Credit Information Bureau
-
వింత నిబంధన ఉపసంహరించుకోవాలి
విద్య, వాహన, గృహ, వ్యక్తిగత రుణ లావాదేవీల్లో, క్రెడిట్ కార్డులకు సంబంధించి వివాదాలున్నా, బకాయిలు చెల్లించకపోయినా బ్యాంకు ఉద్యోగాలకు అనర్హులని బ్యాంకుల కేంద్రీయ రిక్రూట్మెంట్, ప్రమోషన్ విభాగం ప్రకటించడం లక్షలాది మంది నిరుద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది. ఈ కొత్త నిబంధనను తక్షణమే తొలగించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుండగా దేశ వ్యాప్త ఆందోళనకు దిగుతామని విద్యార్థి, యువజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. సుమారు 15 వేల జూనియర్ క్లర్క్‌లు, జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్ పోస్టులకు ఎస్బీఐ కేంద్రీయ రిక్రూట్మెంట్, ప్రమోషన్ విభాగం ఇటీవల నోటిఫికేషన్ (నంబర్ సీఆర్పీడీ/సీఆర్/2016-17/01) ఇచ్చింది. ఇందులో పేర్కొన్న ఓ నిబంధన లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. ‘రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ లేదా ఇతరేతర సంస్థల నివేదిక ప్రకారం చెల్లించనివారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయడానికి అనర్హులు’ అని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులు సాధారణంగా ఏ ఉద్యోగానికైనా ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాల్సి వస్తోంది. దీంతో క్రెడిట్ కార్డు అవసరంగా మారింది. బ్యాంకు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తూ అప్పటికే అప్పటికే చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నవారు క్రెడిట్ కార్డులు పొందుతున్నారు. చెల్లింపులు సజావుగా చేస్తున్నా చాలా సందర్భాలలో క్రెడిట్ కార్డుల వివాదాలు తప్పడం లేదు. విద్యా, వాహన రుణాల సంబంధిత వివాదాలూ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ వంటి సంస్థలు ఉద్యోగాల భర్తీకి పెడుతున్న నిబంధనలు అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నిరర్ధక ఆస్తుల్ని తగ్గించుకునే క్రమంలో బ్యాంకులు అనుసరిస్తున్న వైఖరి సానుకూలంగా అర్థం చేసుకోవాల్సిన వ్యవహారమే. కానీ ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టి దర్జాగా తిరిగేవారినీ, ఏళ్ల తరబడి ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారినీ ఒకే గాటన కట్టేలా విధించిన నిబంధన ఎంతవరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధి హక్కును కాలరాయడమే.. విద్యారుణం తీసుకుని చదివిన వారిని వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారితో సరిపోల్చడం ఏ మాత్రం సమంజసం కాదని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ బిశ్వాస్, అఖిల భారత ఎంప్లాయీస్ యూనియన్ నేత పి.వెంకట్రామయ్య పేర్కొన్నారు. విద్యా రుణం తీసుకుని చదివిన ఎవరైనా తమకు ఉద్యోగం వచ్చిన తర్వాత చెల్లించడం సర్వసాధారణమని, ఈ విషయాన్ని విస్మరించి డిఫాల్డర్ జాబితాలో పేరుందని అసలు ఉద్యోగానికే అనర్హుల్ని చేయడం అన్యాయమే కాకుండా ఉపాధి హక్కును కాలరాయడమేనని స్పష్టం చేశారు. -
విద్యా రుణం తీర్చకపోయినా.. మైనస్ స్కోర్: సిబిల్
కొచ్చి : తీసుకున్న విద్యా రుణం తిరిగి తీర్చకపోయినా... అది సిబిల్ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (సిబిల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్-కన్జూమర్ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్ హర్షాలా చందోర్కర్ స్పష్టం చేశారు. విద్యారుణం తీసుకున్న ఒక వ్యక్తి తన కోర్సును పూర్తిచేసిన నిర్దిష్ట సమయం తర్వాత రుణ బకాయి చెల్లించాల్సి ఉంటుంది. లేదా సంబంధిత వ్యక్తికి హామీ ఉన్న వ్యక్తి అయినా నెలవారీ చెల్లింపులు జరపాలి. పెరుగుతున్న విద్యా రుణ బకాయిలు... ఈ రుణాలకు సంబంధించి సిబిల్ స్కోర్ సమస్య ఉండదని కొందరు భావిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో చందోర్కర్ ఈ విషయం చెప్పారు. రుణ అప్లికేషన్ ప్రక్రియ పూర్తికి బ్యాంకులు సిబిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్‌ను ప్రమాణంగా తీసుకుంటాయి. విద్యా రుణానికి సంబంధించి ముఖ్యాంశాలు చూస్తే.. సిబిల్ డేటా ప్రకారం దేశంలో, విదేశాల్లో విద్యకు సంబంధించి మొత్తం రుణాల విలువ 2015 మార్చి 31 నాటికి రూ.63,800 కోట్ల మూడు, నాలుగు త్రైమాసికాల్లో విద్యా రుణాలకు అత్యధికంగా దరఖాస్తులు దాఖలవుతున్నాయి. 2014 నాల్గవ త్రైమాసికంలో 1,30,000 విద్యా రుణ దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రస్తుతం సగటు రుణం రూ.6 లక్షలకు చేరింది.మొత్తం మంజూరులో రూ.1 లక్ష లోపు రుణాలు 10 శాతంకన్నా తక్కువ ఉండగా... రూ.5 లక్షలు దాటిన రుణాల సంఖ్య 30 శాతంపైనే. -
ఉచితంగా రుణ సమాచార నివేదికలు!
ముంబై: వినియోగదారులకు రుణ సమాచార నివేదిక(క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్-సీఐఆర్)లను ఉచితంగా ఇవ్వాలని ఆర్బీఐ కమిటీ సూచించింది. ఈ కమిటీకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ ఆదిత్య పూరి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇలా సీఐఆర్లను ఇవ్వడం వల్ల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు కావాలనుకునేవారిలో ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించినట్లవుతుందని ఈ కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రుణ క్రమశిక్షణకు సంబంధించిన అవగాహన పెంచుకోవడానికి ఈ సీఐఆర్లు ఉపయోగపడతాయని, లోటుపాట్లు ఏమైనా ఉంటే వినియోగదారులు సరిదిద్దుకుంటారని, క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకుంటారని పేర్కొంది. ఈ కమిటీ రుణ సమాచారానికి సంబంధించి వివిధ రకాల సూచనలను అందజేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసే వారి వివరాలను సీఐసీలకు నేరుగా అందించాలని ఈ కమిటీ సూచించింది. వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌కు ఒకే విధమైన వర్గీకరణను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు(సీఐసీ) అనుసరించాలని, అప్పుడే దానిని అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం సులభతరమవుతుందని ఈ కమిటీ పేర్కొంది. సిబిల్ విధానాన్నే ఇతర క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు అనుసరించాలని సూచించింది.