ఆస్తులు అమ్ముకుంటాం.. పెరోల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆస్తుల విక్రయానికి వీలు కల్పిస్తూ తనకు కనీసం 40 రోజుల పెరోల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టును గురువారం కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మదుపుదారుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు డబ్బు వసూలు చేసిన కేసులో గత 4 నెలలుగా ఆయన తీహార్ జైలులో కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు కట్టాలని కోర్టు షరతు విధించింది. ఈ నిధుల సమీకరణకు వీలు కల్పించాలని ఇప్పటికే సహారా చీఫ్ పలు ప్రతిపాదనలతో కోర్టు ముందుకు వచ్చారు. వీటిని సుప్రీం తోసిపుచ్చింది. ప్రస్తుత పెరోల్ విజ్ఞప్తి ఈ దిశలో తాజాది. న్యూయార్క్, లండన్‌లలో లగ్జరీ హోటళ్లను విక్రయిస్తామని సహారా పేర్కొంది. అయితే విదేశాల్లో ఉన్న ఆస్తుల విక్రయానికన్నా ముందు దేశీయంగా ఉన్న ఆస్తులను మొదట ఎందుకు విక్రయించకూడదని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సహారా న్యాయవాది రాజీవ్ ధావన్‌ను ప్రశ్నించారు.
దీనికి ధావన్ సమాధానం ఇస్తూ, తద్వారా రూ.5,000 కోట్ల సమీకరణ కష్టమని వివరించారు. ఈ పరిస్థితుల్లో న్యూయార్క్‌లోని డ్రీమ్ డౌన్‌టౌన్, ప్లాజా హోటళ్లను, అలాగే లండన్‌లోని గ్రాస్‌వీనర్ హౌస్‌ను తొలుత విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనితో... ఒకవేళ విదేశాల్లోని ఆస్తుల విక్రయింపు ప్రక్రియ పర్యవేక్షణ ఎలా అన్న విషయంలో సలహాలను ఇవ్వాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీని బెంచ్‌కు సూచించింది. కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఐటీ షాక్...
మరోవైపు గ్రూప్ చెల్లించాల్సిన పన్నుల విషయంలో ఆదాయపు పన్నుల (ఐటీ) శాఖ కూడా రంగంలోకి దిగింది. పన్నుగా సంస్థ రూ.7,000 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. విచారణలో భాగంగా తమ వాదనలూ వినాలని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆదాయపు పన్నుకు సంబంధించి ఐటీ చేసిన వాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దీనిని కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేస్తుందని తెలిపారు.