హింసకు అణచివేతే సమాధానమా?
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్నవారితో ఎలాంటి చర్చలూ చేపట్టని ఉత్తరప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు వారిని బలప్రయోగంతో చెదరగొట్టాయి. కాల్పులు జరిపాయి. విధ్వంసం చేసినవారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. వాస్తవానికి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు.. విభజించి పాలించు అనే సూత్రం పనిచేసినంతకాలం తమ హిందూ ఓటు చెక్కుచెదరదనే అభిప్రాయంతో.. ముస్లింలతో సహా ఇతరులను లెక్కపెట్టడం లేదు. సత్పరిపాలనకు సంబంధించిన అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ చర్యలు.. అమలులో ఉన్న చట్టాలన్నింటినీ ఉల్లంఘించడమే కాదు.. చట్టపాలనను అవమానిస్తున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తుల, సమూహాల హింసకు తీవ్ర అణచివేత సమాధానం కావడం ఆటవిక న్యాయమే అవుతుంది.
రాజకీయ తప్పిదాలు, అతి చర్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన నిరసనకారుల నుంచి నష్టపరిహారం రాబట్టాలని ప్రయత్నం చేస్తోంది. కానీ నిరసన తెలిపేందుకు ప్రజలకున్న రాజ్యాంగపరమైన హక్కులే ప్రాథమికం కానీ అణచివేత కాదన్న విషయం యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మర్చిపోయినట్లు కనబడుతోంది.
శాంతిభద్రతల ప్రయోజనాల రీత్యా కానీ, భారత సార్వభౌమత్వం, సమగ్రత విషయంలో అయినా సరే.. నిరాయుధంగా, శాంతి యుతంగా సమావేశం కావడానికి రాజ్యాంగం దేశప్రజలకు కల్పించిన హక్కుపై అహేతుక ఆంక్షలను రుద్దకూడదని రాజ్యాంగం స్వయంగా నిర్దేశించిన నిబంధనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కచ్చితంగా పాటించడం లేదని బోధపడుతోంది. రాజ్యాంగం పొందుపర్చిన ఈ అత్యంత ముఖ్యమైన ప్రాథమిక విధులను ఉల్లంఘించిన యోగి ప్రభుత్వం ఇప్పటికే అణచివేతకు గురైన వారిపై మరింత అణచివేతను విధించబోతున్నది. పైగా, అణచివేతకు పాల్పడిన పోలీసులను నిర్దోషులుగా నిర్ణయిస్తోంది.
ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే హక్కు తమకుందని ఎవరూ ప్రకటించలేరు. అది నేరం. దానికి న్యాయస్థానం విధించిన పరిహారాన్ని చెల్లించాల్సిందే. కానీ దీనికి అనుసరించాల్సిన పద్ధతి, ప్రక్రియ ఏకపక్షంగా ఉండకూడదు లేక అమాయకులపై గురిపెట్టరాదు. రాజస్తాన్‌లో గుజ్జర్ల హింసాకాండ సందర్భంగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిన సందర్భంలో ఈ అంశంపై సుప్రీంకోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.
న్యాయసలహాదారుగా నన్ను 2007 జూన్ 5న నియమించినప్పుడు నేర లేక సివిల్ వ్యవహారాల్లో అడ్డదిడ్డంగా చర్యలు తీసుకోవడం సాధ్యపడదని, ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం 1984 (పీడీపీపీఏ)ను, సంబంధిత ఇతర చట్టాలను మరోసారి పరిశీలించాలని సుప్రీంకోర్టుకు విన్నవించాను. పైగా ఆనాటి అల్లర్లను అణచివేయడానికి 6 కంపెనీల సైనికులను పంపిన పారామిలిటరీ అధికారులను కె పరాశరన్, నేను స్వయంగా కలిసి విచారించాం కూడా.
అయితే ఈ పీడీపీపీఏ... నేరనిరోధక చర్యలకు ఏమాత్రం తగి నది కాదు పైగా సాధారణ కేసులకు జరిమానాతో సహా ఆరునెలల జైలుశిక్ష విధింపు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు ప్రయోగించిన వారికి ఒకటి నుంచి పదేళ్ల కారాగార శిక్ష విధింపు అనేవి కొత్త నేరాలకు, అపరాధాలకు దారి తీస్తాయి. సామూహికంగా లేదా వ్యక్తిగతంగా ఒకరిపై వేలెత్తి చూపేరీతిలో నేరాలపై చర్యలను తీసుకోరాదు. దానికి ఒక క్రమ ప్రక్రియ అవసరం అవుతుంది.
