ఉచితంగా రుణ సమాచార నివేదికలు!
ముంబై: వినియోగదారులకు రుణ సమాచార నివేదిక(క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్-సీఐఆర్)లను ఉచితంగా ఇవ్వాలని ఆర్‌బీఐ కమిటీ సూచించింది. ఈ కమిటీకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్ ఆదిత్య పూరి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇలా సీఐఆర్‌లను ఇవ్వడం వల్ల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు కావాలనుకునేవారిలో ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించినట్లవుతుందని ఈ కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
రుణ క్రమశిక్షణకు సంబంధించిన అవగాహన పెంచుకోవడానికి ఈ సీఐఆర్‌లు ఉపయోగపడతాయని, లోటుపాట్లు ఏమైనా ఉంటే వినియోగదారులు సరిదిద్దుకుంటారని, క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకుంటారని పేర్కొంది. ఈ కమిటీ రుణ సమాచారానికి సంబంధించి వివిధ రకాల సూచనలను అందజేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసే వారి వివరాలను సీఐసీలకు నేరుగా అందించాలని ఈ కమిటీ సూచించింది. వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌కు ఒకే విధమైన వర్గీకరణను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు(సీఐసీ) అనుసరించాలని, అప్పుడే దానిని అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం సులభతరమవుతుందని ఈ కమిటీ పేర్కొంది. సిబిల్ విధానాన్నే ఇతర క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు అనుసరించాలని సూచించింది.