సహారా అధినేత సుబ్రతారాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు జూలై 20 వరకు పొడిగిచ్చింది. జూలై 15 వరకు రూ.552 కోట్లను సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని, లేకపోతే సహారా గ్రూపుకు చెందిన విలువైన యాంబీ వ్యాలీని వేలం వేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ జూలై 20కు వాయిదావేసింది. అయితే ఆ రూ.552 కోట్ల చెల్లింపులకు మరింత సమయమివ్వాలనే సహారా గ్రూపు సుప్రీంకోర్టును కోరింది. వారి అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఒకవేళ ఈ నగదును జూలై 15 వరకు కట్టకపోతే, తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. తాత్కాలికంగా అయితే యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపుతున్నామని, కానీ రూ.552 కోట్లను చెల్లించపోతే, యాంబీ వ్యాలీ వేలం ప్రక్రియ వెనువెంటనే ప్రారంభమవుతుందని తెలిపింది.
కాగ, గత విచారణ సందర్భంగా రూ.709.82 కోట్లను డిపాజిట్ చేయడానికి సుబ్రతారాయ్‌కు నేటి వరకు అవకాశమిచ్చింది. ఇందుకు అనుగుణంగా తాత్కాలిక బెయిల్‌ను కూడా నేటి(జూలై 5) వరకు పొడిగించింది. జూన్ 15, జూలై 15న సెబీకి వరుసగా రూ.1,500 కోట్లు, రూ.552.22 కోట్లు చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఇంతక్రితమే సహారా రెండు చెక్కులను డిపాజిట్ చేసింది. అయితే ఈ డబ్బును సమకూర్చలేకపోవడాన్ని తీవ్రంగా తీసుకున్న సుప్రీంకోర్టు, మహారాష్ట్రలో సంస్థకు చెందిన రూ.34,000 కోట్ల విలువైన యాంబీ వ్యాలీ జప్తునకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.