ఆనాడు రాజస్తాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో గుజ్జర్ల ప్రదర్శన సందర్భంగా జరిగిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిది. సైన్యాన్ని రంగంలో దింపారు. ఈ సందర్భంగా అనేక ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి అరెస్టులు చేశారని, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం చేకూరిందని నా నివేదికలో పొందుపర్చాను. నేను నివసిస్తుండిన న్యూ ఫ్రెండ్స్ కాలనీలో కూడా ఒక డీటీసీ బస్సును తగులబెట్టేశారని కోర్టుకు నివేదించాను. 2007 మే నెలలో ఎన్‌హెచ్8, ఎన్‌హెచ్ 11లో, బురుండి సమీపంలో మోర్దా, బయానా బోనిల్, విరాట్ నగర్ గ్రామాల్లో పోలీసులు జరిపిన కాల్పుల ఘటనల్లో 18 మంది చనిపోయారు.
గుంపు ఒక పోలీసును చచ్చేలా కొట్టారు. ఈ చర్యకు గాను గుజ్జర్లపై సాటి నిరసనకారులైన మీనాలు కూడా తిరగబడ్డారు. ఆనాడు ఘటనలకు సంబంధించిన ప్రతి రిపోర్టునూ జాతీయ టీవీ చానల్స్ ప్రసారాలను పరిశీలించి కోర్టుకు వివరంగా సమర్పించాను. మీడియా బాధ్యతాయుతంగానే నివేదించిందని, ఎక్కడా కల్పించి వార్తల్ని ప్రసారం చేయలేదని పేర్కొన్నాను.
కానీ న్యాయస్థానం నా సమగ్ర నివేదికను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరినీ తప్పుపట్టడమే కాకుండా కత్తిరించి అతికించిన మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన నాటి రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే, గుజ్జర్లతో అయిదు దఫాలుగా చర్చలకు పూనుకున్నారు. తొలి నాలుగు చర్చలు విఫలమైనా 2007 జూన్ 4న చివరిదఫా చర్చలు విజయవంతమయ్యాయి. తర్వాత బెయిన్స్లా– రాజే మధ్య కుదిరిన ఒప్పందాన్ని గుజ్జర్ల మహాపంచాయతీ ఆమోదించింది. దాంతో సైన్యం కూడా బ్యారక్‌లలోకి వెళ్లిపోయింది.
నాటి గుజ్జర్ల హింసాత్మక చర్యలకు, 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న హింసాత్మక చర్యలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. తాజాగా నిరసన తెలుపుతున్న వారితో ఎలాంటి చర్చలూ ప్రారంభించకుండానే ఉత్తరప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు వారిని బలప్రయోగంతో చెదరగొట్టాయి. తీవ్రఆరోపణలు చేశాయి. గుజ్జర్లు, మీనాలు, ఇతర ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకులను బుజ్జగించాలని వసుంధరా రాజే ఆనాడు ప్రయత్నించారు. కానీ 2019లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ముస్లిం ఓట్లను, వామపక్ష ఉదారవాద నిరసనకారులను పక్కన బెట్టవచ్చని భావించాయి. విభజించి పాలించు సూత్రం పనిచేసినంతకాలం తమ హిందూ ఓటు చెక్కుచెదరదనే అభిప్రాయంతో వీరు ముస్లింలతో సహా ఇతరులను లెక్కపెట్టడం లేదు.
గుజ్జర్ల ఘటన సందర్భంగా సుప్రీంకోర్టు ఆనాడు ప్రభుత్వాలకు, వాటి హైకోర్టులకు నిర్దేశించిన విధివిధానాలను ఇప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కానీ లక్నో బెంచ్‌కి చెందిన జస్టిస్ సుధీర్ అగర్వాల్ (బాబ్రీమసీదు కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి) తాజా అల్లర్లకు పాల్పడినవారిపై పీడీపీపీఏ చట్టాన్ని విధించలేదని శోకన్నాలు పెట్టారు.
