెరల్లో టూవీలర్లను ఉత్పత్తి చేస్తోంది.
వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 69 లక్షలు. నాలుగో ప్లాంట్‌ను రూ.400 కోట్ల పెట్టుబడులతో రాజస్థాన్‌లోని నీమ్‌రాణాలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌తో కలుపుకుంటే కంపెనీ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 76.5 లక్షలు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నడుస్తోందని, త్వరలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ముంజాల్ పేర్కొన్నారు. ఇక గుజరాత్‌లోని హలోల్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడులతో ఐదో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.
18 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. దక్షిణ భారతంలో ఏర్పాటు చేయనున్న ఆరో ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్లకు పెరుగుతుంది. కాగా దేశీయంగా తమ వాహనాలు మంచి అమ్మకాలు సాధించగలవన్న ధీమాను పవన్ ముంజాల్ వ్యక్తం చేశారు. మరోవైపు తాము క్రీడలకు సంబంధించి టీమ్‌ను కొనుగోలు చేసే యోచనేదీ ప్రస్తుతానికి లేదని, కేవలం స్పాన్సరర్లుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే తనకు వ్యక్తిగతంగా ఫుట్‌బాల్ క్రీడ అంటే ఇష్టమని వివరించారు.