మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్ రద్దు
ముంబై: ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు డెరైక్టర్‌గా వున్న మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్ అండ్ లీజింగ్‌తో సహా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రిజర్వు బ్యాంకు రద్దుచేసింది. ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల (ఎన్‌బీఎఫ్‌ఐలు) మాదిరిగా కార్యకలాపాలు నిర్వహించడమే ఇందుకు కారణమని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసిన మూడు కంపెనీల్లో మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్ అండ్ లీజింగ్, విష్ణు ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు హైదరాబాద్‌కు చెందినవి. మరొకటి - సిబార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడకు చెందినది. రిజిస్ట్రేషన్ రద్దు ఫలితంగా ఈ కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ కార్యకలాపాలను నిర్వర్తించజాలవని ఆర్‌బీఐ పేర్కొంది.
ఎన్‌బీఎఫ్‌సీ అంటే: రుణాలివ్వడం, షేర్లు, బాండ్లు, డిబెంచర్లు సెక్యూరిటీల వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం, లీజింగ్, హైర్‌పర్చేజ్, బీమా, చిట్ వ్యాపారాలు ఎన్‌బీఎఫ్‌సీల ప్రధాన కార్యకలాపాలు. ఎలాంటి స్కీములు, ఒప్పందాల ద్వారా అయినా భారీ మొత్తాన్ని లేదా వాయిదాల్లో నగదును తీసుకోవచ్చు.
ఎన్‌బీఎఫ్‌ఐ అంటే...
వివిధ ఆర్థిక అవసరాలకు నిధులు సమకూర్చే సంస్థల బృందాన్ని ఎన్‌బీఎఫ్‌ఐగా వ్యవహరిస్తారు. ఈ బృందాల్లో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైమరీ డీలర్లు (బ్యాంకులు) ఉండవచ్చు.