హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వివిధ దేశాల నుంచి వస్తూత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో దేశీయ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ కుదేలవుతోంది. ఈ రంగంలో ఆధారపడ్డ లక్షలాది మంది భవిష్యత్ ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. భార త సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ నిలబడాలంటే దిగుమతుల కట్టడి ఒక్కటే పరిష్కారమని అసోసియేషన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్(ఏఎస్‌ఎస్‌ఐ) కేంద్రానికి స్పష్టం చేసింది.
వివిధ దేశాలతో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాను ఢిల్లీలో కలిసి విన్నవించినట్టు ఏఎస్‌ఎస్‌ఐ కన్వీనర్ రాజ మహేందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ రాజ్ వ్యవస్థకు స్వస్తి పలకాలని కోరినట్టు చెప్పారు.
పాత కంపెనీలకూ..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కంపెనీలకు ఇవ్వబోయే ప్రయోజనాలను పాత కంపెనీలకూ వర్తింపజేయాలని మంత్రిని కోరామని ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైసెస్ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వానికి చెల్లించిన పెనాల్టీలను తిరిగి కంపెనీలకు చెల్లించాలి. పెట్టుబడి పరిమితి విషయంలో రూ.1 కోటి వరకు సూక్ష్మ స్థాయి కంపెనీగా పరిగణించాలి. రూ.1-10 కోట్ల మధ్య చిన్నతరహా, రూ.10-25 కోట్ల మధ్య పెట్టుబడిని మధ్యతరహా కంపెనీగా పరిగణించాలి. రూ.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలి. పెట్టుబడి సబ్సిడీని ప్రస్తుతమున్న రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలి’ అని మంత్రికి విన్నవించామన్నారు.
రూరల్ క్లస్టర్లు..
ఉపాధిని పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించాలని పారిశ్రామిక సంఘాలకు మంత్రి కల్రాజ్ మిశ్రా పిలుపునిచ్చారు. పరిశ్రమ డిమాండ్లను నెరవేరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో క్లస్టర్ల స్థాపనకు తాము సిద్ధమేనని మంత్రికి చెప్పామని రాజ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆగస్టులో హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే విధాన నిర్ణయాల్లో తమనూ భాగస్వాములను చేయాలని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.సుధీర్‌రెడ్డి మంత్రిని కోరారు. మంత్రిని కలిసినవారిలో ఫ్యాప్సీ, ప్లాస్టిక్, ఫౌండ్రీ అసోసియేషన్లు, అలీప్ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు.
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించండి
Published Sat, Jul 5 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement
Advertisement