మరోవైపున యోగి ఆదిత్యనా«థ్ పోలీసుల అతిచర్యలపై ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా, నిరసనకారులపైనే తప్పుమోపారు. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు పోలీసుల ద్వారా జరిగిన విధ్వంసంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే నివేదించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా యూపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇరుపక్షాల పాత్రపై అంతిమంగా న్యాయస్థానం నిర్ణయించాల్సి ఉండగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ ప్రక్రియ మొత్తాన్ని పక్కనబెట్టేసింది.
మరొక ముఖ్యమైన అంశం ఏదంటే హైకోర్టు, సుప్రీంకోర్టు పేర్కొన్న మార్గదర్శక సూత్రాలను కమిషనర్ తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. పోలీసుల వల్ల జరిగిన విధ్వంసాన్ని వివరంగా సమర్పించాల్సి ఉంది. ఈ ముఖ్యమైన భాగాన్ని పాటించకుంటే, పోలీసులు, రాష్ట్రప్రభుత్వ నివేదిక అసంపూర్ణంగానూ, అసందర్భ ంగానూ ఉండిపోతుంది. ఇక్కడ పోలీసుల వల్ల జరిగిన విధ్వంసం అంటే వ్యక్తిని లేక వ్యక్తులను గాయపర్చడం, చంపడం కూడా అని అర్థం. కానీ యూపీ ప్రభుత్వం ప్రైవేట్ నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని పోలీసు చర్యలను పట్టించుకోకపోవడమే పెద్ద విషాదం.
సన్మార్గం కంటే మరింత సన్మార్గంతో తాను వ్యవహరిస్తున్నట్లు నటిస్తున్న యూపీ ప్రభుత్వం కొన్ని నష్టపూరిత చర్యలకు డబ్బు రూపంలో లెక్కగట్టి చూపుతోంది. కానీ ఈ తరహా నష్టాల విషయంలో పక్కా ఆధారాలను చూపించిన తర్వాతే కమిషనర్‌కు వాటిని నివేదించాల్సి ఉంది. జరిగిన నష్టాలకు వాటికి కారకులైన వారికి మధ్య సంబంధాన్ని కచ్చితంగా అంచనా వేయాల్సి ఉంటుంది.
గుజ్జర్ల నిరసన కేసులపై జరిగిన చర్చల సందర్భంగా, రెండు కమిటీలూ నేరం జరిగిన ప్రక్రియలో చోటు చేసుకున్న ఘటనలన్నింటినీ నేరవిచారణలో పొందుపర్చాలని అంగీకరించారు. జరిగిన అకృత్యాలపై సివిల్ చర్య తీసుకోవడానికి నారిమన్ కూడా మద్దతు తెలిపారు. కానీ పదేళ్ల తర్వాత కూడా అలాంటి చట్టం ఏదీ అమలులోకి రాలేదు. సుప్రీకోర్టు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కారణం ఒక్కటే.. ఈ మార్గదర్శకాలను అమలు చేస్తే పోలీసుల అతి చర్యలు, వేధింపులు కూడా న్యాయ పరిశీలనకు వస్తాయి. హింసాత్మక ఘటనలపై రాష్ట్రప్రభుత్వమూ ఏకపక్ష చర్య తీసుకోకూడదు.
పైగా శిక్షార్హమైన నేరచర్యలకు పాల్పడినవారిని తప్పనిసరిగా అరెస్టు చేయవలసిన అవసరం లేదని గతంలో ఏడుగులు సభ్యులతో కూడిన అలహాబాద్ హైకోర్టు పేర్కొన్న విషయాన్ని యూపీ ప్రభుత్వం తప్పకుండా గుర్తుంచుకోవాలి. కానీ తాజా ఘటనల సందర్భంగా యోగి ప్రభుత్వం 5 వేలమందిని నిర్బంధించడమే కాకుండా వారిలో వెయ్యిమందిని అరెస్టు చేసింది కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే సత్పరిపాలనకు సంబంధించిన అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు.. అమలులో ఉన్న చట్టాలన్నింటినీ దారి మళ్లించడమే కాదు.. చట్టపాలనను అవమానిస్తున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది.
వ్యాసకర్త : రాజీవ్ ధావన్, సీనియర్ న్యాయవాది