పీఎస్‌యూలకు భారీ రుణాలు వద్దు
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లకు భారీ రుణాలు మంజూరు చేయవద్దని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆదేశించింది. స్వల్ప, మధ్యతరహా ఆదాయ వర్గాలకు మేలు చేయడమే ఈ బ్యాంకుల రుణాల ముఖ్యోద్దేశమని ఉద్ఘాటించింది. పీఎస్‌యూలకు పట్టణ సహకార బ్యాంకులు భారీ లోన్లు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయా బ్యాంకులకు బుధవారం పంపిన సమాచారంలో ఆర్‌బీఐ తెలిపింది. స్వల్ప, మధ్యతరహా ఆదాయ వర్గాలు, రైతులు, చిన్నతరహా వ్యాపారుల రుణ అవసరాలు తీర్చడమే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేసింది.
కేంద్ర బ్యాంకులు సంఘటితం కావాలి: రాజన్
ద్రవ్య విధానాల్లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య మరింత సహకారం అవసరమని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. పెద్ద దేశాల విధానాలు వర్ధమాన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని నివారించేందుకు ఆయా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు సంఘటితం కావాల్సి ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ బుధవారం టోక్యోలో ఏర్పాటు చేసిన సదస్సులో రాజన్ ప్రసంగించారు. ద్రవ్య విధానాలపై ఇతర దేశాల స్పందననూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ ద్రవ్య విధానానికి ఎలాంటి పద్ధతీ లేకపోవడం ప్రగతికి, ద్రవ్యరంగానికి ముప్పుగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు.